మంత్రి లోకేశ్‌కు దక్షిణ కొరియా ఆహ్వానం - నేటి నుంచి 6 రోజుల పాటు పర్యటన
నేటి నుంచి ఆరురోజులపాటు దక్షిణ కొరియాలో లోకేశ్ పర్యటన - పర్యటనలో వివిధ మంత్రిత్వశాఖల ప్రతినిధులతో అధికారిక సమావేశాలు - ఇండియా డయాస్పోరా ఆత్మీయ సమావేశానికి హాజరుకానున్న లోకేశ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 5, 2026 at 10:01 AM IST
Minister Lokesh South Korea Tour : నేటి నుంచి 6 రోజుల పాటు మంత్రి లోకేశ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణ కొరియా)లో పర్యటించనున్నారు. దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేసేందుకు తమ దేశంలో పర్యటించాలని రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఆయణ్ని ఆహ్వానించింది. వారి ఆహ్వానం మేరకు ఈరోజు నుంచి ఈ నెల 11 వరకు ఆరు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొరియాలో వివిధ మంత్రిత్వశాఖల ప్రతినిధులతో అధికారిక సమావేశాల్లో లోకేశ్ పాల్గొంటారు.
ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ అధికారిక సమావేశాలను నిర్వహిస్తున్నామని దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్ చాంగ్ న్యూన్ కిమ్ మంత్రి లోకేశ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య మరింత సహకారం, సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన కీలక అడుగు కాగలదని భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే నేడు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఇండియా డయాస్పోరా ఆత్మీయ సమావేశానికి లోకేశ్ హాజరకానున్నారు. అక్కడి భారతీయులు, తెలుగువారిని ఉద్దేశించి లోకేశ్ ప్రసంగిస్తారు. ఈ నెల 6న దక్షిణ కొరియా టెక్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంతో పాటు వివిధ సంస్థలతో పెట్టుబడి చర్చల్లో పాల్గొంటారు. అనంతరం హ్యోసంగ్ భారీ పరిశ్రమ సంఘం అధ్యక్షుడు టకేషి యొకోటా, సియోల్ సెమికండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ టేహ్యుంగ్ లీతో సమావేశమవుతారు.
ఈనెల 7న ఎల్జీ కెమ్ గ్లోబల్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్, ఎల్జీ ఓవర్ సీస్ కంపెనీస్ హెడ్ ఏర్పాటు చేసిన విందు సమావేశంలో లోకేశ్ పాల్గొంటారు. ఎల్జీ అనుబంధ సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు ఈ సమావేశానికి హాజరుకానున్నాయి. 8న కొరియన్ మెరైన్ అక్విప్ మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశానికి లోకేశ్ హాజరవుతారు. ఈనెల 9న కొరియన్ పొలిటికల్ ఎఫైర్స్ డిప్యూటీ మినిస్టర్ మిస్. యుయి-హే సిసిలియా చుంగ్‌తో భేటీ అవుతారు. అనంతరం కొరియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ & ఇన్వెస్టిమెంట్స్ డిప్యూటీ మినిస్టర్ కాంచన్ కాంగ్‌తో సమావేశమవుతారు.
ఈనెల 10న వివిధ సంస్థల ప్రతినిధులతో పెట్టుబడి చర్చలతో పాటు కొరియా ఆటో ఇండస్ట్రీ కోఆపరేషన్ ఏజన్సీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశానికి లోకేశ్ హాజరవుతారు. అదేరోజు రాత్రి సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్–2026 విజయవంతం చేయాలని కోరుతూ కొరియా కంపెనీల ప్రతినిధులతో రోడ్ షోలో పాల్గొంటారు.
దేశ ఆర్థిక విప్లవానికి ఏపీ నాయకత్వం వహించాలనేదే మా లక్ష్యం: మంత్రి లోకేశ్
పాలకులు మారినా పాలసీలు మారకూడదు - ప్రపంచస్థాయి కోచ్‌లను తీసుకొస్తాం: మంత్రి లోకేశ్

