రెడ్ బుక్‌లో జగన్ పేరుందో లేదో త్వరలోనే తెలుస్తుంది: మంత్రి లోకేశ్
ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న మంత్రి లోకేశ్ - పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఏపీకి రాకపోతే తర్వాత బాధపడతారని వెల్లడి, పవన్ నాకు జీవితాంతం పెద్దన్నేనని మోడరేటర్ అడిగిన ప్రశ్నకు బదులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 28, 2026 at 8:32 AM IST
Minister Nara Lokesh At Ideas of India Summit 2026: రెడ్ బుక్‌లో జగన్ పేరు ఉందో, లేదో త్వరలో తెలుస్తుందని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలపై తప్పుడు కేసులు పెట్టి వేధించిన వారి పేర్లు రెడ్ బుక్‌లో ఉంటాయని, చట్టాలను ఉల్లంఘించిన వాళ్లు, అందుకు ప్రేరేపించిన రాజకీయ నేతలు, చిత్రహింసలు పెట్టినవారి పేర్లు సైతం అందులో ఉంటాయని లోకేశ్ స్పష్టం చేశారు. 2019-24 మధ్య తిరుమల లడ్డూలో పెద్ద ఎత్తున కల్తీ జరగడం వాస్తవమని, దానిలో వివిధ రకాల రసాయన పదార్థాలు వినియోగించారని చెప్పారు.
ముంబయిలో ఓ జాతీయ మీడియా నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఐడియాస్ ఆఫ్ ఇండియా-2026 పేరిట నిర్వహించిన సదస్సులో లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జగన్ హయాంలో జరిగిన ఈ అపచారానికి, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా తాను ప్రపంచమంతా ఉన్న హిందూ సమాజానికి క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. సిట్ నివేదిక ప్రకారం టీటీడీ మాజీ ఛైర్మన్‌తో సహా ఏ ఒక్కరూ చట్టం నుంచి తప్పించుకోలేరని, రేపు ఎవరైనా ఇలాంటి నేరానికి పాల్పడాలంటే వెయ్యిసార్లు ఆలోచించేలా చేస్తామని హెచ్చరించారు.
పవన్ నాకు జీవితాంతం పెద్దన్నే: తిరుమలలో ప్రపంచస్థాయి టెస్టింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కష్టకాలంలో వెన్నంటి నిలిచిన పవన్‌కల్యాణ్ తన బిగ్ బ్రదర్, జీవితాంతం ఆయన తన పెద్దన్నేనని మోడరేటర్ అడిగిన ప్రశ్నలకు లోకేశ్ బదులిచ్చారు. అమరావతికి ఎంతో భవిష్యత్ ఉంది, పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఏపీకి రాకపోతే, తర్వాత బాధపడతారని ఈ సందర్భంగా లోకేశ్ వివరించారు.
ప్రతి 100 రోజులకు ఓసారి అమరావతిని సందర్శించాలని పారిశ్రామికవేత్తలను మంత్రి లోకేశ్ కోరారు. రాజధాని నిర్మాణం ఎంత వేగంగా జరుగుతుందో చూడండి, రాజధాని పేరిట ఒక నగరాన్ని మాత్రమే నిర్మించడం లేదని మంత్రి అన్నారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్లు నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. వీటిలో పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. అందులో ఏదో ఒక సెక్టారును మాత్రమే కాకుండా, దాని అనుబంధ పరిశ్రమలన్నీ తీసుకొచ్చేలా చూస్తున్నామన్నారు.
దేశానికి రాష్ట్రాలే బలమన్న లోకేశ్: ఒక రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదాన్ని తాము బలంగా నమ్ముతామని మంత్రి లోకేశ్ అన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలు దేశాన్ని బలంగా తయారుచేస్తాయని ఆయన తెలియజేశారు. తాము వృద్ధిరేటు, పెట్టుబడులతోపాటు, తదుపరి తరం విద్య కీలక పాత్ర పోషిస్తుందని నమ్ముతున్నామని వెల్లడించారు. 2047 నాటికి ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దాలనేది లక్ష్యమని తెలిపారు. చంద్రబాబు మాటిస్తే జరిగి తీరుతుందని, ఆయన ఇచ్చిన లక్ష్యాలను అధిగమించడమే మా ముందున్న లక్ష్యమని మంత్రి లోకేశ్ వివరించారు.
