ధవళేశ్వరం బ్యారేజ్‌కు కొత్త గేట్లు - రూ.150 కోట్లు కేటాయింపు
గోదావరి డెల్టా ముంపు, ఇరిగేషన్ సమస్యలపై మంత్రి నిమ్మల సమీక్ష - ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి హాజరు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 9, 2025 at 8:43 PM IST
Minister Nimmala Ramanaidu Review with Irrigation Officials: గోదావరి డెల్టా ముంపు, ఇరిగేషన్ సమస్యలపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. గోదావరి జిల్లాల్లో ముంపు సమస్య పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ఈ డిసెంబర్‌కు లాకులు, గేట్లు మరమ్మతులకు సమగ్ర డీపీఆర్ తయారు చేయాలని ఏజెన్సీని ఆదేశించారు. గోదావరి డెల్టా లైడార్ సర్వే కోసం 13.4 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి నిమ్మల సమీక్షించారు. సమీక్షకు ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, గోదావరి డెల్టా సిస్టమ్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
150 ఏళ్లలో ఎప్పుడూ జరగనంత నష్టం గోదావరి డెల్టాకు జగన్ హయాంలో జరిగిందని మంత్రి మండి పడ్డారు. జగన్ గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు అర్ధాంతరంగా నిలిపేసి, డెల్టా ఆధునీకరణకు సైంధవుడిలా అడ్డుపడ్డాడని దుయ్యబట్టారు. జగన్ హయాంలో నిధులు ఉన్నా కాలువలు, డ్రైన్లలో తట్ట మట్టి తీయలేదని, లాకులు, షట్టర్లకు కనీసం గ్రీజు పెట్టడానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ధవళేశ్వరం బ్యారేజ్‌కు కొత్త గేట్లు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహణ సహా అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజ్‌కు కొత్త గేట్లు ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు రూ.150 కోట్లు నిధులు కేటాయించారని మంత్రి తెలిపారు. ఈ మేరకు అవసరమైన చర్యలన్నీ ప్రాతిపదికన తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు: పోలవరం ప్రాజెక్ట్‌లో గ్యాప్ 2 నిర్మాణ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకున్నాయి. మంగళవారం గ్యాప్ 2 ఎగువ ప్రాంతంలో రాళ్లు పరిచే పనులకు పనులకు శాస్త్రోక్తంగా పూజలు చేసారు. జలవనరుల శాఖ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) ప్రతినిధులు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పూజలు నిర్వహించి పనులను అధికారికంగా ప్రారంభించారు.
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు వేగంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. నిర్ణీత గడువులో ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయి ప్రణాళికతో నిర్మాణ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. గ్యాప్ 2 ఎగువ ప్రాంతంలో భూమి పటిష్ఠ పరచడం, రాళ్లు పరచడం ప్రారంభించామన్నారు. అలాగే డయాఫ్రమ్ వాల్ ఎగువ, దిగువ వైపుల మట్టి నింపే పనులు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి అని వివరించారు. గ్యాప్ 1 లో కూడా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇదిలా ఉండగా మరోవైపు పోలవరం నిర్మాణం 5 ఏళ్లు ఆలస్యం కావడం వల్ల రూ.50 వేల కోట్లు నష్టపోయామని మంత్రి నిమ్మల వెల్లడించిన విషయం తెలిసిందే. అలానే పోలవరం నిర్వాసితులకు జగన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, అలానే వరదలు వచ్చినప్పుడు పోలవరం నిర్వాసితులను పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఆ కుటుంబాలకు కనీసం ఇళ్లు కూడా వైఎస్సార్సీపీ నిర్మించలేదని దుయ్యబట్టారు. పోలవరం నిర్వాసితులకు ఇళ్లు నిర్మించేందుకు రూ.900 కోట్లతో టెండర్లు పిలిచామని 2026 మే నాటికి తొలి దశ ఇళ్లు నిర్మిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
2026కి వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి నీరందిస్తాం: మంత్రి నిమ్మల
వైఎస్సార్సీపీ పాలనతో పోలవరం ఆలస్యం - రూ.50 వేల కోట్లు నష్టం: మంత్రి నిమ్మల

