ETV Bharat / state

ముగ్గురాయిలో మాయాజాలం - పైసల వ్యత్యాసంతో బిడ్లు వేసి రూ.340 కోట్లకు ఎసరు

మంగంపేటలో ఏపీఎండీసీ గని నుంచే ముగ్గురాయి కొనుగోలు - 2.82 లక్షల టన్నుల బి-గ్రేడ్ ముగ్గురాయికి ఇటీవల టెండర్లు - రాజమహేంద్రవరంతో పాటు అహ్మదాబాద్, అంకలేశ్వర్

Oil And Natural Gas Corporation Tenders
Oil And Natural Gas Corporation Tenders (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 26, 2026 at 11:05 AM IST

3 Min Read
Choose ETV Bharat

Oil and Natural Gas Corporation Tenders Frauds: ముగ్గురాయి కోసం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్-ONGC పిలిచిన టెండర్లలో మిల్లర్లు కుమ్మక్కయ్యారు. 340 కోట్ల రూపాయల విలువైన టెండరులో కేవలం పైసల వ్యత్యాసంతో బిడ్లు వేసి టెండర్లు దక్కించుకున్నారు. సిండికేట్‌ అయ్యారని స్పష్టంగా కనిపిస్తున్నా ONGC అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా వారికే టెండర్‌ కట్టబెట్టడం అనుమానాలకు తావిస్తోంది.

2.82 లక్షల టన్నుల బి-గ్రేడ్ ముగ్గురాయికి ఇటీవల టెండర్లు : ONGC ఆయిల్, గ్యాస్ డ్రిల్లింగ్ సమయంలో ఒత్తిడిని తట్టుకునేందుకు, బ్లోఅవుట్ నివారణకు ముగ్గురాయిని వినియోగిస్తుంది. తిరుపతి జిల్లా ఓబుళవారిపల్లె మండలంలోని మంగంపేటలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ-APMDCకు చెందిన గని నుంచే ఎవరైనా ముగ్గురాయిని కొనుగోలు చేస్తారు. 2026-28 సంవత్సరానికి 4.1 స్పెసిఫిక్ గ్రావిటీ ఉండే 2.82 లక్షల టన్నుల బి-గ్రేడ్ ముగ్గురాయిని తీసుకునేందుకు ONGC ఇటీవల టెండర్లు పిలిచింది.

దీన్ని రాజమహేంద్రవరంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని అహ్మదాబాద్, అంకలేశ్వర్, క్యాంబే, జోద్‌పూర్‌, నజిరా, జోర్హత్, సిల్చర్, అగర్తలా, కోల్‌కతాలో ఆయిల్, గ్యాస్ డ్రిల్లింగ్‌కు వాడనున్నారు. సాధారణంగా మంగంపేట, రైల్వేకోడూరు, కడపలో ఉండే పల్వరైజింగ్ మిల్లర్లు APMDC నుంచి ముగ్గురాయి తీసుకొని, తమ మిల్లుల్లో పొడి చేసి, ONGC చెప్పిన ప్రాంతాలకు రైల్వే ర్యాక్స్‌లో లోడ్ చేసి పంపిస్తారు.

రూ.339.99 కోట్ల ధరతో తొలి 5స్థానాల్లో నిలిచిన మిల్లర్లు : 2.82 లక్షల మెట్రిక్‌ టన్నుల కోసం ONGC పిలిచిన టెండర్లకు 14 సంస్థలు బిడ్లు వేశాయి. ఇందులో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన మిల్లర్లు విచిత్రంగా 339.99 కోట్ల రూపాయల ధరతోనే కోట్ చేశారు. ఇలా దాదాపు 340 కోట్ల రూపాయల టెండరుకు కేవలం పైసలు, రూపాయల తేడాతో బిడ్లు రావడమంటే, వారికే కాంట్రాక్టు దక్కేలా కుమ్మక్కైనట్లు తెలిసిపోతోంది. అయినా, ఎల్-1, ఎల్‌-2, ఎల్‌-3లు ONGCకి అవసరమైన ముగ్గురాయిని 50శాతం, 30శాతం, 20శాతం సరఫరా చేసేలా అధికారులు బిడ్లు ఖరారు చేశారు. సిండికేట్‌గా బిడ్లు దాఖలు చేసిన విషయం స్పష్టంగా అర్థమవుతున్నా ONGC అధికారులు దీనిపై ఎలాంటి విచారణా చేపట్టలేదు.

బి గ్రేడ్ ముసుగులో సి, డి గ్రేడ్ల సరకును ఓఎన్జీసీకి సరఫరా : ఓఎన్జీసీకి బి-గ్రేడ్ ముగ్గురాయిని అందించాల్సి ఉండగా కొన్నాళ్లుగా మిల్లర్లు టన్ను రూ.2 వేలకే లభించే సి, డి గ్రేడ్ సరకు పంపుతున్నట్లు ఆరోపణలున్నాయి. మిల్లర్లు APMDC వద్ద వేల టన్నుల ముగ్గురాయిని తీసుకొని, మిల్లులో పొడి చేయాలి. కానీ కొందరు గుత్తేదారులు గత రెండేళ్లలో కలిపి మొత్తంగా APMDC వద్ద 400 నుంచి 12వేల మెట్రిక్ టన్నుల బి-గ్రేడ్ ముగ్గురాయి మాత్రమే కొన్నారు. అంటే బి గ్రేడ్ ముసుగులో సి, డి గ్రేడ్ల సరకును ఓఎన్జీసీకి అందించినట్లు స్పష్టమవుతోంది.

దాదాపు టన్నుపై 5 వేల వరకు వ్యత్యాసం : ఏపీఎండీసీ ఈ ఏడాది బి-గ్రేడ్ ముగ్గురాయి ధర పన్నులతో కలిపి టన్నుకు 7వేల 109రూపాలుగా నిర్ణయించింది. టన్ను ఖనిజాన్ని పౌడర్‌గా మార్చడం, ప్యాకింగ్, రవాణా, లోడింగ్ ఖర్చులన్నీ కలిపి 1,200 నుంచి 1,500 రూపాయల వరకు అవుతుంది. కానీ మిల్లర్ల సిండికేట్ మాత్రం ఓఎన్జీసీకి టన్నుకు 12,056 రూపాయల ధరతో సరఫరా చేసేలా కోట్ చేసింది. APMDC నుంచి కొనే ధరకు, ONGCకి అందించే ధరకు దాదాపు టన్నుపై 5 వేల వరకు వ్యత్యాసముంది. ఇంత అడ్డగోలు దోపిడీపై ONGC కళ్లు మూసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఓఎన్​జీసీ బావిలో స్వల్ప గ్యాస్ లీక్​ - సకాలంలో గుర్తించడంతో తప్పిన ప్రమాదం

కోనసీమలో ఓఎన్​జీసీ సైట్ వద్ద గ్యాస్​ లీక్ - అదుపు చేసిన టెక్నికల్ సిబ్బంది