వెలిగొండ ప్రాజెక్టులో జగన్ మోసం తెలియాలనే రైతులతో కలిసి సమీక్ష: మంత్రి నిమ్మల
వెలిగొండ టన్నెల్ లైనింగ్ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల - ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 12, 2025 at 8:20 PM IST
Nimmala Inspects Tunnel Works of Veligonda Project: వెలిగొండ ప్రాజెక్ట్‌ను 2026 జూన్ నాటికీ పూర్తి చేసి ఈ ప్రాంత వాసులకు తాగు, సాగుకు కృష్ణ జలాలు అందిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రకాశం జిల్లా దొర్నాల మండలం కొత్తూరు సమీపంలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు 2వ సొరంగం పనులను మంత్రి పరిశీలించారు. నెల రోజుల వ్యవధిలో 3వ సారి ఈ ప్రాజెక్టును మంత్రి సందర్శించారు. ప్రత్యేక వాహనంలో సాహసోపేతంగా టన్నెల్లో 18 కిలోమీటర్ల లోపలికి ప్రయాణించిన నిమ్మల క్లిష్టమైన లైనింగ్ పనులను పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం మంత్రి నిమ్మల మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టును గాలికి వదిలేశారని విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెడ్ రెగ్యులేటర్ నందు 2200 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. 18 నెలల కాలంలోనే టన్నెల్స్‌లో క్లిష్టమైన 3 కిలోమీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేశామని మంత్రి నిమ్మల చెప్పారు. ఈ ప్రాజెక్టులో జగన్ చేసిన తప్పిదాలు, దగా, మోసం, జిల్లా రైతులకు తెలియాలనే రైతులతో కలిసి సమీక్ష నిర్వహించామని చెప్పారు.
రూ.456 కోట్లతో టెండర్లు పూర్తి: ప్రస్తుతం 4 గ్యాంట్రీలతో రోజుకు 12 మీటర్ల లైనింగ్ పనులు చేస్తుండగా, గ్యాంట్రీల సంఖ్య పెంచి లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయాలని ఏజెన్సీని ఆదేశించామని మంత్రి చెప్పారు. ఫీడర్ కెనాల్‌లో 45 వేల క్యూబిక్ మీటర్ల హార్డ్ రాక్ పనులు చేయాల్సి ఉండగా ఇప్పటికే 28 వేల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి చేశామని వెల్లడించారు. ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం రూ.456 కోట్లతో టెండర్లు పూర్తి చేశామని అలాగే ఈ డిసెంబర్‌లోనే పనులు మొదలు పెట్టి, సీజన్ వచ్చేలోపు పూర్తి చేయాలని ఏజెన్సీని ఆదేశించామని తెలిపారు. తీగలేరు కెనాల్‌కు సంబంధించి 600 మీటర్ల టన్నెల్ లైనింగ్ చేసి, గేట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నిమ్మల చెప్పారు.
నల్లమల సాగర్ ముంపుతో 9.6 కిలోమీటర్ల పర్మినెంట్ డైవర్షన్ రోడ్డు నిర్మాణ పనులు మొదలుపెట్టామని మొంథా తుపాను కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ గండ్లు పూడ్చి, జంట సొరంగాల్లో డీవాటరింగ్ పనులను పూర్తి చేసి, లైనింగ్ పనులు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. జగన్ వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసే నాటికి ఇంకా రూ.4 వేల కోట్ల విలువైన పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే, పూర్తి చేసినట్టు జాతికి అంకితం చేసి దగా, మోసానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని విమర్శించారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా జగన్ విధ్వంసం చేసిన ఇరిగేషన్ రంగాన్ని చంద్రబాబు గాడిలో పెట్టారని, వెలిగొండ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి నిమ్మల తెలిపారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్వాసితులకు రెండోసారి పరిహారం: నిమ్మల
వైఎస్సార్సీపీ పాలనతో పోలవరం ఆలస్యం - రూ.50 వేల కోట్లు నష్టం: మంత్రి నిమ్మల

