నాగార్జున కుటుంబాన్ని బాధ పెట్టాలని ఆ వ్యాఖ్యలు చేయలేదు : కొండా సురేఖ
మంత్రి కొండా సురేఖ ఎక్స్ వేదికగా పోస్టు - నాగార్జున కుటుంబంపై తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానన్న మంత్రి సురేఖ

Published : November 12, 2025 at 9:37 AM IST
Minister Konda Surekha About Nagarjuna : ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగార్జున కుటుంబంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానని అన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.
‘నాగార్జున, ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. వారిని ఇబ్బంది పెట్టాలని కానీ, వారి పరువు-ప్రతిష్టలకు భంగం కలిగించాలన్నది కానీ నా ఉద్దేశం కాదు. నాగార్జున కుటుంబంపై నేను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నా. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా’ అని మంత్రి ఆ పోస్టులో పేర్కొన్నారు.
I would wish to clarify that the statement I had made in relation to @iamnagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu or his family members.
— Konda Surekha (@iamkondasurekha) November 11, 2025
I had no intention of hurting or defaming Akkineni Nagarjuna Garu or his family members.
I regret any unintended impression…
అసలేం జరిగింది : 2024 అక్టోబరు 2 హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. సమంత-నాగ చైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరినీ ఇబ్బందులకు గురి చేశారన్నారు. హీరోయిన్స్ తొందరగా పెళ్లిళ్లు చేసుకుని, సినిమాలు విడిచి వెళ్లిపోవడానికి కేటీఆర్‌నే కారణమని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై స్పందించిన సినీ నటి సమంత అప్పుడు ఎక్స్ వేదికగా స్పందించి తన విడాకులు వ్యక్తిగత విషయమని చెప్పారు. ఈ మాటలపై నటి సమంతకి కొండా సురేఖ క్షమాణలు చెప్పారు.
మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం : ఆ తర్వాత తన కుటుంబంతో పాటు, కుమారుడు నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపై మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై సినీ హీరో నాగార్జున గతంలో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. ఆమె తమ ఫ్యామిలీ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నాగార్జున గతంలో ఫైల్ చేసిన పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తాజాగా నాగార్జున, ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ ఉపసహరించుకుంటున్నానని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
కొండా సురేఖపై నాగార్జున పరువునష్టం దావా - NAGARJUNA PETITION AGAINST SUREKHA

