నేతల కుటుంబాలతో లోకేశ్ ఆత్మీయ సమావేశం - అంతా కలిసి ఒకేచోట భోజనం చేస్తూ ముచ్చట్లు
గుంటూరు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని నేతలతో లోకేశ్ ఆత్మీయ కలయిక- అంతా కలిసి ఒకేచోట భోజనం చేస్తూ సంభాషణలు- వారి కుటుంబ సభ్యులకు మంగళగిరి చేనేత చీరలు కానుకగా అందజేత

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 15, 2026 at 11:51 AM IST
|Updated : February 15, 2026 at 1:02 PM IST
Minister Lokesh Meet with Guntur and Vijayawada Leaders Family : సీఎం చంద్రబాబుతో రాజకీయ సమీక్ష అంటే పార్టీ నేతలకు భయం, ఆత్మీయత అంటే బలం. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ కొత్త సంస్కృతికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లు నాంది పలికారు. నియోజకవర్గాల వారీగా సర్వేలను ఆధారంగా చేసుకుని ఎమ్మెల్యేల పని తీరు గురించి చంద్రబాబు చర్చిస్తున్నారు.
అదే వేదికపై రాజకీయాల్ని పక్కన పెట్టి నేతల కుటుంబ సభ్యులతో ఆత్మీయ విందుల్లో యోగ క్షేమాలను మంత్రి లోకేశ్ తెలుసుకుంటున్నారు. పార్లమెంట్ స్థానాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వరుస సమీక్షలు జరుగుతున్నాయి. ఇవీ కేవలం వారి పనితీరు అంచనాలే కాకుండా పార్టీకి దిశానిర్దేశం చేసే వ్యూహ రచనలకు, దారి తప్పే నేతలకు గట్టి హెచ్చరికగా, కట్టుబాటుతో ముందుకు సాగే వారికి ప్రోత్సాహంగా నిలుస్తున్నాయి. క్రమశిక్షణ, ఆత్మీయతతో ఐక్యత ధోరణితో తెలుగుదేశం అధిష్టానం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.
ఉండవల్లి నివాసంలో గుంటూరు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలు వారి కుటుంబ సభ్యులతో మంత్రి లోకేశ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రతినిధులంతా సకుటుంబంగా తరలిరావడంతో ఆత్మీయ కలయిక కనులవిందుగా జరిగింది. ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులను సాదరంగా స్వాగతించిన లోకేశ్ వారితో ఆత్మీయంగా మాట్లాడారు. చిన్నపిల్లలతో కబుర్లు చెబుతూ సరదాగా గడిపారు.
మంగళగిరి చేనేత చీరలు కానుకగా : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, రాజకీయాలకు దూరంగా కుటుంబ విషయాలు, బాగోగులు, విద్య, క్రీడల గురించి మాట్లాడారు. చదువు, కెరీర్ ఒక్కటే జీవితం అని అందరూ భావిస్తున్నారని క్రీడలు కూడా కెరీర్‌గా పిల్లలు ఎంచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మంత్రి లోకేశ్ సూచించారు. అంతా కలిసి ఒకేచోట భోజనం చేస్తూ, మాట్లాడుకున్నారు. నేతలు తనకు ఇచ్చిన వినతుల తాజా పరిస్థితిపై నివేదికలను లోకేశ్ స్వయంగా ఆయా నేతలకు అందజేశారు. ప్రజా ప్రతినిధుల కుటుంబసభ్యులకు మంగళగిరి చేనేత చీరలు కానుకగా అందించారు. ఈ ఆత్మీయ కలయికలో గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన తెనాలి ఎమ్మెల్యే మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన నేతలు : ఎమ్మెల్యేలు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామమోహన రావు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధలు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు.
'ఆహ్లాదకర వాతావరణంలో ఆత్మీయ విందు' - నేతల కుటుంబాలతో లోకేశ్ సరదా సంభాషణలు
'సమస్యలపై వేగంగా స్పందించండి' - జిల్లా నేతలు, అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

