నిప్పు రవ్వతో చెలరేగిన మంటలు - బాచుపల్లిలో 33 ఫర్నీచర్ షాపులు దగ్ధం
హైదరాబాద్ బాచుపల్లిలో నిన్నరాత్రి భారీ అగ్నిప్రమాదం - నిజాంపేట్ వద్ద ట్రాన్స్‌ఫార్మర్ నుంచి చెలరేగి ఫర్నీచర్ షాప్‌కు అంటుకున్న మంటలు - ఒక్కో ఫర్నీచర్ షాప్‌లో రూ.30 లక్షల వరకు సామగ్రి ఉంటుందన్న నిర్వాహకులు

Published : March 4, 2026 at 12:02 PM IST
Massive Fire Accident In Bachupally : హైదరాబాద్ బాచుపల్లిలో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నిజాంపేట్ వద్ద ట్రాన్స్‌ఫార్మర్ నుంచి చెలరేగిన ఓ నిప్పు రవ్వ దాదాపు 30కి పైగా కుటుంబాల భవిష్యత్తును బుగ్గిపాలు చేసింది. స్థానికుల కథనం ప్రకారం మొదటగా ట్రాన్స్‌ఫార్మర్ నుంచి నిప్పు రవ్వ ఏర్పండి అది క్రమంగా మంటగా మారి దగ్గరలోని ఫర్నీచర్ షాప్‌కు అంటుకుంది. అనంతరం పక్కనే ఉన్న మరిన్ని దుకాణాలకు వేగంగా వ్యాపించింది.
33 ఫర్నీచర్ దుకాణాలకు తీవ్ర నష్టం : సోఫాలు మండే స్వభావం ఉన్న వస్తువులకు మంటలు అంటుకుని ఇంకా ఎక్కువగా చేలరేగింది. ఈ ప్రమాదం కారణంగా ఏకంగా 33 ఫర్నీచర్ దుకాణాలు కాలిబూడిదయ్యాయి. ఆ ప్రాంతంలో మొత్తం 43 తాత్కాలిక దుకాణాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో పలు ద్విచక్రవాహనాలు, సామగ్రి, డబ్బు, బంగారు ఆభరణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.
"ఈ అగ్నిప్రమాదంలో ఫర్నీచర్ షాప్స్ కాలిపోయాయి. రోడ్డు పక్కన ఫర్నీచర్ దుకాణాలు పెట్టుకుని తయారు చేస్తుంటారు. షెడ్డు వేసుకుని ఫర్నీచర్ వ్యాపారం చేస్తుంటారు. ప్రమాదం ధాటికి అవి కూడా కూలిపోయాయి. వాటి కింద కూడా కొన్ని మంటలు ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కాలేదు. కేవలం ఆస్తి నష్టం జరిగింది. ఈ సమ్మర్లో వాళ్లు షాప్స్‌కు మధ్యన కొంత గ్యాప్ మెయింటెన్ చేయాలి. అగ్నిమాపక సాధనాలు కూడా పెట్టుకోవాలి " -శ్రీనివాస్, కూకట్‌పల్లి ఏడీఎఫ్‌వో
మంటల్లో షాపులను చూసి బోరున విలపించిన నిర్వాహకులు : ఒక్కో ఫర్నీచర్ షాప్‌లో సుమారు రూ.30 లక్షల విలువైన సామగ్రి ఉంటుందని దుకాణాల నిర్వాహకులు చెబుతున్నారు. సోఫాలు, బెడ్లు, కుర్చీలు, కిటికీలు, తలుపులు, ఇతర కలప వస్తువులు కూడా బాడిదయ్యాయి. కళ్ల ముందే కాలిపోతున్న విలువైన ఆస్తులను కాపాడుకోలేక నిర్వాహకులు బోరున విలపించిన తీరు చూసిన వారిని కంటతడి పెట్టిస్తుంది. మంగళవారం రాత్రి పదిన్నర తర్వాత ఈ ప్రమాదం అకస్మాత్తుగా సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఆరు ఫైరింజన్లతో మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోడవంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
బాచుపల్లి అగ్ని ప్రమాద సంఘటన స్ధలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దగ్ధమైన ఫర్నిచర్ దుకాణాలను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రహదారికి ఇరువైపులా అనుమతులు లేని దుకాణాలు కావడంతో బీమా లాంటివి ఉండవని తెలిపారు. రోడ్డు పక్కన తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసే ముందు యాజమాన్యాలు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచించారు. అగ్నిమాపక శాఖ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం జరిగిన భారీ నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు ఆర్థిక సహాయం అందేలా ప్రయత్నిస్తామని వెల్లడించారు.
"స్టార్టింగ్ షాప్ నుంచి మూడో షాప్ దగ్గర కరెంట్ స్తంభం ఉంది. అక్కడి నుంచి నిప్పు రవ్వ పడినట్లు తెలిసింది. నా భార్య చెప్పింది. క్షణాల్లోనే మంటలు మొత్తం వేగంగా వ్యాపించాయి. మొత్తం కాలిపోతుంటే నా భార్య ఏడుస్తూ బయటకు పరుగెత్తింది. మొత్తం 43 షాపుల్లో 33 పూర్తిగా కాలిపోయాయి. వాటిలో ఒక్కో దాంట్లో రూ.30 లక్షల విలువైన సామాగ్రి ఉంటుంది. కొన్ని షాపుల్లో ఇంకా ఎక్కువగా కూడా ఉండే అవకాశం ఉంది" -దుకాణదారుడు
"మాకున్నది ఒకటే షాపు. తగలబడిపోతుందని కట్టుబట్టలతో బయటికి వచ్చాం. అన్నీ షాపుల్లో ఎన్ని కాలిపోయాయో ఏమో తెలియదు. కరెంటు వల్లే ఈ ప్రమాదం జరిగింది" -స్థానికురాలు
కోచింగ్ సెంటర్ ఉన్న బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం - సకాలంలో గుర్తించడంతో తప్పిన పెనుముప్పు
ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలోనే అగ్నిప్రమాదం - కుట్రకోణంపై పోలీసుల దర్యాప్తు

