ETV Bharat / state

65వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం - భూమి వినియోగంలో పొదుపు పాటించాలన్న సీఎం చంద్రబాబు

సీఆర్డీఏ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం - 29 గ్రామాల్లో మౌలిక వసతులకు మరో రూ.533 కోట్లు కేటాయింపు - అమరావతి నిర్మాణ పనుల్లో వేగంపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

సచివాలయంలో  65వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం
సచివాలయంలో 65వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 27, 2026 at 6:49 PM IST

3 Min Read
Choose ETV Bharat

Minister Narayana Over CRDA Authority Meeting: 2036లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించేందుకు భారత్‌కు అవకాశం వస్తే వాటి నిర్వహణకు అత్యంత అనువైన ప్రదేశంగా అమరావతిలో ప్రతిపాదిత స్పోర్ట్స్‌సిటీని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ తరహాలో అమరావతి ఓఆర్​ఆర్​ చుట్టూ శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. అందుకే సీఆర్డీఏ వద్ద మిగిలిన 3800 ఎకరాలను అత్యంత పొదుపుగా వినియోగించాలని సూచించారు. సీఆర్డీఏ 65 వ సమావేశం నిర్వహించిన సీఎం అమరావతి నిర్మాణాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల వేగంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ 65వ సమావేశంలో రాజధాని ప్రాంతంలోని మౌలిక వసతులు, విద్య, వాణిజ్యం, హరిత ఇంధనం, భూ సమీకరణకు సంబంధించి పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రాజధానిలోని 29 గ్రామాల్లో మౌలిక సదుపాయల అభివృద్ధికి అదనంగా రూ.533 కోట్లు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. శాఖమూరులో సెంట్రల్‌ లైబ్రరీ, ఆడిటోరియం, హెచ్ఆర్ భవనాల నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.

భూమి వినియోగంలో పొదుపు పాటించాలన్న సీఎం చంద్రబాబు (ETV)

'నగరంలో 135 లీటర్ల నీటిని ప్రతీ ఇంటికి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడున్న పైప్​లైన్లతో ఆ నీటి పంపిణీ చెయ్యడానికి కుదరదు. వాటర్​ పైప్​లను మార్చడానికి అదనంగా రూ. 533 కోట్లు విడుదల చెయ్యడం జరిగింది. ఎల్పీఎల్​ చిన్న రోడ్లు వెయ్యాలనుకున్నాం. కొన్ని సంస్థలతో వీటిని అధ్యయనం చేయించాం. కొత్త నగరానికి తరచూ ఎక్కువ వాహనాల రాకపోకలు ఉంటాయి కానీ సీసీ రోడ్లు వేస్తే దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. ఆ సమస్యకు చెక్​ పెట్టేందుకు బీటీ రోడ్లకు అనుమతులు వచ్చాయి. సెంట్రలైజ్​డ్​ పబ్లిక్​ లైబ్రరీ, ఆడిటోరియం, హెచ్​ఆర్​ భవనాల నిర్మాణాలకు ఐఓసీతో ఎంఓయూలు కుదుర్చుకోవడానికి అనుమతులు వచ్చాయి.' -పి. నారాయణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి

రైతులకు కేటాయించిన ఎల్​పీఎస్​ లేఔట్లలో సీసీ రోడ్లకు బదులుగా బీటీ రహదారులు నిర్మించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. దిల్లీలోని సీఆర్​ఆర్ఐ, ఖరగ్‌పూర్‌ ఐఐటీ అధ్యయనం చేసిన తర్వాత ఇచ్చిన సలహాతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు మంగళగిరి- తాడేపల్లి కార్పొరేషన్‌కు అమరావతి నుంచి తాగునీరు సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. రాజధానిలో డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టమ్‌కు సంబంధించిన ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌ తయారీకి అనుమతి ఇచ్చినట్లు వివరించారు. షాపులు, కార్యాలయాలు లాంటి మిక్స్‌డ్‌ యూజ్‌ ప్రాజెక్టుల కోసం వివిధ ప్రాంతాల్లో 42 ఎకరాలు కేటాయించినట్లు పేర్కొన్నారు.రెండో దశ భూసమీకరణ జరుగుతున్న గ్రామాల్లో రైతుల కుటుంబానికి 1.50 లక్షల చొప్పున రుణమాఫీకి ఆమోదం తెలిపినట్లు వివరించారు. 2026 జనవరి 6 కు ముందు తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందన్నారు.

అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పుంజుకోవడంపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. పనులు మరింత వేగవంతం చేయాలని గుత్తేదారులకు సూచించారు. గడచిన నెల రోజుల్లోనే వెయ్యి కోట్ల విలువైన పనులు జరిగినట్లు అధికారులు వివరించారు. స్థలాలు పొందిన సంస్థలు త్వరగా నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. రాజధానిలో ప్రస్తుతం సీఆర్డీఏ వద్ద మిగిలిన 3800 ఎకరాలను భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా వినియోగించాలని సూచించారు. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ తరహాలో అమరావతి ఓఆర్​ఆర్​ చుట్టూ శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. భూముల విలువ భవిష్యత్ భారీగా పెరగనున్న నేపథ్యంలో సంస్థలకు అవసరమైనంత మేరకే స్థలాలు కేటాయించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

సైబర్ టవర్ల తరహాలో క్వాంటమ్ భవనాలు - సీఆర్‌డీఏ సమావేశం కీలక నిర్ణయాలివే

డిసెంబర్ చివరి నాటికి క్వాంటం బిల్డింగ్‌ పనులు పూర్తి: మంత్రి నారాయణ