వైద్య సేవల్లో డ్రోన్లు - గిరిజన ప్రాంతాలకు సకాలంలో మందులు, రిపోర్టులు
గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రులకు డ్రోన్లతో ఔషధాలు, రిపోర్టులు - అక్కడినుంచి రక్త, మల, మూత్ర నమూనాలు తీసుకెళ్లడం కూడా - అల్లూరి జిల్లాలో తొలి దశ అమల్లో సత్ఫలితాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 4, 2026 at 1:42 PM IST
Medicines and Reports Delivered to Hospitals in Tribal Areas Via Drones: మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల్లో డ్రోన్ల వినియోగం దిశగా ప్రభుత్వం చేసిన కసరత్తు కార్యరూపం దాల్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. డ్రోన్లతో మందులు, బ్లడ్ యూనిట్లు పంపి అక్కడి నుంచి రక్త, మల, మూత్ర నమూనాలు వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చే ప్రణాళికలు కార్యరూపం దాల్చాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో డ్రోన్ సేవలందిస్తున్న రెడ్‌వింగ్ సంస్థతో రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గతేడాది డిసెంబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ‘ఫ్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్’ కింద ప్రాథమిక సేవలు పాడేరు కేంద్రంగా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి చుట్టుపక్కల పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రులకు డ్రోన్ ద్వారా రిపోర్టులు, ఔషధాల సరఫరా గత కొంతకాలంగా చేపట్టారు.
3 దశల్లో సేవల విస్తరణ: అల్లూరి జిల్లావ్యాప్తంగా మూడు దశల్లో డ్రోన్ ద్వారా వైద్యసేవలు విస్తరించనున్నారు. ప్రస్తుతం మొదటి దశలో ఎనిమిది వైద్యారోగ్య కేంద్రాల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. వీటిలో చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రి, ముంచంగిపుట్టు సీహెచ్‌సీ, భీమవరం, తాజంగి, సుంకరిమెట్ట, లోతుగెడ్డ, అనంతగిరి పీహెచ్‌సీలు ఉన్నాయి. రోజూ రక్త నమూనాలను ఆయా ఆసుపత్రులు నుంచి జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌కు డ్రోన్ తీసుకొస్తోంది. ఇక్కడ నుంచి ముందు రోజు రిపోర్టులు, అవసరమైన మందులు తీసుకెళ్లి అందిస్తోంది. రెండో దశలో మరో 10 వైద్యశాలల్లో ప్రారంభిస్తారు. మూడో దశలో మిగిలిన ఆసుపత్రులకూ సేవలు విస్తరిస్తారు.
పాడేరులోని డ్రోన్ హబ్ నుంచి: పాడేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 80 సెంట్ల స్థలంలో డ్రోన్ హబ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి 100 కి.మీ. పరిధిలోని వైద్యశాలలకు డ్రోన్ సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రుల దగ్గర డ్రోన్ ఆపరేటింగ్ తెలిసిన ఒకరిని, వైద్యుల నుంచి నమూనాలు, మందులు తెచ్చి, ఇచ్చేలా మరొకరిని నియమించారు. అక్కడ నుంచి ఎగిరి వచ్చిన డ్రోన్ పాడేరులో దిగిన తర్వాత ఇక్కడ నుంచి బైక్ రన్నర్‌తో జీజీహెచ్‌కు నమూనాలు చేరవేస్తారు. మళ్లీ జీజీహెచ్‌లో సిద్ధంగా ఉన్న మందులు, రిపోర్టులు తీసుకొచ్చి డ్రోన్‌లో ఉంచుతారు. ప్రస్తుతం నాలుగు డ్రోన్లు ఉండగా మూడింటి ద్వారా తొలి దశ సేవలు అందిస్తున్నారు. మరొకటి అత్యవసర సేవలకు వీలుగా అందుబాటులో ఉంచారు.
- అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజంగి పీహెచ్‌సీ ఎదుట డ్రోన్ ఇటీవల వచ్చివాలింది. సిబ్బంది వెంటనే అప్పటికే సేకరించిన రక్త నమూనాలను కిట్‌లో పెట్టి అందులో ఉంచారు. వెంటనే అది గాల్లోకి ఎగిరిపోయింది. తర్వాత రోజు అదే సమయానికి డ్రోన్ మళ్లీ రక్త నమూనాల రిపోర్టులతో వచ్చి వాలింది.
- చింతపల్లి పీహెచ్‌సీలో ఈ నెల 23న మలేరియా మందుల కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రం పాడేరులోని జీజీహెచ్‌కు సమాచారం ఇచ్చిన 40 నిమిషాల్లోనే డ్రోన్ ఔషధాలను మోసుకొచ్చింది.
'గిరిజనులకు సకాలంలో వైద్యం అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అందుబాటులోకి తెచ్చింది. డ్రోన్లతో వైద్య సేవలను అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏడాదిన్నర పాటు అందించాం. ఇప్పుడు అక్కడ ప్రభుత్వమే డ్రోన్ సేవలు అందిస్తోంది. ఒడిశా జిల్లా కంధమాల్ జిల్లాలోనూ ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నాం. త్వరలో విశాఖలోని కేజీహెచ్‌కు అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విశాఖలో రక్షణ రంగం ప్రాజెక్టులు ఉండడంతో అనుమతుల కోసం దరఖాస్తు చేశాం. అనుమతులు వచ్చిన వెంటనే సేవలు ప్రారంభిస్తాం.' -రెడ్‌వింగ్ సంస్థ ప్రతినిధులు
డ్రోన్ సాంకేతికతపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ - భవిష్యత్ ఉపాధి అవకాశాలపై దృష్టి
రైతులకు ఉపయుక్తంగా "అద్దెకు డ్రోన్లు" - బుక్ చేస్తే వచ్చి వాలుతుంది

