విద్వేషపూరిత పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలి: మంత్రి లోకేశ్
సామాజిక మాధ్యమాల్లో జవాబుదారీతనం, పౌరుల రక్షణ బలోపేతానికి చర్యలు - మహిళలపై అవమానకర, అసభ్య పోస్టులు పెట్టే వారిపై నిఘా - ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో దురుద్దేశపూర్వక వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 7, 2026 at 1:02 PM IST
Hate Posts On Social Media: సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సూచించారు. సామాజిక మాధ్యమాల్లో జవాబుదారీతనం, పౌరుల రక్షణను బలోపేతం చేయడం అనే అంశంపై సచివాలయంలో నిర్వహించిన మంత్రుల బృంద సమావేశంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఐటీ చట్టంలో ఇందుకు ఉన్న నిబంధనలపై చర్చించారు.
సద్విమర్శలను స్వాగతిస్తాం: లోకేశ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాలపై సద్విమర్శలను స్వాగతిస్తామన్నారు. ఉద్దేశపూర్వక విద్వేష వ్యాఖ్యలను సహించబోమన్నారు. ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ అసభ్య కంటెంట్‌ను అరికట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలపై అవమానకర, అసభ్య పోస్టులు పెట్టే వారిపై నిఘా ఉంచాలని పోలీసులకు సూచించారు. ప్రజాభీష్టాన్ని అడ్డుకోవడం ప్రభుత్వ ఉద్దేశం కాదని ఈ సంధర్భంగా మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ (ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్) పేరుతో దురుద్దేశపూర్వక వ్యాఖ్యలను, పోస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని స్పష్టం చేశారు.
విదేశాల్లో ఉంటూ అభ్యంతరకర పోస్టులు: ప్రతిపక్షాలు ధర్నాచౌక్ లాంటి ప్రదేశాల్లో నిరసన తెలియజేసేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తుందన్నారు. గతంలో జ్యుడీషియరీతో పాటు కొంతమందిని లక్ష్యంగా చేసుకుని అసభ్య పోస్టులు పెట్టారని, విదేశాల్లో ఉంటూ అభ్యంతరకర పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనికోసం బలమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమలు చేస్తున్న చట్టాలపై అధ్యయనం చేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి భార్యపై పోస్టు పెడితే మా పార్టీ వాడైనా జైలుకు పంపించామని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు సంబంధించి రాష్ట్రస్థాయి సమన్వయ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు హోం మంత్రి అనిత చెప్పారు. సమావేశంలో సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు.
అసభ్య పోస్టుల కట్టడికి క్యాబినెట్ సబ్ కమిటీ: సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టుల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో వచ్చే అసభ్య కంటెంట్‌పై తీసుకోవాల్సిన చర్యల అధ్యయనానికి ఐదుగురు సభ్యులతో క్యాబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కమిటి ఉప సంఘం సభ్యులుగా మంత్రులు లోకేశ్, అనిత, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, పార్థసారథి ఉన్నారు. సోషల్ మీడియా చట్టాలు, నియమాలు, మార్గదర్శకాలు సమీక్షించాలని ప్రభుత్వం కమిటి సభ్యులకి సూచించింది. సోషల్ మీడియా పోస్టులపై జవాబుదారీతనం, బాధ్యతలు, నియంత్రణ చర్యలు, అంతర్జాతీయ పద్ధతులు, పారదర్శక ప్రమాణాలు, వినియోగదారుల రక్షణ, హానికర కంటెంట్, తప్పుడు సమాచారం నివారణ, పోస్టులపై ఫిర్యాదులు, పరిష్కారంపై అధ్యయనం చేయాలని మంత్రివర్గ ఉపసంఘానికి సూచించింది. పౌరహక్కుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రుల కమిటీకి ప్రభుత్వం సలహాలు ఇవ్వనుంది.
గత ప్రభుత్వంలో ఇలా: సామాజిక మాధ్యమాలైన ఎక్స్, ఫేస్‌బుక్ వేదికగా వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అసభ్యకరంగా, వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా గతంలో పోస్టులు పెట్టారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేసినా, అలాంటి పోస్టులను ఫార్వర్డ్ చేసినా ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలను సీఐడీ అధికారులు అర్ధరాత్రి ఇళ్లల్లోకి వచ్చి మరీ అరెస్టులు చేశారు. వైఎస్సార్సీపీ నేతలు విపక్షాలపై అభ్యంతరకర పోస్టులు పెట్టినా అప్పట్లో పోలీసులు కిమ్మన లేదు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ నేతలు అధికారం కోల్పోయినా ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం తీరు మారలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితలతో పాటు వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పోస్టులు పెడుతోంది.
కోనసీమ పాలిట శాపంగా చమురు తవ్వకాలు - గణనీయంగా పడిపోతున్న పంట దిగుబడి
ప్రభుత్వ ఆధ్వర్యంలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు - పండక్కొచ్చేయండంటున్న గోదావరి

