ETV Bharat / state

డ్రోన్లతో నిఘా, యాక్సిడెంట్ స్పాట్ల వద్ద జాగ్రత్తలు - కిక్కిరిసిన హైవేపై జాగ్రత్తలు

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళుతున్న ప్రజలు - ఎప్పటికప్పుడు ట్రాఫిక్​ను సమీక్షిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి - ప్రమాదాలు జరిగి అత్యవసర పరిస్థితులు ఏర్పడితే రంగంలోనికి హెలికాప్టర్లు

Komatireddy Statement On Heavy Traffic In SankrantiKomatireddy Statement On Heavy Traffic In Sankranti
Komatireddy Statement On Heavy Traffic In Sankranti (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : January 10, 2026 at 9:54 PM IST

|

Updated : January 11, 2026 at 6:59 AM IST

3 Min Read
Choose ETV Bharat

Minister Komatireddy Venkat Reddy On Heavy Traffic In Sankranti : సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్ల వెళ్లేందుకు ప్రజలు పయనమయ్యారు.హైదరాబాద్ నుంచి తమ సొంతూళ్లు పెద్ద ఎత్తున సొంత కార్లు, వ్యక్తిగత వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరి వెళుతున్నారు. వారంతం కావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి భారీ రద్దీగా మారింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని తదితర ప్రాంతాలకు వెళ్లే కుటుంబాలతో హైవే అత్యంత రద్దీ దర్శనమిస్తోంది. రేపు ఆదివారం కావడంతో మరింత రద్దీ పెరిగే సూచనలు ఉన్నాయి. గత ఏడాది అనుభవాలు దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి పురస్కరించుకుని నగరం నుంచి తమ సొంతూళ్లు వెళ్లే కుటుంబాలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది.

ఎప్పటికప్పుడు సమీక్ష : ముందస్తు చర్యల్లో భాగంగా అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు సాఫీగా ముందుకు సాగేందుకు వీలుగా నల్గొండ, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇదే అంశంపై డిసెంబరు 30న సచివాలయంలో 7 గంటలపాటు మంత్రి ఉన్నత సమీక్ష చేశారు. గతంలో నేషనల్ హైవేపై 17 యాక్సిడెంట్ స్పాట్లు గుర్తించిన ప్రభుత్వం రూ.350 కోట్ల వ్యయంతో పనులు చేపట్టినప్పటికీ కొన్ని చోట్ల పూర్తి కాలేదు. గుత్తేదారు నిర్లక్ష్యంతో ఎక్కడికక్కడ రోడ్లపై సామగ్ర పడి ఉండటంతో భారీ క్రేన్లు, ప్రొక్లెయిన్ల సాయంతో సామగ్రిని తొలగించారు. ఫ్లైఓవర్లు నిర్మిస్తున్న చోట మెటీరియల్స్ అంతా క్లియర్ చేయించడంతో వాహనాలు సాఫీగా వెళుతున్నాయి.

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై పోలీసుల జాగ్రత్తలు (ETV)

హైవే అధికారులతో సమన్వయంతో : టోల్ గేట్ల వద్ద ఛార్జీ లేకుండా వాహనాలు అనుమతించాలని కేంద్ర మంత్రి నితిన్ గర్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ రాయగా జాతీయ విధానం దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని జవాబు ఇచ్చారు. స్థానిక హైవే అధికారులతో సమన్వయం చేసుకుని టోల్ ఫీజు చెల్లించుకుండా సాఫీగా వెళ్లేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మంత్రి వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిమిషంన్నర టోల్ గేట్ వద్ద ఆలస్యమవుతుందని, వాహనాలు ముందుకు సాగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

"టోల్ గేట్ల వద్ద భారీ రద్దీ ఉంటే టోల్​ ఛార్జీ లేకుండానే ప్రయాణాలు అనుమతించాలని ఆదేశించాం. గుంటూరు, మాచర్ల వెళ్లేవారు మార్కాట్​పల్లి నుంచి కుడి వైపునకు వెళితే నల్గొండ మీదుగా వెళ్లవచ్చు. త్వరలోనే విజయవాడ - హైదరాబాద్ రహదారికి సమాంతరంగా అమరావతి రింగురోడ్డు మీదుగా బందరు వరకు గ్రీన్​ ఫీల్డ్ హైవేను నిర్మిస్తున్నాం. రెండు హైవేలతో పాటు హైస్పీడ్​ రైల్​ను కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మించనుంది." - కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రోడ్లు, భవనాలు శాఖ మంత్రి

ఈ రహదారులపైనా ప్రత్యేక దృష్టి : నేటి నుంచి 17వ తేదీ మధ్యాహ్నం వరకు హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై విపరీతమైన వాహనాల రద్దీ ఉంటుంది. మళ్లీ 18 నుంచి 20వ తేదీ వరకు తిరుగు ప్రయాణాలతో విజయవాడ - హైదరాబాద్ రద్దీ ఉండనుంది. దీనితో పాటూ హైదరాబాద్ - కర్నూలు, హైదరాబాద్ - ఆదిలాబాద్, హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారులన్నీ కూడా రద్దీగా మారిన దృష్ట్యా ఆయా రహదారులపై కూడా రోడ్లు, భవనాలు శాఖ, పోలీసు శాఖ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

అవసరమైతే రంగంలోనికి హెలికాప్టర్​లు : ఆయా రహదారులపై ప్రమాదాలు సంభవించకుండా ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకుంది. అయినా ప్రమాదం సంభవిస్తే తక్షణమే స్పందించేందుకు హైవే అథారిటీ, రోడ్లు, భవనాలు శాఖ, పోలీసు శాఖ అప్రమత్తంగా ఉన్నాయి. దీనికోసం కంట్రోల్ రూం పెట్టి టోల్ ఫ్రీ నంబరు 1033 కూడా అందుబాటులో పెట్టింది. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక ఆంబులెన్స్ కూడా ఏర్పాటు చేసింది. ఏదైనా పెను ప్రమాదం సంభవించి ప్రాణాపాయంలో ఉన్నట్లైతే ట్రాఫిక్ తీవ్రత కారణంగా సంఘటనా స్థలానికి వెళ్లలేని పక్షంలో అవసరమైతే హెలికాప్టర్ ద్వారా క్షతగాత్రులను హైదరాబాద్ ఆసుపత్రిలో వైద్య సేవలందించేందుకూ ఏర్పాట్లు చేశారు.

యాక్సిడెంట్ స్పాట్ల వద్ద జాగ్రత్త : ట్రాఫిక్​ను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు పోలీసులు డ్రోన్లకు కూడా ఉపయోగిస్తున్నారు. సూర్యాపేట వద్ద పోలీసులు డ్రోన్ల సాయంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించారు. నేడు, రేపు జాతీయ రహదారులపై భారీ ట్రాఫిక్ ఉండనున్న దృష్ట్యా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై 17 యాక్సిడెంట్ స్పాట్ల వద్ద నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్లాలని పోలీసు శాఖ, రోడ్లు, భవనాల శాఖలు సూచిస్తున్నాయి. నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లొచ్చే క్రమంలో ప్రయాణికులంతా పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశాయి.

హైదరాబాద్​-విజయవాడ హైవేపై సంక్రాంతి వాహనాల రద్దీ - ట్రాఫిక్​ తప్పాలంటే ఈ దారుల్లో వెళ్లండి

ఏపీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ - హైదరాబాద్ టూ విజయవాడ 10 ప్రత్యేక రైళ్లు

Last Updated : January 11, 2026 at 6:59 AM IST