చంద్రబాబు 75 ఏళ్ల యంగ్ మ్యాన్: చంద్రబాబు టఫ్ టాస్క్‌మాస్టర్. 10 కేజీలు ఎత్తితే, 14 కేజీల లక్ష్యాన్ని ఇస్తారని మంత్రి లోకేశ్ అన్నారు. 14 కేజీలు ఎత్తితే, 18 కేజీలు ఇస్తారని, దీనికి అంతం ఉండదని చమత్కరించారు. ఆయన ఇచ్చిన టాస్క్ పూర్తిచేయడమే మా పని, చంద్రబాబు 75 ఏళ్ల యంగ్ మ్యాన్, ఇప్పటికీ 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తారన్నారు. క్వాంటమ్ వ్యాలీపై తొలిసారి నన్ను మీటింగ్‌కు పిలిచి, దాని గురించి అడిగారని తెలిపారు. అయితే నేను టేబుల్ కింద సెల్‌ఫోన్‌లో చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తూ, దీనిపై ఒక పేజీ నోట్ ఇవ్వాలని కోరానని లోకేశ్ వివరించారు. స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ చదివిన నాకు దానిపై అవగాహన లేదు. కానీ చంద్రబాబుకు ఉంది. ఆయన ఆలోచనలను అందుకోవడం చాలా కష్టమని లోకేశ్ తెలిపారు.
పారిశ్రామికవేత్తలు ఏపీని ఎంచుకోవడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అద్భుతమైన ట్రాక్‌రికార్డు కలిగిన, అనుభవజ్ఞుడైన సీఎం మా వద్ద ఉండటమని లోకేశ్ పారిశ్రామికవేత్తలకు వివరించారు. రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. కేవలం 17 నెలల్లోనే దేశంలో అతిపెద్దదైన అర్సెలర్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు అన్ని అనుమతులు ఇచ్చామని గుర్తు చేశారు. మార్చి మూడో వారంలో దానికి శంకుస్థాపన చేయబోతున్నామని వివరించారు. ఇక మూడోది డబులింజన్ బుల్లెట్ రైల్ సర్కారు, దిల్లీలో మోదీ, ఏపీలో నాయుడు కాంబినేషన్‌ను నమో (నాయుడు-మోదీ)గా నేను పిలుస్తానని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
ఏపీకి 25.3 శాతం పెట్టుబడులు: దీనివల్ల మేం పెద్దఎత్తున పెట్టుబడులు రాబట్టగలిగామని మంత్రి లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకి రావడానికి వారి నాయకత్వమే ప్రధాన కారణమన్నారు. డాటా సెంటర్ పాలసీ కోసం మేం తీవ్రంగా ప్రయత్నించి సఫలీకృతులయ్యామని ఆనందం వ్యక్తం చేశారు. దేశానికి ప్రయోజనం చేకూర్చే ప్రేమ్ వర్క్‌ను మేం రూపొందించామని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడామన్నారు. దీనికి రూ.16,000 కోట్ల ఆర్థిక సాయం అందిందని వివరించారు.
స్టీల్‌ప్లాంట్ ఇప్పుడు లాభాల్లో పయనిస్తూ దేశాభివృద్ధికి సహకరిస్తోందని మంత్రి లోకేశ్ తెలిపారు. కాంపిటేటివ్ అడ్వాంటేజ్‌లో మేం 99 పైసలకే ప్రధాన కంపెనీలకు భూములిస్తున్నారు. ఫార్చూన్ 500 కంపెనీలను రప్పించేందుకు ప్రత్యేక పాలసీ రూపొందించామని వెల్లడించారు. మేం ఇచ్చే భూమి కంటే ఆ కంపెనీలు సృష్టించే ఎకోసిస్టమ్ ఎన్నో రెట్లు పెద్దదని పేర్కొన్నారు. కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్‌ను దావోస్‌లో కలిసి మాట్లాడానని తెలియజేశారు.
