బోర్డుపైనే కాక గ్రౌండులోనూ వినూత్నంగా బోధన - లోకేశ్ ప్రశంసలు అందుకున్న ఉపాధ్యాయుడు
పిల్లలకు వివిధ కళలు నేర్పిస్తున్న వెంకటచంద్ర - లెక్కలపై భయం పోగొట్టాలని వినూత్న ప్రయత్నం - ఆటపాటలతో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 2, 2026 at 2:20 PM IST
Minister Nara Lokesh Praises Maths Teacher: పుస్తకాల్లోని పాఠాలు అందరూ చెబుతారు. కానీ ఈ ఉపాధ్యాయుడు పాఠాలను ఆటపాటలతో రంగరించి చెబుతున్నారు. చదువును భారంగా కాక ఒక మధురమైన జ్ఞాపకంలా మార్చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. విద్యార్థుల మనసులనే కాకుండా రాష్ట్ర మంత్రి లోకేశ్ ప్రశంసలను కూడా అందుకున్న ఈ ఆదర్శ ఉపాధ్యాయుడి ప్రస్థానం మీరు చూస్తారా?
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేశ్ పోస్ట్ చేసిన ఈ రీల్‌లోని రియల్ హీరో టీచర్ గురించే ఇప్పు డు మనం చెప్పుకోబోయేది. పిల్లలతో కలిసి కోలాటం వేస్తున్న ఈయన పేరు వెంకటచంద్ర. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు మోడల్ పాఠశాలలో లెక్కల టీచర్. విద్యార్థులకు గణితం అంటే భయం ఉండకూడదనే ఆలోచనతో వినూత్న ప్రయత్నాలు చేశారు వెంకటచంద్ర. సులభమైన పద్ధతిలో అర్థమయ్యేలా చెప్పాలని వారితో కలిసి పోయి ఇలా ఆటపాటలతో గణితాన్ని బోధిస్తున్నారు. 6 నెలల క్రితం బదిలీపై ఈ స్కూల్‌కు వచ్చారు.
వినూత్న బోధనా పద్ధతులతో: చిన్నతనంలో తండ్రి ద్వారా నేర్చుకున్న కోలాటం, చెక్క భజన, కర్రసాము విద్యార్థులకు నేర్పిస్తున్నారు. అదే వీడియోలు తీస్తూ సామాజిక మాధ్యమాల్లో పెట్టటం ప్రారంభించారు. క్రమంగా ఇవన్నీ వైరల్‌గా మారాయి. సోషల్‌మీడియాలో అలా అలా ప్రాచుర్యం పొందిన ఈ లెక్కల మాస్టారి వీడియోలు చివరకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ వరకు వెళ్లాయి. వెంకట చంద్ర ప్రతిభ వినూత్న బోధనా పద్ధతులను అభినందిస్తూ పోస్టు పెట్టారు.
ప్రయోగం విజయవంతం అవ్వడంతో: బోర్డుపైనే కాక గ్రౌండులోనూ గణితం చెబుతున్న ప్రతిభకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వెంకటచంద్ర వచ్చిన మొదట్లో విద్యార్థులకు లెక్కలంటే భయం ఉండేది. చాలామందికి ఎక్కాలు సైతం వచ్చేవి కాదు. అలాంటి వారిని వేకువజామున 5 గంటలకే నిద్రలేపి రోజూ రెండు ఎక్కాలు నేర్చుకుని అప్పజెప్పేలా తల్లిదండ్రులను ఒప్పించారు. అప్పజెప్పే వీడియోలు వాట్సాప్‌లో పోస్టు చేయమని చెప్పారు. ప్రయోగం విజయవంతం అవ్వడంతో విద్యార్థులంతా ఎక్కాలను నేర్చుకున్నారు.
'నేను ఈ స్కూల్‌కు వచ్చిన కొత్తలో చాలామంది విద్యార్థులకు ఎక్కాలు వచ్చేవి కాదు. పిల్లల్లో కొత్త ఉత్సాహం రావడానికి నేను ఒక మంచి పద్ధతి అవలంభించాను. ప్రతిరోజూ రెండు టేబుల్స్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత నేర్చుకోవాలి. విద్యార్థులు తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేచి వాటిని తల్లిదండ్రుల్లకు అప్పజెప్పాలి. అప్పుడు వాటిని వీడియో తీసి స్కూల్ వాట్సప్‌లో గ్రూప్‌లో పెట్టామని చెప్పాను. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు నన్ను చాలా సపోర్ట్ చేశారు.' - వెంకటచంద్ర, ఉపాధ్యాయుడు
క్లిష్టమైన సమ్స్ కూడా తేలిగ్గా: మనం నేర్చుకున్నవి ఇతరులకు నేర్పించాలని అందుకే తండ్రి నేర్పిన కళలు విద్యార్థులకు నేర్పిస్తున్నాని చెప్తున్నారు ఈ ఆదర్శ టీచర్. అంతరించిపోతున్న కళలు భవిష్యత్ తరాలకు అందించడమే కాక వారిలో చదువు పట్ల ఉత్సాహం పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో హాజరు శాతం పెరిగిందని, లెక్కలతో పాటు అన్నింటా రాణిస్తున్నారని చెబుతున్నారు ప్రిన్సిపల్ రాజు. చదువే కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉండేలా క్రీడలు కూడా నేర్పిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెంకటచంద్ర కృషితో మ్యాథ్స్‌పై భయం పోయిందంటున్న విద్యార్థులు ఇప్పుడు క్లిష్టమైన సమ్స్ కూడా తేలిగ్గా నేర్చుకుంటున్నామని చెబుతున్నారు.
వినూత్న పద్ధతుల్లో విద్యార్థులకు పాఠాలు బోదించడమే కాకుండా అంతరించిపోయే కళలు కూడా నేర్పిస్తూ ముందుకు సాగుతున్న ఈ యువ టీచర్‌ని అందరూ అభినందిస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులు అవరోధాలు కావు - కృషి, పట్టుదలతో కానిస్టేబుల్ ఉద్యోగాలు
రీల్స్‌కు బదులు యూట్యూబ్‌లో క్లాసులు - పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తున్నఅభ్యర్థులు

