స్థానిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవాలి - నరసరావుపేట టీడీపీ శ్రేణులకు లోకేశ్ పిలుపు
పల్నాడు జిల్లాలో జేఎన్‌టీయూలో రూ.70 కోట్లతో నిర్మించిన వసతిగృహాలు ప్రారంభం - ఉన్నత విద్య బలోపేతమే లక్ష్యమన్న మంత్రి లోకేశ్ - నరసరావుపేటలో లోకేశ్‌కు పార్టీ శ్రేణుల ఘనస్వాగతం

By ETV Bharat Andhra Pradesh Team
Published : September 3, 2026 at 10:41 AM IST
Minister Lokesh Inaugurates New Hostel : రాష్ట్రంలో ఉన్నత విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. దేశంలో ఐఐటీలు, ఎన్ఐటీలు అద్భుతమైన మౌలిక వసతులతో బలంగా ఉన్నాయని, అలాంటి వాతావరణాన్ని రాష్ట్రంలోనూ కల్పించి ఉన్నత విద్య బలోపేతానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. యువత నైతిక విలువలతో పాటు కష్టపడేతత్వాన్ని అలవర్చుకున్నప్పుడే రాణించగలరని సూచించారు. నరసరావుపేట మండలం కాకానిలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల నూతన వసతి గృహలను లోకేశ్ ప్రారంభించారు. అనంతరం పార్టీ సమన్వయకర్తల సమావేశానికి హాజరై స్థానిక ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు.
పల్నాడు జిల్లా కాకానిలోని జేఎన్టీయూ కళాశాలలో రూ.70 కోట్లతో 16 వందల మంది విద్యార్థులకు అత్యాధునిక వసతులతో నిర్మించిన గౌతమి, కృష్ణవేణి, నాగార్జున వసతి గృహాలను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. వాటిలోని వసతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో నిపుణులైనా ఉపాధ్యాయులు, అధ్యాపకులున్నా అనేక కారణాలతో వ్యవస్థలు దెబ్బతిన్నాయని లోకేశ్ చెప్పారు. ఈ పరిస్థితి నుంచి మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ఉన్నత విద్యపై దృష్టి సారించాలి: గత రెండేళ్లలో పాఠశాల విద్య బలోపేతానికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయని వివరించారు. ఉన్నత విద్యపై దృష్టి పెట్టి ప్రయోగశాలలు, నైపుణ్య కేంద్రాలు, పరిశ్రమలతో అనుసంధానం చేస్తున్నామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది భాగస్వామ్యంతోనే విద్యావ్యవస్థలో మార్పులు సాధ్యమవుతాయని చెప్పారు. ఫిజిక్స్, మెటీరియల్ సైన్స్, థర్మోడైనమిక్స్ వంటి సబ్జెక్టులపైనా యువత దృష్టి సారించాలన్నారు. పరిశ్రమల నిపుణులతో చర్చించి కరిక్యులమ్‌ను ప్రక్షాళన చేయాలని మంత్రి చెప్పారు. ప్లేస్‌మెంట్స్ అంశంలో ప్రతి వర్సిటీకి ప్రగతి సూచికలు తీసుకువస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఆటోమోటివ్ రంగంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చామని యువత పట్టుదలతో అవకాశాలు అందిపుచ్చుకుని విజయం సాధించాలని ఆకాంక్షించారు. విజయానికి దగ్గరి దారులు లేవని కష్టపడటం ఒక్కటే మార్గమన్నారు.
స్థానిక సమరంలో సత్తా చాటాలి: రానున్న స్థానిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులను గెలిపించాలని నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో లోకేశ్ పిలుపునిచ్చారు. కార్యకర్తలు, ప్రజలతో మమేకం కావాలని దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీ దుష్ప్రచారాలను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. టీడీపీలో వర్గాలు ఉండవని, వర్గాల పేరుతో కావాలని చిచ్చు పెట్టడానికే ప్రయత్నించే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గం తీర్మానం చేస్తే వైఎస్సార్సీపీ నాయకులు కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
"స్థానిక ఎన్నికల్లో గెలవాలంటే అభివృద్ధి, సంక్షేమం సరిపోవు. ప్రతి బూత్, ప్రతి ఓటర్తోని కార్యకర్తలు మమేకం కావాలి. డోర్ టూ డోర్ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. నెల రోజుల్లో రానున్న మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించాలి" - లోకేశ్, మంత్రి
నరసరావుపేటకు విచ్చేసిన లోకేశ్‌కు తొలుత కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా పూలు చల్లుతూ అభివాదాలు పలికారు. కూటమి అధికారం చేపట్టాక తొలిసారి పల్నాడు జిల్లాకు వచ్చిన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమం అనంతరం లోకేశ్ కోటప్పకొండ వెళ్లి త్రికోటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
నకిలీ ప్రారంభోత్సవాలు వైఎస్సార్సీపీకే సొంతం: మంత్రి లోకేశ్
తీరనున్న వసతి కష్టాలు - నరసరావుపేట జేఎన్టీయూ విద్యార్థులకు అందుబాటులోకి వసతి గృహాలు

