కొండపైన శివాలయం - కొండ కింద మత్స్యగుండం - పర్యటకులకు కనువిందు
పర్యాటకులను ఆకట్టుకుంటోన్న మత్స్యగుండం - ఓ వైపు కొండపై శివాలయం, మరోవైపు కొండ దిగువున మత్స్యగుండం - అద్భుత దృశ్యాన్ని వీక్షించి తన్మయం పొందుతున్న పర్యాటకలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 27, 2025 at 5:24 PM IST
Matsyagundam Temple in Alluri Sitharama Raju District : అల్లూరి జిల్లాలో ప్రధాన వనరు పర్యాటక రంగమే. ప్రకృతి అందాలకు నెలవైన అల్లూరి జిల్లాకు పర్యాటకంగా విశేష గుర్తింపు పొందింది. పది మంది కలిసి ఆహ్లాదంగా ప్రకృతి వేడుకలు జరుపుకొనేందుకు లంబసింగి నుంచి అరకు వరకు ఎన్నో ప్రదేశాలున్నాయి మన అల్లూరి జిల్లాలో. మన్యంలో భౌగోళిక అందాలు విహారయాత్రగా పట్టణవాసులను ఇక్కడకు తీసుకొస్తున్నాయి. అడవులు, ప్రకృతి అందాలు, జలపాతాలు, మంచు సోయగాలు కలబోసుకుని పర్యాటకుల రాకకు బాటలు వేస్తున్నాయి. మన్యంలోని లంబసింగి అందాలు, చెరువులవెనం వ్యూపాయింట్, తాజంగి జలాశయం, బోటుషికారు, కొత్తపల్లి జలపాతాలు, మత్స్యగుండం, చాపరాయి జలవిహారి, అరకు మ్యూజియం, బొర్రాగుహలు విహారానికి ప్రత్యేక వేదికలవుతున్నాయి.
మత్స్యగుండం ఓ అద్భుత దృశ్యం : మన్యం కొండ కోనల్లో ఎన్నో సుందరమైన ప్రకృతి దృశ్యాలు దాగి ఉన్నాయి. అందులోనూ పర్యాటక స్వర్గధామాల్లో మత్స్యగుండం ఒకటి. ఓ పక్కన కొండపై నెలకొని ఉన్న శివాలయం, కొండ దిగువున ప్రవహించే మత్స్యగుండం ఇది ఓ అద్భుత దృశ్యం. దీని గురించి తెలిసిన వారు తప్పక ఈ పర్యాటక కేంద్రాన్ని వీక్షిస్తారు. ప్రకృతి ప్రేమికులు ఇక్కడకు వచ్చి ఆనందంగా గడుపుతారు. రమణీయమైన ప్రకృతి సహా దైవత్వంలో ఈ ప్రాంతం మరింత మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది.
అల్లూరి జిల్లా హుకుంపేట మండలం మత్స్యగుండం పాడేరుకు 12 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది మత్య్సగుండం. రహదారి చేరుకునేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. మత్స్య రూపంలో ఇక్కడ శివుడు, నాగ రూపంలో నాగదేవతలు పూజలందుకుంటారు. ఎంతో చారిత్రాత్మక వైభవం కలిగిన ఈ ప్రకృతి సంపద వీక్షిస్తే పర్యాటకులు ఎంతో మధుపమైన అనుభూతి పొందుతారు. సెలవులు కావడంతో అందరూ సరదగా ట్రిప్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది పర్యాటకులు అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే మత్య్సగుండం పర్యాటకులతో సందడిగా మారింది.
'ఎప్పుడూ భవనాలు రోడ్లు చూసిన మాకు ఇక్కడ జలపాతం పచ్చని ప్రకృతి ఎంతో అందంగా అనిపించింది. రెండు కొండల మధ్య నుంచి జారే నీటి దారలు చూడముచ్చటగా అనిపిస్తున్నాయి. విహారం వినోదభరితంగానే కాకుండా ఇక్కడ మత్య్సలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం మంచి అనుభూతిని ఇచ్చింది. సెలవు రోజులు కావడంతో మేము పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చాము. మత్య్సగుండం మాకు మధురమైన జ్ఞాపకాలు ఇచ్చింది.' -పర్యాటకులు
ఆ చేపల్ని పూజిస్తారు : కొండల మధ్య బండ రాళ్లు ఆ మధ్యలో గలగలా పారే సెలయేరు ప్రవహించే దృశ్యం మదిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొండ మీద పచ్చని చెట్లు, జలపాతం హొయలు ఆ మొత్తం ప్రదేశం చూడడానికి రెండు కళ్లు సరిపోవంటారు అక్కడికి వచ్చిన పర్యాటకులు. కింద బ్రిడ్జిపై నుంచి చూస్తే మరింత సౌందర్యంగా కనిపిస్తుంది. ఇక్కడ బండరాళ్ల మధ్య ఉండే చేపలు దేవతలుగా కొలుస్తారు. వీటిని స్థానికులు వేటాడరు. ప్రకృతి ప్రేమికులు చూసి మైమరుస్తారు. మఠం పంచాయతీలో వెలసిన ఈ మత్స్యగుండం దేవాలయం ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, జలపాతాల నడుమ అద్భుతమైన ప్రదేశంలో వెలసిన ఈ ఆలయం పర్యాటకులను మైమరిపిస్తుంది.
మరింత అభివృద్ది అవసరం : మరోవైపు ఆలయాన్ని మరింత పునరుద్ధరించి పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చుట్టుపక్కల గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ కొద్ది రోజులుగా ఈ ప్రాంతానికి పర్యాటకుల సందడి తగ్గిందని స్థానికులు తెలుపుతున్నారు. దీనిని గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ ప్రాంత అభివృద్దికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
మంచుపై తెలియాడే సూర్యోదయం - సంతోషంలో మునిగి తేలుతున్న పర్యటకులు
పర్యటకులకు గుడ్న్యూస్ - వంజంగి 'మేఘాల కొండ'పై మెరుగైన వసతులు

