రూ.200 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం గోల్మాల్ - నిందితుల అరెస్ట్
కస్టమ్ మిల్లింగ్ రైస్‌లో అక్రమార్కులపై చర్యలు షురూ - నిందితులపై పోలీసులకు పౌర సరఫరాల శాఖ ఫిర్యాదు - ఇద్దరి అరెస్ట్ - పరారీలోని మరో ఐదుగురి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు

Published : February 26, 2026 at 7:35 AM IST
Millers Arrested for CMR Irregularities : ఉమ్మడి నల్గొండ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్‌లో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించి, సుమారు రూ.200 కోట్లు ప్రభుత్వానికి చెల్లించని నిందితులపై పౌర సరఫరాల శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు, మరో ఐదుగురి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
కేటాయించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా : కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం కేటాయించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2022-23 సంవత్సరంలో సీఎంఆర్ కింద వివిధ మిల్లులకు ప్రభుత్వం ధాన్యం కేటాయించింది. చిట్యాల మండలంలోని వరలక్ష్మీ పారాబాయిల్డ్ మిల్, కేతేపల్లిలోని చాముండేశ్వరి పారాబాయిల్డ్, మునుగోడులోని మురళీ మనోహర్ ఆగ్రో ఫుడ్స్, నల్గొండలోని రామ్‌లక్ష్మణ్, కనకమహాలక్ష్మీ, సుమాంజలి, గౌతమి ఇండస్ట్రీస్ మిల్లులకు ధాన్యం ఇచ్చింది. ఆయా మిల్లులు ఇప్పటి వరకూ సీఎంఆర్ బియ్యాన్ని తిరిగివ్వలేదు. ఏడాది కింద మిల్లుల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని సర్కార్ వేలం వేసింది. కొనుగోలు దారులకు ధాన్యం ఇవ్వాల్సి ఉంది. లేదంటే ధాన్యానికి తగిన రేటు ప్రకారం డబ్బులు ఇవ్వాల్సి ఉంది. మొత్తం రూ.191 కోట్ల విలువైన 58,955 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలను ఇవ్వాల్సి ఉన్నా, మిల్లర్లు ఇవ్వలేదు. ధాన్యం ఎగ్గొట్టిన మిల్లర్లపై పౌర సరఫరాల సంస్థ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేసి నల్గొండలోని సుమాంజలి రైస్ మిల్ యజమాని కందుకూరి మహేందర్, అతని భార్య పద్మను అరెస్ట్ చేశారు. మిగిలిన మరో ఐదుగురి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
ప్రధాన నిందితుడు ఎవరంటే? : కస్టమ్ మిల్లింగ్ రైస్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన ఘటనలో కందుకూరి మహేందర్ ప్రధాన పాత్ర పోషించినట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి రూ.19 వేల నగదు, 3 మొబైల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పరారీలో ఉన్న మిల్లర్లు మాశెట్టి రాధాకృష్ణ, కృష్ణమూర్తి, దామోదర్, రవి కుమార్, బాలకృష్ణను త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు.
ఇందులో ప్రధాన నిందితుడు కందుకూరి మహేందర్, కందుకూరి పద్మ. మనకు రబీ సీజన్ 2022-23 సంవత్సరంలో సుమారు రూ.43 కోట్ల విలువ గల ధాన్యం వీళ్లు ప్రభుత్వం నుంచి తీసుకుని, బియ్యం ప్రభుత్వానికి ఇవ్వకుండా, దానికి బిల్లింగ్ కట్టకుండా దాన్ని దారి మళ్లించారు. ఈ మేరకు సివిల్ సప్లై అధికారులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిందితులు ఇద్దరు ఫోన్ స్విచాఫ్ చేసి తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా వాళ్లను స్పెషల్ టీమ్స్‌తో పట్టుకోవడం జరిగింది. మిగతా నిందితులు కూడా పరారీలో ఉన్నారు. వాళ్లను కూడా త్వరలో పట్టుకుంటాం. - శరత్ చంద్ర పవార్, నల్గొండ ఎస్పీ
మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు : సూర్యాపేట జిల్లాలోనూ రెండేళ్లుగా భారీ మొత్తంలో వడ్లను మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఓ డిఫాల్టర్ మిల్లర్ ఏకంగా తెలుగు చిత్రపరిశ్రమలో సినిమాలకు పెట్టుబడులు పెట్టారు. నల్గొండకు చెందిన కొందరు మిల్లర్లు హైదరాబాద్‌లో భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించుకున్నారని పోలీసులు విచారణలో తేలింది. నిందితులను అరెస్టు చేసిన అనంతరం రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగిస్తామని అధికారులు వెల్లడించారు. చట్ట ప్రకారం పక్కదారి పట్టించిన ధాన్యం నిల్వలకు సరిపడా మొత్తాన్ని రాబట్టేలా వారి ఆస్తులను బహిరంగ వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వాళ్లొస్తే డిగ్రీ - వీళ్లొస్తే ఎంబీఏ - బోర్డులు మారుస్తూ కళాశాలల అక్రమాలు

