తిరుమలకు ప్రముఖులు - శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటీమణులు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ - జనవరి 14న విడుదల కానున్న "అనగనగా ఒక రాజు" చిత్రం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 7, 2026 at 1:02 PM IST
Mauritius President Visited Tirumala Temple : మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, మంత్రి ఆనం ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆయన స్వామివారి తీర్థప్రసాదాలను అందుకున్నారు. అంతేకాకుండా పండితులు ధరమ్ బీర్ గోకుల్‌కు వేదాశీర్వచనం అందజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న నటీమణులు : తిరుమల శ్రీవారిని వేర్వేరు సమయాల్లో సినీ నటీమణులు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌లు దర్శించుకున్నారు. దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌లు వెంకన్నను దర్శించుకొని మెుక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వైకుంఠ ఉత్తర ద్వార ప్రవేశం చేశారు. మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
దర్శనం అనంతరం తెలుగు ప్రజలకు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌లు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత జనవరి 14న "అనగనగా ఒక రాజు" అనే చిత్రం విడుదల కానుందని మీనాక్షి చౌదరి వెల్లడించారు. ఈ ఏడాది మధ్యలో నాగచైతన్యతో నటించిన చిత్రం కూడా విడుదలవుతుందని పేర్కొన్నారు. టీటీడీ అధికారులు మంచి దర్శన ఏర్పాట్లు చేశారని ఐశ్వర్య రాజేశ్ ప్రశంసించారు. సంక్రాంతికి విడుదలయ్యే ప్రతి చిత్రానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
మూడు రోజులు దాదాపు 33 వేల వాహనాలు కొండపైకి :
- వైకుంఠ ఏకాదశి, కొత్త ఏడాది వేడుకల సందర్భంగా తిరుమలకు భక్తుల రాక గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో తిరుమల బాటలో వాహనాలు వెల్లువెత్తాయి. మూడు రోజుల వ్యవధిలోనే (డిసెంబరు 30 నుంచి జనవరి 1 వరకు) తిరుపతి నుంచి తిరుమలకు దాదాపు 33,000 వాహనాలు చేరుకున్నాయి.
- శ్రీవారి దర్శనం: డిసెంబరు 30వ తేదీన 67,053 మంది, 31న 70,256 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
- గురువారం సాయంత్రం 5 గంటల వరకు 40,008 మంది వరకు స్వామివారిని దర్శించుకోగా, వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 1,77,337 మంది భక్తులు ఆ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.
తలనీలాల మొక్కు: డిసెంబరు 30వ తేదీన 16,301 మంది తలనీలాలు సమర్పించగా, 31న ఆ సంఖ్య 25,102కు పెరిగింది.
హుండీ కానుకలు: భక్తులు సమర్పించిన కానుకలు డిసెంబరు 30న రూ. 2.25 కోట్లు, కాగా 31న రికార్డు స్థాయిలో రూ. 4.79 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
సూపర్‌హిట్ విధానంతో స్లాట్ బుకింగ్ : సుమారు 70 వేల మంది భక్తులు దర్శనానికి వస్తారని అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు తగ్గట్టుగా స్లాట్ విధానాన్ని అమలు చేసింది. ఎక్కడ రిపోర్ట్ చేయాలి? ఏ సమయానికి చేరుకోవాలి? అనే సమాచారాన్ని భక్తులకు ముందే మెసేజ్‌లు పంపించింది. దీంతో వైకుంఠ ఏకాదశి (డిసెంబరు 30) రోజు రికార్డు స్థాయిలో 67,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరుసటి రోజు (డిసెంబరు 31) అదే స్థాయిలో భక్తులకు దర్శన భాగ్యం కలిగిందనట్లు అధికారులు వివరిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చినా స్లాట్ విధానం అద్భుతంగా పని చేసిందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
పరకామణి కేసు - వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది: హైకోర్టు

