కొరియన్ పెట్టుబడిదారులకు నమ్మకమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: మంత్రి లోకేశ్
దక్షిణ కొరియాలో ఐదో రోజు మంత్రి లోకేశ్ పర్యటన - పలువురితో వరుస సమావేశాలు - ఏపీలో కొరియన్ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేశ్ విజ్ఞప్తి

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 9, 2026 at 3:16 PM IST
Lokesh South Korea Investment Tour : మంత్రి లోకేశ్ దక్షిణ కొరియా పర్యటన ఐదో రోజు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆయన సియోల్‌లో పలువురితో భేటీ అయ్యారు. ఏపీలో ఇంటిగ్రేటెడ్ ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని విస్తరించాలని కోరారు. విశాఖ పోర్టు సమీపంలో సీకేడీ అసెంబ్లింగ్, ఎక్స్‌పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈవీ-కాంపోనెంట్ల తయారీ కేంద్రాన్ని స్థాపించాలని, ఈవీ పవర్‌ట్రెయిన్ టెస్టింగ్ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కియా ప్రతినిధులు ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని లోకేశ్‌కు తెలిపారు.
అనంతరం లోకేశ్, దక్షిణకొరియా రాజకీయ వ్యవహారాలు, విదేశాంగశాఖ ఉపమంత్రి యుయ్-హే సిసిలియా చుంగ్‌తో సమావేశమయ్యారు. ఏపీలో అమలుచేస్తున్న 3ఎస్ (స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్) విధానం కొరియా పెట్టుబడిదారులకు రక్షణ కవచంలా నిలుస్తుందని లోకేశ్ తెలిపారు. భారత్‌లో ఆంధ్రప్రదేశ్‌ను అత్యంత స్థిరమైన, నమ్మకమైన కేంద్రంగా చేసుకునేలా పరిశ్రమదారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు.
ఏపీలో అందించే పన్నురాయితీలు, తక్కువధరకే భూమి, సబ్సిడీలు పరిశ్రమదారులకు మద్దతుగా నిలుస్తాయని లోకేశ్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పుతీరంలో సురక్షితమైన, నమ్మకమైన, స్నేహపూర్వక ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని చెప్పారు. దీనివల్ల ప్రపంచ సప్లై చైన్ నష్టాలను కూడా తగ్గించడానికి ఆస్కారం ఏర్పడుతుందని తెలిపారు.
'కేవలం భారీ పరిశ్రమలే కాకుండా గ్రీన్ ఎనర్జీ, వినియోగ వస్తువులు, మోడరన్ రిటైల్, టూరిజం, అడ్వాన్స్ డ్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కొరియన్ పెట్టుబడులకు ఏపీ స్వాగతం పలుకుతోంది. ఫ్యాక్టరీల ప్రారంభానికి ముందే కొరియన్ వర్క్ స్టాండర్ట్స్, లాంగ్వేజ్, కల్చర్‌పై స్థానిక యువతను సిద్ధం చేసేందుకు దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త శిక్షణా అకాడమీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖలు సంసిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కొరియన్ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలి' అని లోకేశ్ యుయ్-హే సిసిలియా చుంగ్‌ను కోరారు.
'భారతదేశంలో ఏపీకి సొంతమైన రెండో అతి పొడవైన తీరప్రాంతం, ప్రధానమైన డీప్ వాటర్ పోర్ట్స్ (విశాఖపట్నం, కృష్ణపట్నం, కొత్తగా రాబోయే 4 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు) వల్ల తక్కువ ఖర్చుతో ఎగుమతులకు లాంచ్ ప్యాడ్ అయ్యే అవకాశముంది. కొరియా వ్యాపారాలకు భారతీయ మార్కెట్లో ప్రవేశం కల్పించి, తద్వారా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు విస్తరించేందుకు వీలు కల్పిస్తుంది. భారత్-కొరియా వ్యూహాత్మక భాగస్వామ్యానికి అనుబంధంగా ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్-కొరియా ఇన్వెస్ట్మెంట్ డెస్క్, ఇరు ప్రాంతాల నడుమ వార్షిక ఆర్థిక భాగస్వామ్య చర్చలకు చొరవ చూపండి. శాశ్వత వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి, విశాఖపట్నం – బుసాన్/ఇంచియాన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఏపీలోని యూనివర్సిటీల్లో కొరియన్ లాంగ్వేజ్ సెంటర్లు, డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీకి చొరవ చూపాలని' లోకేశ్ యుయ్-హే సిసిలియా చుంగ్‌ను విజ్ఞప్తి చేశారు.
