ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో ఈదురుగాలులు వీస్తాయి : వాతావరణశాఖ
ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో 3, 4 రోజులు ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణశాఖ - అతి భారీ వర్షాలు కురుస్తాయనుకున్నా పరిస్థితి అనుకూలించలేదని, ఇందుకు ఎల్‌నినో పరిస్థితులు కూడా కారణమని వెల్లడి

Published : July 6, 2026 at 7:08 PM IST
Gusty Winds In Northern And Northeastern Districts : ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో మూడు నాలుగు రోజులు గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ, రేపు తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదని చెప్పారు. ఇందుకు ఎల్‌నినో పరిస్థితులు కూడా కారణమని పేర్కొన్నారు. ఆకాశం మేఘావృతమైనప్పటికీ గాలులు వేగంగా వెళ్తుడటం వల్ల వర్షాలు కురవడంలేదని ఆయన వెల్లడించారు.
ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన : నైరుతి రుతుపవనాలు సమయంలో కూడా రుతుపవనాలు వచ్చినంత సరే ఓక సమయంలో వర్షం పడే అవకాశం ఉండకపోవచ్చని శ్రీనివాస్ రావు తెలిపారు. గత మూడు రోజుల క్రితం వాయు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడిందని గుర్తు చేశారు. తర్వాత అది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని, నిన్నటికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారిందని అన్నారు. కానీ దీని ప్రభావం ఉత్తర ఒరిస్సా తీరానికి సమీపంలో, తెలంగాణ రాష్ట్రానికి దూరంగా ఏర్పడిందని తెలిపారు. అందువల్ల దీని ప్రభావం దక్షిణ, సెంట్రల్ తెలంగాణ తక్కువగా ఉంటుందని, ఉత్తర, ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన చేశామని వెల్లడించారు.
వానలు విస్తృతంగా పడటం లేదు : ఉత్తర, ఈశాన్య జిల్లాలకు వాయుగుండం మరింత దూరంగా జరిగిపోయినందున, ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడలేదని 3, 4 సెంటీ మీటర్లు వర్షపాతమే నమోదైందని శ్రీనివాస్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం ఉందని, ఆ ప్రభావం వల్ల రాష్ట్రంలో అనుకునంత మేర వర్షాలు కురవలేదని అన్నారు. ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయని, ఆకాశం మేఘావృతమైనప్పటికీ గాలులు వేగంగా వెళ్తుడటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురవడం లేదని వివరించారు.
"ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో మూడు, నాలుగు రోజులు గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. నైరుతి రుతుపవనాల సమయంలో కూడా రుతుపవనాలు వచ్చినంత సరే ఒక సమయంలో వర్షం పడే అవకాశం ఉండకపోవచ్చు. ఉత్తర, ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన చేశాం" - శ్రీనివాస్ రావు, వాతావరణ శాఖ అధికారి
'వానలు లేవు - మళ్లీ వలసే దిక్కయ్యేలా ఉంది! - 'ఎల్‌నినో'తో చతికిలపడ్డ సాగు పనులు

