ETV Bharat / state

ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తాం: మంత్రి నిమ్మల

వెలిగొండ నిర్వాసితుల మూడో విడతగా 2,027 కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహారం చెల్లింపు - 3 దశాబ్దాల కల నెరవేరుతున్నందుకు నిర్వాసితులు హర్షం

వెలిగొండ నిర్వాసితుల గురించి మాట్లాడుతున్న మంత్రి నిమ్మల
వెలిగొండ నిర్వాసితుల గురించి మాట్లాడుతున్న మంత్రి నిమ్మల (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 22, 2026 at 12:50 PM IST

2 Min Read
Choose ETV Bharat

Minister Nimmala Over Veligonda Project: ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా వెలిగొండ టన్నెళ్ల నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్‌కు విడుదల చేస్తారని చెప్పారు. వెలిగొండ నిర్వాసితులకు మూడో విడతలో భాగంగా 2,027 కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహారాన్ని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందజేశారు. అనంతరం మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడారు. వెలిగొండ అన్ని పనులు పూర్తి చేసి, నిర్వాసితులకు పరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టును ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. పూర్తికాని వెలిగొండను పూర్తయినట్లు జగన్ జాతికి అంకితం చేయడం ప్రపంచంలోనే ఎనిమిదో వింత అని విమర్శించారు.

ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తాం: మంత్రి నిమ్మల (ETV Bharat)

3 దశాబ్దాల కల: నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.900 కోట్ల పరిహారంలో జగన్ ప్రభుత్వం పైసా కూడా చెల్లించలేదని ఆరోపించారు. నిర్వాసితులను మోసం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని దుయ్యబట్టారు. ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సంక్షేమానికీ ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. మొత్తం 7 నిర్వాసిత కాలనీల్లో 4 కాలనీల్లో 100 శాతం మౌలిక వసతులు పూర్తయ్యాయని, మిగిలిన 3 కాలనీల్లో పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు వెలిగొండ వరమని, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. 3 దశాబ్దాల కల నెరవేరుతున్నందుకు నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యల్ని వారు స్వాగతించారు.

'మా ముప్పై ఏళ్ల కల ఇప్పుడు నెరవేరుతోంది. మంత్రి నిమ్మల రామానాయుడు అపర భగీరుథుడిలా ప్రయత్నం చేసి మాకు అండగా నిలబడ్డారు. ఆయన కృషి వల్లే వెలిగొండ పూర్తయ్యింది. ప్రతీ నిర్వాసితుడికి ఆర్​అండ్​ ఆర్​ సొమ్ము జమ చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం మాకు అన్ని వేళలా అండగా ఉంది.' -నిర్వాసితులు

40 రోజుల్లో 3 విడతలుగా రూ. 768 కోట్లు నిర్వాసుల ఖాతాల్లో వేశాం. వెలిగొండ ప్రాజెక్ట్​ అందుబాటులోకి రావడంతో పాటు దీనికోసం భూములిచ్చిన, ఆస్తులు కోల్పోయిన వారికి న్యాయం చెయ్యడానికి సమ ప్రాధాన్యం ఇచ్చాం. ఈ మేరకు సీఎం చంద్రబాబు సంకల్పించారు. ఆఖరి నిర్వాసితుడి వరకూ ప్రతీ పైసా చెల్లించేలా నేను బాధ్యత తీసుకుంటాను.' -నిమ్మల రామానాయుడు, జలవనరులశాఖ మంత్రి

వెలిగొండ నిర్వాసితుల త్యాగాలను ప్రభుత్వం ఎప్పటికీ మరచిపోదు: సీఎం చంద్రబాబు

తుంగభద్ర నీటి లభ్యతపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష - తాగునీటికే తొలి ప్రాధాన్యం