ETV Bharat / state

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు: మంత్రి కొండపల్లి

ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశామన్న మంత్రి కొండపల్లి- ఏపీ ఎన్నార్టీఎస్ 24/7 హెల్ప్‌లైన్ 0863-2340678కు తెలియజేయవచ్చన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

Minister Kondapalli Srinivas About Gulf Victims
Minister Kondapalli Srinivas About Gulf Victims (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 2, 2026 at 4:15 PM IST

2 Min Read
Choose ETV Bharat

Minister Kondapalli Srinivas About Gulf Victims: ఇజ్రాయిల్​ - ఇరాన్​​ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా, గల్ఫ్​ దేశాల్లో నెలకొన్న, పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఆయా దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా కొన్ని విమానాశ్రయాలలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, సంబంధిత శాఖ మంత్రిగా తాను ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

గల్ఫ్ దేశాల్లో ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్లు: ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్నార్టీస్​) ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు అవసరమైన సహాయం చేసేందుకు గాను, గల్ఫ్ దేశాలలో ఉన్న ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్లను అప్రమత్తం చేసి, స్థానికంగా ఉన్న తెలుగు కుటుంబాల సహకారంతో తాత్కాలిక వసతి, భద్రత, అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఏపీ ఎన్నార్టీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తూ, కోఆర్డినేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు.

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు: మంత్రి కొండపల్లి (ETV Bharat)

అత్యవసర నంబర్లు: స్థానికంగా ఉన్న ఇండియన్ ఎంబసీ సేవలను, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తమ వివరాలను ఏపీ ఎన్నార్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ 0863-2340678, వాట్సప్​ నంబర్​ 85000 27678కు తెలియజేయవచ్చని, helpline@apnrts.com ద్వారా ఈమెయిల్​ చెయ్యొచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు వెంటనే సంప్రదించి సహాయం పొందాలని మంత్రి సూచించారు.

'గల్ఫ్​లో చిక్కుకుపోయిన తెలుగువారిని స్వదేశానికి తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నాం. ప్రమాదంలో ఉన్నవారు వెంటనే హెల్ప్​లైన్​ నంబర్లకు ఫోన్​ చేస్తే వారికి వీలైనంత త్వరగా దగ్గర్లో ఉన్న మన వాళ్ల ద్వారా సహాయం అందుతుంది. పరిస్థితుల కారణంగా ప్రస్తుతం విమాన సర్వీసును నిలిపివేశారు. సేవలు తిరిగి ప్రారంభమైన వెంటనే అందరూ సొంత రాష్ట్రానికి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం.' -కొండపల్లి శ్రీనివాస్‌, రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలశాఖ మంత్రి

కోనసీమ జిల్లా వాసుల ఆందోళన: మరోవైపు ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధంతో కోనసీమ జిల్లా వాసుల్లో తీవ్ర ఆందోళన చేపట్టారు. గల్ఫ్‌ దేశాల్లో సుమారు 2 లక్షల మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులు ఉపాధి పొందుతున్నారు. వారిలో సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, అల్లవరం, ఉప్పలగుప్తం, కమలాపురం వాసులు ఉన్నారు. అక్కడ యుద్ధవాతావరణం నెలకొనడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కుటుంబసభ్యులు, బంధువులు తమ వాళ్లకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

మంత్రి నారా లోకేశ్ సాయం - గల్ఫ్​లో చిక్కుకున్న మహిళ క్షేమంగా ఇంటికి

'సౌదీలో ఇబ్బందులు పడుతున్నా-రక్షించండి' - మంత్రి లోకేశ్​కు మహిళ విజ్ఞప్తి