ETV Bharat / state

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం - 20కి చేరిన మృతుల సంఖ్య

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం - 20 మంది మృతి - బాణసంచా పరిశ్రమలో ఇంకా కొనసాగుతున్న పేలుళ్లు - కాకినాడ జిల్లాలో పేలుడు ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబుకు వివరించిన అధికారులు

Kakinada District Fire Accident Updates
Kakinada District Fire Accident Updates (ETV Bharta)
author img

By ETV Bharat Telangana Team

Published : February 28, 2026 at 3:21 PM IST

|

Updated : February 28, 2026 at 5:25 PM IST

4 Min Read
Choose ETV Bharat

Massive Explosion At Fireworks Manufacturing Facility in Kakinada District Fire Accident Updates : ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనంలో 20 మంది మృతి చెందారు. పేలుడు ధాటికి పంటపొలాల్లోకి మృతదేహాలు ఎగిరిపడ్డాయి. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. అడబాల వీరబాబు అనే వ్యక్తి పొలాల్లో చదును చేసి బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. వరిపొలాల మధ్య ఎవరూ రాలేని ప్రాంతంలో ఈ బాణసంచా కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇక్కడ రోజూ 25 నుంచి 30 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఇవాళ కూడా అధిక సంఖ్యలో మహిళలు బాణసంచా తయారీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం తర్వాత బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం సంభవించింది. దాదాపు గంటకుపైగా పేలుళ్లు కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు. పరిమితికి మించి బాణసంచా తయారుచేయడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు : పేలుళ్లు సంభవించినప్పుడు భూకంపం వచ్చినంతగా శబ్ధం విన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుళ్ల కారణంగా చుట్టుపక్కల గ్రామాలు భయాందోళనకు గురయ్యారు. ఐదు గ్రామాల పరిధిలో దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకునే సరికి చాలామంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొందరి మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. 20 మంది చనిపోయినట్లు నిర్దారించారు.

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం - 20కి చేరిన మృతుల సంఖ్య (ETV Bharat)

మృతి చెందిన వారు : మృతుల్లో ఇప్పటివరకు 11 మందిని పోలీసులు గుర్తించారు. అడబాల శ్రీను, కడింపల్లి కృపమ్మ, కడింపల్లి ధనరాజు, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగ, గొడతా మహేశ్‌, గొడతా రాము, గొడతా నాని మృతి చెందారు.

ఘటనా స్థలం వద్ద బీతావహంగా పరిస్థితి : పేలుళ్ల ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొలాల మధ్య బాణసంచా తయారీ కేంద్రం ఉండటం అక్కడికి ఫైర్‌ ఇంజన్‌, అంబులెన్స్‌ వెళ్లే మార్గం కూడా లేదు. చాలాసేపటి వరకు పేలుళ్లు కొనసాగాయి. ఘటనా స్థలం వద్ద పరిస్థితి బీతావహంగా ఉంది. మంటల్లో కాలిపోయి తీవ్రంగా గాయపడి బాధితులను అతికష్టం మీద స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

అధికారులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ : కాకినాడ జిల్లాలో పేలుడు ఘటనపై అధికారులు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు. తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు ఏపీ సీఎం ఆదేశించారు. ఘటనాస్థలానికి వెళ్లాలని ఏపీ హోంమంత్రి అనితకు ఆదేశించారు. ఘటనాస్థలానికి వంగలపూడి అనిత బయలుదేరారు. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్నారు.

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. "కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటన తీవ్ర దిగ్భాంతిని కలిగించింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడాను. బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలని ఆదేశించాను. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాము. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం." హామీ ఇచ్చారు.

తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఉపముఖ్యమంత్రి : కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ విస్ఫోటనంలో పలువురు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని హామిఇచ్చారు. కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలంలో ఉండి పరిస్థితిని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించే ఏర్పాట్లు చేశారన్నారు.

కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది : ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సమాచారం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. పలువురు మృత్యువాత పడటం మాటలకు అందని విషాదం. మృతులకు నివాళులు అర్పిస్తున్నాను. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం." అని ట్వీట్ చేశారు.

బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయి : ఇంకా పలువురి మృతదేహాలను గుర్తించాల్సి ఉందని ఎంపీ ఉదయ్‌ తెలిపారు. అనుమతులు, భద్రతలో లోపాలుంటే చర్యలు ఉంటాయని, ఘటనపై దర్యాప్తు చేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

9 మంది పరిస్థితి విషమం : పరిశ్రమకు ఈ ఏడాది మార్చి 31 వరకు లైసెన్స్‌ ఉందన్న ఆర్‌డీవో బాణసంచా పరిశ్రమ యజమాని పరారీలో ఉన్నారని తెలిపారు. ఆస్పత్రుల్లో ఉన్న 9 మంది పరిస్థితి విషమంగా ఉందని, కాకినాడలో ఆరుగురు, సామర్లకోటలో ముగ్గురు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

వేట్లపాలెం ఘటనలో కొనసాగుతున్న సహాయకచర్యలు - ఘటనాస్థలానికి బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు

Last Updated : February 28, 2026 at 5:25 PM IST