'ఏపీలో ఈవీ సెమీ కండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయండి' - దక్షిణకొరియాలో మూడో రోజు లోకేశ్ పర్యటన
దక్షిణకొరియా ఎల్జీ కెమ్ అధునాతన కార్యకలాపాలు నమూనాగా మూలపేటలో ప్రపంచస్థాయి నాఫ్తా క్రాకర్ కేంద్రం ఏర్పాటుకున్న అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 7, 2026 at 4:45 PM IST
Minister Lokesh Third Day Visit to South Korea: దక్షిణకొరియాలో మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల వేట కొనసాగుతోంది. ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ యున్ - జు కోహ్‌తో లోకేశ్ సమావేశమయ్యారు. కాకినాడ పోర్టు సమీపంలో పాలీస్టైరిన్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. దక్షిణకొరియా ఎల్జీ కెమ్ అధునాతన కార్యకలాపాలు నమూనాగా మూలపేటలో ప్రపంచస్థాయి నాఫ్తా క్రాకర్ కేంద్రం ఏర్పాటుకున్న అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈవీ, బ్యాటరీ పవర్ స్టోరేజీ వ్యవస్థ రూపకల్పన, సమీకృత క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్, సెల్ తయారీ కేంద్రాన్ని ఆంధ్రలో పెట్టాలన్నారు.
ఎస్ఏఎఫ్, బయో-ఇథనాల్ ఉత్పత్తి, జీవ ఇంధనాల తయారీకేంద్రం ఏర్పాటు చేయాలని విన్నవించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను వాల్యూ యాడెడ్ వనరులుగా మార్చడం, ప్లాస్టిక్ రీసైక్లింగ్, పైరోలిసిస్ ప్లాంట్ల ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేయాలన్నారు. శ్రీసిటీలో యాక్రిలోనిట్రైల్ బ్యూటాడైన్ స్టైరీన్ కాంపౌండ్ ప్లాంట్ నిర్వహిస్తున్నట్లు యున్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.
3వ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్: ఎల్జీ పాలిమర్స్ విశాఖపట్నం ప్లాంట్ (గోపాలపట్నం) ద్వారా గతంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ భారతీయ కార్యకలాపాలకు, ఇతర తయారీదారులకు (పాలీస్టైరీన్) కీలకమైన పాలిమర్ భాగాలను సరఫరా చేశామని ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ యున్-జు కోహ్ గుర్తు చేశారు. ప్రస్తుతం శ్రీసిటీలో, యాక్రిలోనిట్రైల్ బ్యూటాడైన్ స్టైరీన్ (ABS) కాంపౌండ్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా ఏపీలోని శ్రీసిటీలో రూ. 5,000 కోట్ల వ్యయంతో 3వ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మిస్తోందని ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ (ఇండియా) సీఈవో హాంగ్ జు జియోన్ తెలిపారు. దీనిద్వారా సుమారు 1,500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఈ ఏడాది చివరినాటికి శ్రీసిటీ యూనిట్ ద్వారా వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన తాజా ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
హ్యుందాయ్ మోబిస్ విస్తరణ: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ మాడ్యూల్స్, కాంపొనెంట్స్, ఎలక్ట్రిఫికేషన్ పరికరాల తయారీ సంస్థ హ్యుందాయ్ మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్, వైస్ ప్రెసిడెంట్ హన్సోక్ పార్క్, జంగ్‌హో సియోలతో ఆయన సియోల్‌లో సమావేశమై చర్చించారు. ఏఐ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఈవీ సెమీ కండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
తిరుపతి, అనంతపురం సమీపంలో ఈవీ కాంపోనెంట్స్ & బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రం, విశాఖపట్నంలో హ్యుందాయ్ మోబిస్ ఆర్&డీ ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఐఐటీ తిరుపతి భాగస్వామ్యంతో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రతిపాదించారు. అనంతపురాన్ని ఆటోమొబైల్ హబ్‌గా మార్చడానికి, టైర్-1 సరఫరాదారుల సమావేశం నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో భాగస్వామ్యం వహించాలని కోరారు. భారతదేశంలో హ్యుందాయ్ మోబిస్ విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతునిస్తుందని చెప్పారు.
ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హ్యుందాయ్ మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్ అన్నారు. సెమీ కండక్టర్స్, OSAT (అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్) రంగంలో పేరెన్నికగన్న ‘అపాక్ట్’ (APACT) కంపెనీ సీఈవో సియాంగ్ డాంగ్ లీతో మంత్రి లోకేశ్ సియోల్ లో సమావేశమయ్యారు. ASIP భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌లో అపాక్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినందుకు మంత్రి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. అపాక్ట్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు చెప్పారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశీలిస్తున్న ‘హనా మైక్రాన్’ (Hana Micron)తో పాటు ఇతర OSAT సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా అనుసంధానించాలని APACTని కోరారు.
OSAT సెమీకండక్టర్ కార్యకలాపాలకు సంబంధించి యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం కోసం APSSDCతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని మంత్రి లోకేశ్ ప్రతిపాదించారు. భారతదేశంలో అపాక్ట్ కార్యకలాపాల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని లోకేశ్ స్పష్టం చేశారు. ASIP-APACT వైజాగ్ OSAT జాయింట్ వెంచర్ ఆంధ్రప్రదేశ్‌కు లభించిన ఒక ప్రతిష్టాత్మక సెమీకండక్టర్ విజయమని అపాక్ట్ సీఈవో సియాంగ్ డాంగ్ లీ అభివర్ణించారు. ఏపీ ప్రభుత్వం అందించిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని ఈ సందర్భంగా లీ తెలిపారు.
ఏపీని భారతదేశ ఏఐ రాజధానిగా నిలపడమే లక్ష్యం: మంత్రి లోకేశ్
ప్రతి ప్రవాసాంధ్రుడు ఏపీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ : మంత్రి లోకేశ్

