తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు - మే నెల కోటా బుకింగ్ షెడ్యూల్ వెల్లడి
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఈనెల 18 నుంచి అందుబాటులోకి రానున్న మే నెల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు - వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించిన టీటీడీ అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 17, 2026 at 10:26 AM IST
May Month Srivari Arjitha Seva Tickets To Be Released on 18th: భక్తుల సౌకర్యార్థం 2026 మే నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు టికెట్లకు సంబంధించి ఎలక్ట్రానిక్ డిప్‌లో పేర్ల నమోదు ఈనెల 18న టీటీడీ ఆన్లైన్లో ప్రారంభం కానుంది. అనంతరం డిప్‌లో ఎంపిక చేస్తారు. డిప్‌లో ఈ-టికెట్లు పొందిన వారు ఫిబ్రవరి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రీవారి ఆర్జిత సేవలు అయిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల మే నెల కోటాను ఈనెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవలకే లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఈనెల 20వ తేదీ నుంచి ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన వారు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించి లక్కీ డిప్ టికెట్లు పొందాల్సి ఉంటుంది.
- ఈనెల 21న కల్యాణ్యోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటా మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతుంది.
- ఈనెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, అదేరోజు 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ కోటా విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు విడుదల చేస్తారు.
- ఈనెల 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటా విడుదల చేస్తారు.
- ఈనెల 27న ఏప్రిల్‌కు సంబంధించి శ్రీవారి సేవ, పరకామణి సేవల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి https://ttdevasthanams.ap.gov.in/home/dashboard వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
సర్వదర్శనానికి 8 గంటల సమయం : తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న(సోమవారం 16-02-2026) తిరుమల శ్రీవారిని 73,776 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్నఒక్క రోజే హుండీ ద్వారా రూ. 4.42 కోట్లు ఆదాయం లభించింది.23,291 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
శ్రీవారి సేవలో టీ20 అమెరికా క్రికెట్ జట్టు: తిరుమల శ్రీవారిని టీ20 అమెరికా క్రికెట్ జట్టు దర్శించుకుంది. శ్రీవారి సేవలో అమెరికా క్రికెట్ జట్టులోని భారత సంతతి ప్లేయర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ మోనాంక్ పటేల్ మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని అన్నారు. ఆలయ ప్రాంగణం, పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఐసీసీ, బీసీసీఐ, ఏపీ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీవారి డాలర్ల విక్రయంలో మార్పులు - ఇకపై దర్శన టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే
అధునాతన వ్యవస్థగా తిరుమల 'ఏఐ కమాండ్' - అయోధ్య, కాశీ, సోమనాథ్ ఆలయాల్లో అమలుకు సన్నాహాలు