Lokesh on Sunic System Co Ltd : ఆ తర్వాత లోకేశ్, సెమీకండక్టర్స్, ఓఎల్ఈడీ, పెరోవ్‌స్కైట్ డిపాజిషన్ పరికరాల తయారీలో పేరెన్నికగన్న సునిక్ సిస్టమ్ కో లిమిటెడ్ (దక్షిణ కొరియా) సీఈఓ ఎస్.డబ్ల్యూ. చుంగ్, సంస్థ ఉన్నతస్థాయి బృందంతో భేటీ అయ్యారు. ఏపీలోని శ్రీసిటీలో సునిక్ సిస్టమ్స్ డిస్ప్లే పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటుకు ముందుకొస్తే జాయింట్ వెంచర్ కోసం సహకారం అందిస్తామని చెప్పారు.
ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0తోపాటు ఏపీ సెమీ కండక్టర్, డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ కింద ప్రోత్సాహకాలు అందిస్తామని లోకేశ్ వివరించారు. సెమీకాన్ టెక్‌పై నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడానికి, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలని కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థ ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని సునిక్ సిస్టమ్స్ సీఈవో ఎస్.డబ్ల్యు. చుంగ్ అన్నారు.
అనంతరం లోకేశ్, ఆ దేశ అంతర్జాతీయ వాణిజ్య, పెట్టుబడుల ఉపమంత్రి కామ్చాన్ కాంగ్‌తో సమావేశమయ్యారు. ఏపీని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దడమే కాకుండా, 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి మద్దతుగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, నౌకా నిర్మాణ రంగాల్లో కొరియా నైపుణ్య సహకారాన్ని అందించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర యువతను ఫ్యూచర్ స్కిల్ వర్క్ ఫోర్స్‌గా మార్చేందుకు ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్ రంగాల్లో కొరియా పరిశోధనా సంస్థలతో ఉమ్మడి భాగస్వామ్యాన్ని ఆయన కోరారు.
Lokesh South Korea Updates : కొరియన్ కంపెనీల కోసం ఏపీలో ప్రత్యేకంగా కొరియా పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు ల్యాండ్ బ్యాంక్ ద్వారా భూమిని అందిస్తామని, పూర్తిస్థాయి సౌకర్యాల కోసం ఒక ప్రత్యేక కొరియా-డెస్క్ ఏర్పాటు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రాబోయే భారీ 10 గిగా వాట్ల సామర్థ్యం గల డేటా-సెంటర్ ప్రాజెక్టుల రూపకల్పనలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రభుత్వంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఆకాంక్షించారు. ఏపీలో కొత్తగా రాబోతున్న 4 గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, కొత్త విమానాశ్రయాల నిర్మాణంలో భాగస్వాములు కావాలని శాంసంగ్, హన్వా ఓషన్ వంటి కొరియన్ దిగ్గజ సంస్థలను ఆహ్వానించారు.
రాష్ట్రంలో అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల గత రెండేళ్లలోనే గూగుల్, ఎల్జీ వంటి దిగ్గజాల నుండి 240 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించామని లోకేశ్ స్పష్టంచేశారు. గ్రీన్ఎనర్జీ రంగంలో 2030 నాటికి 160 గిగా వాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇందులో ఎస్‌కే ఎనర్జీ, ఎల్జీ ఎనర్జీ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టాలని కోరారు.
దక్షిణప్రాంతం, ఆగ్నేయాసియాలోనే ఏపీని ప్రధాన లాజిస్టిక్స్, జలరవాణా కేంద్రంగా మార్చడమే తమ ధ్యేయమని లోకేశ్, ఉపమంత్రి కామ్చాన్ కాంగ్‌కు వివరించారు. అంతిమంగా, మౌలిక సదుపాయాలు మరియు సుస్థిరాభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన దక్షిణ కొరియా వ్యూహాత్మక సహకారంతో స్వర్ణాంధ్ర – 2047 దార్శనికతను విజయవంతంగా చేరుకుంటామని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.
దక్షిణకొరియాలో నాలుగో రోజు మంత్రి లోకేశ్ పర్యటన - ఏపీలో పెట్టుబడులకు బూ యంగ్ గ్రూప్ ఆసక్తి
'ఏపీలో ఈవీ సెమీ కండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయండి' - దక్షిణకొరియాలో మూడో రోజు లోకేశ్ పర్యటన

