ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రిగా డిజిటలైజేషన్ నా ప్రధాన బాధ్యత: మంత్రి లోకేశ్
ఏపీకి 160 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఉంది - ప్రస్తుత ప్రపంచంలో మూడు 'డి'లు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి - డిజిటల్ వృద్ధికి భారీ ఇంధన అవసరం ఉంటుంది

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 23, 2026 at 10:59 AM IST
Minister Nara Lokesh at the Renew Power Roundtable Meeting : ఎలక్ట్రానిక్స్, క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్‌కు నమ్మకమైన గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని ఐటీ శాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. దావోస్‌లో రెన్యూ పవర్ సంస్థ ఆధ్వర్యంలో 'కర్బన ఉద్గారాల తగ్గింపు, డిజిటలైజేషన్’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. ప్రస్తుత ప్రపంచంలో మూడు 'డి'లు ప్రాముఖ్యత సంతరించుకున్నాయని లోకేశ్ వెల్లడించారు. డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్, డీ గ్లోబలైజేషన్, శక్తివంతమైన ధోరణులని లోకేశ్ అన్నారు.
ఒక చారిత్రక మలుపు దశలో మనం ఉన్నామని వెల్లడించారు. డిజిటల్ వ్యవస్థలు పాలనకు కేంద్ర బిందువుగా మారాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రిగా డిజిటలైజేషన్ తన బాధ్యత అని లోకేశ్ స్పష్టం చేశారు. డిజిటల్ వృద్ధికి భారీ ఇంధన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. డేటా సెంటర్లు, క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లు, ఏఐ కంప్యూటింగ్ స్వచ్ఛ విద్యుత్ లేకుండా విస్తరించలేవన్నారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ పవర్ ద్వారా 160 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఏపీకి ఉందన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ పరిశ్రమలకు ఆదర్శ కేంద్రంగా మారుస్తోందన్నారు.
భారత్‌లోనే తొలి గ్రీన్ అమ్మోనియా టెర్మినల్ ఏపీలో : ఇది అంతరాయంగా వచ్చే విద్యుత్ కాదు 24x7 గ్రీన్ పవర్ అందించే సామర్థ్యమని తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ను కేవలం స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తికే కాదు, దిగువ స్థాయి గ్రీన్ పరిశ్రమలకు కూడా ఆదర్శ కేంద్రంగా మారుస్తోందన్నారు. భారత్‌లోనే తొలి గ్రీన్ అమ్మోనియా టెర్మినల్, ప్రపంచంలోనే అతిపెద్దది ఆంధ్రప్రదేశ్‌లో ఉందని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాదికి ఈ ప్రాజెక్టును అప్పగించనున్నారని మూడు ‘డీ’లు ఎలా ఒకచోట కలుస్తాయో చెప్పే అద్భుత ఉదాహరణ ఇది అన్నారు. కార్యక్రమంలో కేంద్ర పునరుత్పాదక విద్యుత్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఫాతిహ్ బిరోల్ తదితరులు పాల్గొన్నారు.
‘ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా డిజిటలైజేషన్ నా ప్రధాన బాధ్యత. ఏఐ, డేటా సెంటర్ల నుంచి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వరకు పూర్తిగా డిజిటల్ ఆధారితమైనదే. ఈ రంగంలో వృద్ధికి భారీగా ఇంధనం అవసరం. స్వచ్ఛ, అంతరాయం లేని విద్యుత్తు లేకుంటే డేటా కేంద్రాలు, క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్, ఏఐ విస్తరించలేవు’ - మంత్రి నారా లోకేశ్
ఏపీలో 100 స్టార్టప్‌లకు మద్దతి ఇవ్వాలి : విశాఖలో ఉబెర్ టెక్నాలజీ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ అధ్యక్షుడు మధుకన్నన్‌ను మంత్రి లోకేశ్ దావోస్‌లో కలిసి కోరారు. విశాఖలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ద్వారా గ్లోబల్ సేఫ్టీ ఫీచర్ ఇన్నోవేషన్ పై దృష్టి పెట్టాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. విశాఖలో హెచ్‌సీఎల్ టెక్ డెలివరీ కేంద్రం ఏర్పాటు చేయాలని, గన్నవరంలోని క్యాంపస్‌ను 20,000 మంది ఉద్యోగులకు విస్తరించాలని కోరారు. దావోస్‌లో ఆయన హెచ్‌సీఎల్ సీఈఓ, ఎండీ విజయ్‌కుమార్‌తో సమావేశం అయ్యారు. విశాఖలో హెచ్‌సీఎల్ టెక్ జీసీసీ ఎక్స్‌పీరియన్స్ కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఏపీలో 100 స్టార్టప్‌లకు మద్దతి ఇవ్వాలని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, నైపుణ్య సంస్థలతో కలిసి ఉమ్మడి ఏఐ, ఇన్నోవేషన్, ఎడ్యుటెక్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని లోకేశే కోరారు.
విశాఖలో టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ నెలకొల్పండి - నిఖిల్ కామత్‌కు లోకేశ్ విజ్ఞప్తి
దక్షిణాసియాలోనే శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ ఏపీలో ఆవిష్కరిస్తాం: మంత్రి లోకేశ్