రాష్ట్రానికి కలిగే ప్రయోజనం పెద్దది: రెండోసారి దావోస్‌కు వెళ్లే సరికి, విశాఖలో ఆ కంపెనీ భూమి పూజ చేసిందని లోకేశ్ వివరించారు. వచ్చే ఏడాది దావోస్ వెళ్లేసరికి ఇక్కడ భవనాలు పూర్తవుతాయని ధీమా వ్యక్తం చేశారు. దీనివల్ల విశాఖలో యువతకు 25,000 ఉద్యోగాలొస్తాయని అన్నారు. ఏటా రూ.1,500 కోట్ల ఆర్థిక కార్యకలాపాలు వస్తాయి, భూమి విలువ కంటే, ఆ కంపెనీ ద్వారా రాష్ట్రానికి కలిగే ప్రయోజనం పెద్దదని, దీనిని చూడాలని లోకేశ్ పారిశ్రామికవేత్తలందరినీ కోరారు.
దిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు దేశ ఇమేజ్‌ను మసకబార్చేలా ఉందని మంత్రి లోకేశ్ ఎద్దేవా చేశారు. 21 దేశాల అధినేతలు ఉన్నచోట రాజకీయాలు చేయడం చాలా తప్పని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అలా చేసి ఉండకూడదన్నారు. రాజకీయ పార్టీగా మేం దాన్ని ఖండించామని వివరించారు. ఏపీలో గత ప్రభుత్వాల హయాంలో పెట్టుబడులు వస్తే, మేం వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. అంతేకాకుండా ఎవరికీ లేఖలు రాయలేదన్నారు. మేము ఎప్పుడూ పరిశ్రమలను స్వాగతించామని వెల్లిబుచ్చారు.
కొత్త మార్కెట్లపై అన్వేషణ: యూఎస్ ట్రేడ్ డీల్‌లో ఏర్పడిన గందరగోళం నేపథ్యంలో మేం సంక్షోభం నుంచి అవకాశాలు వెతుక్కున్నామన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆక్వా ఎగుమతిదారుగా ఉన్న మేము, ట్రేడ్ వార్ సమయంలో రైతులకు మద్దతుగా నిలిచి, కొత్త మార్కెట్లను అన్వేషించాం. రష్యా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా మార్కెట్లకు ద్వారాలు తెరిచాం. తర్వాత ట్రేడ్ డీల్ వచ్చి, అది మొత్తం ఎకోసిస్టమ్ మొత్తం వేగంగా పెరగడానికి దోహదపడింది’ అని పేర్కొన్నారు.
సోషల్ మీడియా వినియోగంపై లోకేశ్: 11 ఏళ్లలోపు చిన్నారులకు సోషల్ మీడియా అందుబాటులో ఉండకూడదు. 16 ఏళ్లలోపు వారికి ఏజ్ అప్రొప్రియేట్ కంటెంట్ మాత్రమే డిసెమినేట్ అవ్వాలని మంత్రి లోకేశ్ అన్నారు. సరైన ఫ్రేమ్ వర్క్ లేకపోవడంతో దీనిని అమలు చేసేందుకు సవాళ్లు ఎదురవుతున్నాయని వివరించారు. దీనిపై తల్లిదండ్రులు, ప్లాట్‌ఫామ్ ప్లేయర్స్‌తో మాట్లాడుతున్నామన్నారు. నా కొడుకు నా ఫేస్‌బుక్ అకౌంట్ తీసుకొని బ్రౌజ్ చేయకూడదు, స్ట్రాంగ్ గార్డ్‌రైల్స్ క్రియేట్ చేయాలి. లేకపోతే చాలా ప్రమాదకరం. దీనిపై మేం చేస్తున్న కసరత్తు 90 రోజుల్లో పూర్తవుతుందని భావిస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు.
Today, at @ABPNews ‘Ideas of India’, I apologised for what happened between 2019-24. #ABPIOI2026 #JaganMahaPapamNijam pic.twitter.com/fniu12oCOV
— Lokesh Nara (@naralokesh) February 27, 2026
హెరిటేజ్-వీఎస్ఆర్ ఏవియేషన్‌కు సంబంధం లేదు: లోకేశ్
అలా అయితే ఫైనల్స్‌కు వెళ్తా - వస్తానంటే పులివెందుల ఎమ్మెల్యేను తీసుకెళ్తా: మంత్రి లోకేశ్

