జెన్‌జీ ఆశించే విధంగా సంస్కరణలు - ఇగోలు లేకుండా చర్చకు టీడీపీ అందరి వేదిక: లోకేశ్
సంస్కరణలపై ఇగోలు లేకుండా చర్చకు తెలుగుదేశం పార్టీ అందరి వేదిక - మీడియాతో మంత్రి నారా లోకేశ్ ఇష్టాగోష్టి

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 28, 2026 at 4:43 PM IST
|Updated : May 28, 2026 at 8:08 PM IST
Lokesh on TDP Mahanadu 2026 : రాజకీయాలైనా, ప్రభుత్వమైనా సంస్కరణలకు తెలుగుదేశం నాంది అని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. 'కార్యకర్తే అధినేతతో పాటు నా తెలుగుదేశం - నా బాధ్యత నినాదాన్ని బలంగా తీసుకెళ్తామని' వెల్లడించారు. జెన్ జీ పార్టీ నుంచి ఏం అశిస్తుందో అందుకు తగ్గట్టుగా సంస్కరణలు నిరంతరం ఉంటాయని స్పష్టం చేశారు. రాజకీయాల్లో సంస్కరణలనేవి నిరంతర ప్రక్రియన్నారు. మంగళగిరిలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
సంస్కరణలపై ఇగోలు లేకుండా కూర్చుని ఎంతైనా చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అందరి వేదికని లోకేశ్ స్పష్టం చేశారు. రెండో రోజు మహానాడులో మధ్యాహ్నం వరకూ 11.27లక్షల మంది హాజరయ్యారని పేర్కొన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. అతివలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు. అంతేకాక నియోజకవర్గాల్లో సమర్ధ మహిళ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని వివరించారు. ఈ సంస్కరణను ఓ క్రమపద్ధతిలో చేసి చూపెడతామన్నారు.
డీఎస్సీలో ఒక్క నియామకమైనా నిబంధనలకు విరుద్ధంగా ఉందనే విషయాన్ని చూపే ధైర్యం గొడ్డలి పార్టీ నేతకు ఉందా అని లోకేశ్ ప్రశ్నించారు. దీనిపై ఎన్ని కోర్టు కేసులు వేసినా న్యాయస్థానం అన్నింటికీ క్లీన్‌చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. జగన్ ట్యూబ్‌లైట్ కాబట్టే నియామకాలు జరిగిన ఆరు నెలల తర్వాత డీఎస్సీపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని మండిపడ్డారు. రాజారెడ్డి రక్తచరిత్రపై జగనే ప్రస్తావన తెచ్చి ప్రజలందరికీ తెలిసేలా చేశారని లోకేశ్ ఎద్దేవా చేశారు.
"గొడ్డలి పార్టీ నేత విమర్శలే పనిగా పెట్టుకున్నారు. ఒక్క టీచర్ పోస్టు అయినా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందా? కోర్టు కేసులు ఎన్ని వేసినా న్యాయస్థానం అన్నింటికీ క్లీన్‌చిట్ ఇచ్చింది. నియామకాలు జరిగిన 6 నెలల తర్వాత డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారు. రాజారెడ్డి రక్తచరిత్రపై జగనే ప్రస్తావన తెచ్చి ప్రజలందరికీ తెలిసేలా చేసుకున్నారు." - లోకేశ్, మంత్రి
మహిళలకు 33 శాతం సీట్లు - లోకేశ్ ప్రతిపాదనపై మహిళా నేతల హర్షం
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి - రెండో రోజు మహానాడులో ఏకగ్రీవ తీర్మానం

