ఏపీకి మరో నవరత్న కంపెనీ - రూ.26 వేల కోట్లతో తయారీ యూనిట్!
దుగరాజపట్నం షిప్‌యార్డు నిర్మాణంలో భాగస్వామ్యం - సీఎంతో చర్చించిన మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ - రూ.26,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం - 24న డీపీఆర్ తయారీ సంస్థ ఎంపిక

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 22, 2026 at 10:55 AM IST
MDL Shipbuilding in Dugarajapatnam : ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. కొత్తగా తమ సంస్థలను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన కంపెనీలకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే పలు సంస్థలు కార్యకలాపాలను ప్రారంభించగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మరోవైపు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులను సర్కార్ అభివృద్ధి చేస్తోంది.
ఈ క్రమంలోనే ఏపీకి మరో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రాబోతోంది. నౌకా నిర్మాణ రంగంలో కీలకంగా వ్యవహరిస్తున్న రక్షణరంగ సంస్థ మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) రాష్ట్రంలో తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దుగరాజపట్నంలో ప్రతిపాదించిన షిప్ బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధికి ఎండీఎల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ప్రతిపాదనపై ఎండీఎల్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఇటీవల చర్చలు జరిపారు.
నవరత్న కంపెనీగా పరిగణిస్తున్న ఎండీఎల్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధికి సుమారు రూ.26,000 కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని అధికారుల ప్రాథమిక అంచనా. ఈ పెట్టుబడులను విదేశాల నుంచి సమీకరించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో నిర్దేశించిన ప్రకారం కేంద్ర సహకారంతో దుగరాజపట్నంలో పోర్టును అభివృద్ధి చేయాల్సి ఉంది. భారత నౌకాదళం, తీర రక్షక దళం కోసం విధ్వంసక నౌకలు, స్టెల్త్‌ఫ్రిగేట్లు, కార్వెట్లు(చిన్న యుద్ధనౌకలు), పెట్రోలింగ్ నౌకలు, జలాంతర్గాముల నిర్మాణంలో ఎండీఎల్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థ వాణిజ్య నౌకలనూ నిర్మిస్తోంది.
MDL Shipbuilding Cluster in AP : ఎండీఎల్ను 1934లో ఏర్పాటు చేశారు . దీన్ని 1960లో కేంద్రం టేకోవర్ చేసింది. కొన్ని దశాబ్దాలుగా షిప్‌బిల్డింగ్ రంగంలో ఈ సంస్థ కీలకంగా ఉంది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ కావడంతో ఏపీ సర్కార్ కూడా దుగరాజపట్నం షిప్‌యార్డు నిర్మాణానికి ఎండీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చల సందర్భంగా మూలధన పెట్టుబడిలో 30 శాతం రాయితీ ఇవ్వాలని ఆ సంస్థ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాయితీ కింద ఎంత మొత్తం అనుమతించాలనే విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తోంది.
దుగరాజపట్నంలో పోర్టు అభివృద్ధికి అవసరమైన కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అయ్యే ఖర్చును కేంద్రమే భరించనుంది. ఏపీ సర్కార్ తన వాటా కింద పోర్టు, షిప్‌బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధికి అవసరమైన భూములను అందిస్తుంది. పోర్టు, షిప్‌యార్డు నిర్మాణానికి వీలుగా 2200 ఎకరాలు సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు కార్యాచరణ చేపట్టింది. షిప్‌యార్డుకు 1000 ఎకరాలు, అనుబంధ పరిశ్రమల కోసం 1350 ఎకరాలు కేటాయించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.. ఏపీ మారిటైం బోర్డు, విశాఖపట్నం పోర్టు అథారిటీలు దుగరాజపట్నం పోర్టు, షిప్‌బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధిని పర్యవేక్షించనున్నాయి.
మరోవైపు దుగరాజపట్నం పోర్టు, షిప్‌బిల్డింగ్, నౌకల మరమ్మతుల క్లస్టర్ అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారు చేసేందుకు టెక్నికల్ కన్సల్టెంట్‌ను నియమించేందుకు ఏపీ సర్కార్ ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) ప్రకటన ఇచ్చింది. దీనికి స్పందించి వచ్చిన ప్రతిపాదనలను ఈ నెల 24న పరిశీలించి డీపీఆర్ తయారీకి సంస్థను సెలక్ట్ చేస్తారు. షిప్‌యార్డు లేఅవుట్ సహా పోర్టు, షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌కు మాస్టర్‌ప్లాన్‌తో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేదుకు చేపట్టాల్సిన పనులకూ డీపీఆర్ తయారీ సంస్థ అంచనాలు రూపొందించనుంది.
ఏడాదిలో రూ.27,610 కోట్ల పెట్టుబడులు - ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమల హబ్‌గా ఏపీ
ఏపీలో మూడు నోడ్‌ల ద్వారా రూ.31,300 కోట్ల పెట్టుబడులే లక్ష్యం - 1.95 లక్షల మందికి ఉపాధి

