ETV Bharat / state

శరవేగంగా రాజధాని అమరావతి పనులు - ప్రతి నెలా ఒక్కో టవర్ నిర్మాణం పూర్తి: మంత్రి నారాయణ

ఈనెల 29న సీడ్ యాక్సెస్ రహదారి మూడోదశ పనులు ప్రారంభం - ప్రతి నెలా ప్రాజెక్టుల వారీగా భవనాలు పూర్తి - తుళ్లూరులో శివాలయం జీర్ణోద్ధరణకు హాజరైన మంత్రి నారాయణ

ఈనెల 29న సీడ్ యాక్సెస్ రహదారి మూడోదశ పనులు ప్రారంభిస్తామన్న మంత్రి నారాయణ
ఈనెల 29న సీడ్ యాక్సెస్ రహదారి మూడోదశ పనులు ప్రారంభిస్తామన్న మంత్రి నారాయణ (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 21, 2026 at 3:56 PM IST

3 Min Read
Choose ETV Bharat

Minister Narayana On Capital Amaravati Works : రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రహదారి మూడో దశ పనులను ఈనెల 29న ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా సాగుతోందన్నారు. రైతుల త్యాగాలతోనే అమరావతి తిరిగి రాజధానిగా రూపుదిద్దుకుందని, ల్యాండ్‌ పూలింగ్‌లో తుళ్లూరు రైతులు ఎంతో సహకరించారని అన్నారు. తుళ్లూరులో వందల ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి, శ్రీ బాలకోటేశ్వర స్వామివారి ఆలయ పునఃశంకుస్థాపన మహోత్సవానికి హాజరైన మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదే ఆలయం నుంచి రైతులు ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పాదయాత్ర ప్రారంభించి విజయం సాధించారని గుర్తు చేశారు.

అమరావతిలో రైతుల రిటర్నబుల్‌ ప్లాట్లలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రతి నెలా ప్రాజెక్టుల వారీగా భవనాలను పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. ప్రస్తుతం స్పోర్ట్స్‌ సిటీ, రైల్వే ట్రాక్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుపై దృష్టి పెట్టామని, 15 రోజుల్లో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును జాతీయ రహదారికి కలిపే మూడో విడత ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు ప్రారంభిస్తామని నారాయణ వెల్లడించారు. రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే లైన్ నిర్మాణంపై దృష్టి సారించామని, తర్వాత విమానాశ్రయం నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఇకపై ప్రతి నెలా ఒక్కో టవర్ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.

శరవేగంగా రాజధాని అమరావతి పనులు - ప్రతి నెలా ఒక్కో టవర్ నిర్మాణం పూర్తి: మంత్రి నారాయణ (ETV Bharat)

"తుళ్లూరు శివాలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. రాజధాని ల్యాండ్ పూలింగ్‌లో తుళ్లూరు రైతులు ఎంతగానో సహకరించారు. రాజధాని రైతుల కుటుంబంలో నేనూ ఒకడిగా ఉండి పూలింగ్ చేశా. ప్రతి నెలా ప్రాజెక్టుల వారీగా భవనాలు పూర్తిచేసి ప్రభుత్వానికి అందజేస్తాం. ప్రాజెక్టుల వారీగా రాజధానిలో ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డుపై దృష్టి పెట్టాం. 15 రోజుల్లో సీడ్ యాక్సెస్ రోడ్డును నేషనల్ హైవేకి కలిపే పనులు ప్రారంభిస్తాం." - నారాయణ, పురపాలక శాఖ మంత్రి

పగలు, రాత్రి తేడా లేకుండా పనులు : మరోవైపు అమరావతి నిర్మాణ ప్రాంగణాల్లో ఇప్పుడు పగలు, రాత్రి అనే తేడా లేకుండా పనులు పరుగులు పెడుతున్నాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో వంద మీటర్ల ఎత్తైన భారీ క్రేన్లు, ఆకాశానికే కాంతి తోరణాలు కడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. జాతరలోని ప్రభలను తలపించే ఈ వెలుగులు రాజధాని పరిధిలోని గ్రామాలకూ స్పష్టంగా కనిపిస్తూ నిర్మాణ జోరును చాటుతున్నాయి. వాతావరణం అనుకూలించడంతో నిర్మాణ సంస్థలు పనుల వేగాన్ని మరింత పెంచాయి. ప్రభుత్వం, సీఆర్‌డీఏ నిర్దేశించిన గడువుల్లో ఐకానిక్‌ భవనాలను పూర్తి చేయడమే లక్ష్యంగా కాంట్రాక్ట్‌ సంస్థలు షిఫ్టుల వారీగా పనులు కొనసాగిస్తున్నాయి. జీఏడీ టవర్‌, నాలుగు హెచ్‌ఓడీ టవర్ల వద్ద రాత్రివేళల్లోనూ భారీ స్థాయిలో పనులు సాగుతుండటంతో అమరావతి ఇప్పుడు ‘నిర్మాణ నగరం’గా కళ్లముందు సాక్షాత్కరిస్తోంది.

అమరావతి ఐకానిక్‌ సెక్రటేరియట్‌ టవర్ల నిర్మాణంలో అత్యాధునిక డయాగ్రిడ్‌ టెక్నాలజీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కింద నుంచి పైవరకు ఏడు నుంచి తొమ్మిది డైమండ్‌ ఆకృతులు వచ్చేలా ప్రత్యేక ఇంజినీరింగ్‌ డిజైన్‌తో ఈ టవర్లను నిర్మిస్తున్నారు. ఏటవాలుగా ఏర్పాటు చేసే డయాగ్రిడ్‌ పిల్లర్లు ఒకచోట కలసి, మళ్లీ విడిపోయి పక్కనున్న పిల్లర్లతో అనుసంధానమవుతూ భవనానికి అపూర్వమైన బలం, రూపాన్ని అందిస్తాయి. ఒక్కో డైమండ్‌ నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని ఆరు అంతస్తుల చొప్పున నిర్మాణాన్ని పైకి తీసుకెళ్తున్నారు.

సీడ్ యాక్సెస్ రోడ్డులో ‘ఎస్ ’ఆకారపు మలుపులు - అపోహలకు ప్రభుత్వం చెక్

అమరావతి 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతులు - 27న టెండర్లు ఖరారు: మంత్రి నారాయణ