ETV Bharat / state

టీచర్లే మన లీడర్లు, రేపటి 'ఛేంజ్ మేకర్లు' - సింగపూర్ వెళ్లి వచ్చిన ఉపాధ్యాయులతో మంత్రి లోకేశ్ భేటీ

కష్టపడే టీచర్లకు ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది - ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ సాధనే మన ముందున్న లక్ష్యం - సింగపూర్ వెళ్లి వచ్చిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులతో మంత్రి లోకేశ్ భేటీ

​Nara Lokesh Meets Teachers
​Nara Lokesh Meets Teachers (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 26, 2026 at 9:30 PM IST

3 Min Read
Choose ETV Bharat

Minister Nara Lokesh Meets Singapore Visit Teachers : "సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉపాధ్యాయులను సాధారణ ఉద్యోగులుగా చూడటం లేదు. వారిని సమాజాన్ని మార్చే 'లీడర్లు'గా భావిస్తోంది. కష్టపడి మెరుగైన ఫలితాలు సాధించే టీచర్లకు ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఇస్తాం." అని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులే లక్ష్యంగా ఆయన ఉపాధ్యాయులకు కీలక దిశానిర్దేశం చేశారు.

ఇటీవల రాష్ట్రానికి చెందిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులు సింగపూర్ వెళ్లారు. అక్కడ విద్యావిధానంపై వారు లోతైన అధ్యయనం చేశారు. ఈ యాత్ర ముగించుకుని వచ్చిన వారితో మంత్రి లోకేశ్ తన ఉండవల్లి నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సింగపూర్‌లో వారు నేర్చుకున్న కొత్త విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ వినూత్న పద్ధతులను మన రాష్ట్రంలో ఎలా అమలు చేయవచ్చో ఉపాధ్యాయులు మంత్రికి సవివరంగా తెలియజేశారు.

విద్యాశాఖపై లోకేశ్ పట్టుదల : విద్య ద్వారానే సమాజంలో అసలైన మార్పు వస్తుందని లోకేశ్ బలంగా విశ్వసిస్తున్నారు. అందుకే ఆయన ఎంతో పట్టుదలతో, కమిట్‌మెంట్‌తో విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు. "ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పే వారు కాదు. సమాజంలో మార్పునకు నాయకత్వం వహించే లీడర్లు" అని లోకేశ్ కితాబిచ్చారు. ప్రపంచంలోనే అత్యుత్తమ మోడల్ విద్యా విధానాన్ని మన రాష్ట్రంలో తీసుకురావడానికి నిరంతరం అధ్యయనం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

సీఎం చంద్రబాబు ఆశించిన 'స్వర్ణాంధ్ర' సాధనలో విద్యాశాఖ పాత్ర చాలా కీలకమని, భవిష్యత్తు అంతా సాంకేతికతదే అని లోకేశ్​ పేర్కోన్నారు. అందుకే విద్యావ్యవస్థలో క్వాంటమ్, ఏఐ వంటి అధునాతన టెక్నాలజీలను తీసుకురాబోతున్నట్లు ఆయన తెలిపారు. ఇది కేవలం విద్యాశాఖ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. తన వ్యక్తిగత అనుభవాలను కూడా ఆయన టీచర్లతో పంచుకున్నారు. తాను చిన్న వయసులోనే అమెరికా వెళ్లానని, ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నానని గుర్తుచేసుకున్నారు. అక్కడ దాదాపు 100 దేశాలకు చెందిన విద్యార్థులతో కలిసి నాలెడ్జ్, కల్చర్ పంచుకునే అవకాశం తనకు లభించిందన్నారు.

ఛేంజ్ మేకర్స్‌గా మారాలి : విదేశాల్లో శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులంతా 'ఛేంజ్ మేకర్స్'గా మారాలని లోకేశ్ పిలుపునిచ్చారు. సింగపూర్‌లో నేర్చుకున్న వినూత్న విధానాలను తమ స్కూళ్లలో, క్లస్టర్లు, మండలాల్లో అమలు చేయాలన్నారు. తోటి టీచర్లకు మెంటార్లుగా వ్యవహరించి నాయకత్వం వహించాలని సూచించారు. విద్యావ్యవస్థలో టీచర్ - స్టూడెంట్ - సబ్జెక్ట్ మధ్య అనుబంధం అత్యంత ముఖ్యమన్నారు. రాష్ట్రంలో 'లీప్ మోడల్' విద్యావ్యవస్థ సాధన కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

టీచర్లు ఇకపై బోధనేతర పనుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, వారు కేవలం బోధనపైనే పూర్తి శ్రద్ధ పెట్టాలని లోకేశ్ చెప్పారు. విద్యావ్యవస్థలో మనం ఆశించిన మార్పు ఒక్కరోజులో రాదని, దానికి కాస్త సమయం పడుతుందన్నారు. అయితే, కూటమి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల ఇప్పటికే అద్భుతమైన మార్పులు మొదలయ్యాయన్నారు. ఈ ఒక్క ఏడాదే లక్ష మందికి పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లను వదిలేశారని, తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. ఇది విద్యాశాఖకు దక్కిన అతిపెద్ద విజయమని, ఇదొక గొప్ప శుభపరిణామమని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ప్రైవేటు స్కూళ్లలో ఉన్న వారి కంటే మన ప్రభుత్వ ఉపాధ్యాయులే అత్యుత్తమమని ఆయన ప్రశంసించారు.

ఇతర దేశాలతోనే మన పోటీ : రాష్ట్రంలో ఆదర్శవంతమైన 'ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్' తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికి టీచర్ల పూర్తి సహకారం కావాలని మంత్రి కోరారు. అందరం కలిసికట్టుగా అత్యుత్తమ ఫలితాలు సాధిద్దామన్నారు. లక్షలాది మంది పేద బిడ్డల భవిష్యత్తు టీచర్ల చేతుల్లోనే ఉందన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని లోకేశ్ చెప్పారు. ఇప్పుడు మన పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు, ఇతర దేశాలతోనే అని స్పష్టం చేశారు.

ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గతంలోలా ఎటువంటి పైరవీలకు తావులేకుండా 'టీచర్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్'ను కచ్చితంగా అమలు చేశామన్నారు. సీనియారిటీ ప్రాతిపదికన పారదర్శకంగా బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చామని మంత్రి లోకేశ్ గుర్తుచేశారు.

ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలి: లోకేశ్​

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకూ విద్యాకానుక కిట్లు - మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం