నేను చెప్పాల్సినవన్నీ చెప్పా - అధిష్ఠానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నా : 'రాజీనామా'పై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాన్న మంత్రి కొండా సురేఖ - ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయినట్లు వెల్లడి - తనను ఇంతవరకు రాజీనామా చేయమని చెప్పలేదని వివరణ

Published : September 2, 2026 at 4:17 PM IST
|Updated : September 2, 2026 at 6:38 PM IST
Minister Konda Surekha Shocking Comments : తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని కాంగ్రెస్ పెద్దలను కోరినట్లుగా మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తన వివరణ ఇచ్చినట్లు చెప్పారు. తన వ్యవహారంపై పార్టీలో చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదని తెలిపారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని అధిష్ఠానానికి చెప్పినట్లు వివరించారు. సుస్మితకు వివాహం అయిందని, ఆమె ఇండిపెండెంట్‌గా ఉందన్నారు.
పదవిలో కొనసాగించాలని కోరా : కాంగ్రెస్ హైకమాండ్‌కు తాను చెప్పాల్సినదంతా చెప్పానని మంత్రి కొండా సురేఖ వివరించారు. పార్టీ పెద్దలు ఆలోచిస్తామని చెప్పారన్నారు. తన బిడ్డ స్వతంత్రంగా ఉందని వివరించారు. పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలిగా మాట్లాడిందని అనుకుంటున్నానన్నారు. ఆమె జీవితం ఆమె ఇష్టమని సురేఖ పేర్కొన్నారు. తనతో పాటు తన భర్త రాజకీయ జీవితం మా ఇష్టం అని తెలిపారు. తాను మంత్రిగా మంచి పనితీరు కనబరుస్తున్నానని కొండా సురేఖ చెప్పారు. అవినీతి ఆరోపణలు లేకుండా పనిచేస్తున్నానని వివరించారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నానని తెలిపారు. పదవిలో కొనసాగించాలని అధిష్ఠానాన్ని కోరానని ఆమె వివరించారు.
"కాంగ్రెస్ అధిష్ఠానానికి నేను చెప్పుకోవాల్సిందంతా చెప్పాను. పార్టీ పెద్దలు ఆలోచిస్తామని చెప్పారు. నా బిడ్డ స్వతంత్రంగా ఉంది. పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలిగా మాట్లాడిందని అనుకుంటున్నాను. ఆమె జీవితం ఆమె ఇష్టం. నాతో పాటు నా భర్త రాజకీయ జీవితం మా ఇష్టం. నేను మంత్రిగా మంచి పనితీరు కనబరుస్తున్నాను. అవినీతి ఆరోపణలు లేకుండా పనిచేస్తున్నా. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నాను. పదవిలో కొనసాగించాలని అధిష్ఠానాన్ని కోరాను"-కొండా సురేఖ, మంత్రి
ఎవరు ఆరోపణలు చేయించారో తెలుసు : తన కుమార్తె వ్యాఖ్యలపై తాను స్పందించనని కొండా సురేఖ తెలిపారు. సుస్మిత వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. రోజూ ఎంతో మంది మాట్లాడతారని అందులో సుస్మిత కూడా ఒకరని కొండా సురేఖ అన్నారు. తన బిడ్డ కనుక తనను బాధ్యురాలిని చేయడం సరికాదని ఆమె వివరించారు. ఆమె వ్యాఖ్యలను ఖండించడం, సమర్థించడం చేయనన్నారు. తన వివరణను మీనాక్షి నటరాజన్‌కు చెప్పానట్లు వెల్లడించారు. అధిష్ఠానానికి ఆమె చెప్తానన్నారని సురేఖ వివరించారు.
పార్టీలో కొంతమందితో తనపై ఆరోపణలు చేయించారన్నారు. ఎవరు అలా చేయించారో తనకు తెలుసని కొండా సురేఖ పేర్కొన్నారు. పేర్లు చెబితే వివాదం అవుతుందన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారికీ షోకాజ్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని సురేఖ అభిప్రాయపడ్డారు. పార్టీ ఆ దిశగానూ ఆలోచించాలని ఆమె కోరారు. తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడమే అసలు తప్పు అని అన్నారు. ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్నానని అందుకే ఇక్కడికి వచ్చి తన బాధ చెప్పుకొన్నానన్నారు. రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్‌కు రాతపూర్వకంగా వివరణ ఇచ్చామన్న ఆమె, పార్టీ తీసుకునే నిర్ణయం ఆధారంగా తన ఆలోచన ఉంటుందని కొండా సురేఖ అన్నారు.
"నేను చెప్పాల్సినవన్నీ పార్టీ పెద్దలకు చెప్పాను. నాకు షోకాజ్ నోటీసు ఇవ్వడమే తప్పు. నా వివరణ అంతా కేసీ వేణుగోపాల్‌కు వాట్సప్ చేశాను. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందనేది నాకు తెలియదు. నా కుమార్తె వ్యాఖ్యల గురించి ఏమీ మాట్లాడను. సుస్మిత వ్యాఖ్యలను ఖండించటం, సమర్థించటం చేయను. ఇండిపెండెంట్ మహిళ మాట్లాడవద్దని చెప్పే హక్కు నాకు లేదు. నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయటం సరికాదు"- కొండా సురేఖ, మంత్రి
అధిష్ఠానానికి నివేదిక సమర్పించిన టీపీసీసీ : ఇటీవల గీసుకొండలో సీఎం రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కుమార్తె వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవికి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. అనంతరం కొండా సురేఖతో పాటు వనపర్తి వ్యవహారంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై రూపొందించిన నివేదికను కాంగ్రెస్ హైకమాండ్‌కు టీపీసీసీ పంపింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి దిల్లీకి వెళ్లారు. కొండా సురేఖ విషయంలో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.
పదవుల నుంచి తొలగించాలని సిఫార్సు : మంత్రి కొండా సురేఖను పదవి నుంచి తొలగించాలని ఏఐసీసీకీ పీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ పూర్తి స్థాయి రిపోర్ట్‌ను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు అందించింది. పార్టీ గీతను దాటి వ్యవహరించిన నేతలపై చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నట్లు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి కొద్దిరోజుల క్రితం వివరించారు. ఈ నివేదికపైనే ఏఐసీసీ పెద్దలు ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, ఇతర కీలక నేతలతో చర్చించింది.
కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ - కొండా సురేఖ, చిన్నారెడ్డిల అంశంపై సుదీర్ఘ చర్చ
కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు - దిల్లీ వెళ్లిన మంత్రి

