ETV Bharat / state

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 21కి చేరిన మృతుల సంఖ్య

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - పేలుడు ధాటికి పంటపొలాల్లోకి ఎగిరిపడిన మృతదేహాలు - మరో 8 మంది పరిస్థితి విషమం

BLAST AT FIREWORKS IN KAKINADA
BLAST AT FIREWORKS IN KAKINADA (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 28, 2026 at 3:12 PM IST

|

Updated : February 28, 2026 at 7:51 PM IST

7 Min Read
Choose ETV Bharat

Massive Explosion at Fireworks Manufacturing Facility in Kakinada : కాకినాడ జిల్లా బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడుకు 20 మంది ఆహుతయ్యారు. మండలంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌ కేంద్రంలో నేడు (శనివారం) మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన మరో పది మందిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్‌)కి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లోవరాజు(40) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు.

పేలుళ్ల ధాటికి అందులో పని చేస్తున్న కార్మికుల శరీర భాగాలు చెల్లాచెదురైపోయాయి. కాళ్లు, చేతులు తెగి సమీపంలో ఉన్న చెట్లపై పడడంతో ఆ ప్రాంతమంతా భీతావహ పరిస్థితి నెలకొంది. చనిపోయిందెవరో గుర్తుపట్టలేనంతగా మృతదేహాలున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 70 శాతానికిపైగా కాలిన గాయాలతో ఉన్న 9 మందిని జీజీహెచ్‌కు, మరొకరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారందరి పరిస్థితీ విషమంగానే ఉంది.

(null)

ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి: ఘటనా స్థలంలో పనిచేస్తున్న వ్యక్తులు బయటకు రాలేక కళ్లముందే కాలిపోతున్నా వారిని కాపాడే పరిస్థితి లేకపోయింది. ఒక్కపక్క ఎగసి పడుతున్న మంటలు, మరోవైపు భారీ పొగతో ఏం జరుగుతుందో, మంటల్లో ఎంతమంది ఉన్నారో అంచనా వేయలేని స్థితి నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను కొంతమేర అదుపులోకి తెచ్చిన తరువాత తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న 10 మందిని గుర్తించి అంబులెన్స్‌ల్లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాణసంచా ముడిసరకు నిల్వలు భారీ ఎత్తున ఉండటంతో మంటలు సుమారు రెండుగంటలకు పైగా మండుతూనే ఉన్నాయి. ఆ ప్రదేశం మొత్తం పొగ కమ్మేయడం, వరుస పేలుళ్లతో అసలు ఏం జరుగుతుందో తెలియనంత గందరగోళం నెలకొంది.

ఛిద్రమైన శరీర భాగాలు: పేలుడు ధాటికి అక్కడ పనిచేస్తున్న పలువురి శరీర భాగాలు గాలిలో ఎగిరిపడ్డాయి. ఒక మహిళ పుర్రె భాగం పేలిపోయింది. మరో మృతదేహం పేలిపోయి మాంసం ముద్దగా పక్కనే ఉన్న పొలంలో ఎగిరిపడింది. మరో వ్యక్తి మృతదేహం సుమారు 50 మీటర్ల దూరం ఎగిరి పక్కనే ఉన్న పంట కాలువలో పడిపోయింది. శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. ఘటనా స్థలంలో కాళ్లూ, చేతులూ, ఇతర శరీరభాగాలు విడిపోయి, చెల్లాచెదురుగా పడి ఉండడంతో భీతావహ వాతావరణం నెలకొంది. ఇంతటి దారుణం ఎప్పుడూ చూడలేదని స్థానికులు విలవిల్లాడిపోయారు.

చెల్లాచెదురుగా మృతదేహాలు: సుమారు ఎకరన్నర ప్రాంతంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. షెడ్లలో పని చేసేవారు అక్కడకక్కిడే చనిపోయి కాలిపోయి పడి ఉండగా మరికొందరు గాయాలతో ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో పంట పొలాల వెంట పరుగులు తీశారు. కొందరు పొలాల్లోనే కుప్పకూలి మృతి చెందారు. చనిపోయింది ఎవరో తెలియడానికి, వారి మృతదేహాలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవడానికే సాయంత్రమైంది. పంట పొలాలు, కాలువలు, ఘటనా స్థలంలో ఉన్న మృతదేహాలన్నీ ఒకచోటకు చేర్చారు. 20 మంది మృతి చెందారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

కంపించిన ఇళ్లు: వేట్లపాలేనికి సమీపంలోని పంట పొలాల మధ్య సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌ పేరుతో కొన్నేళ్లుగా బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. స్థానికులు టపాసుల తయారీ పనులు చేస్తుండగా మధ్యాహ్నం 2 గంటల వేళ భారీ పేలుడు చోటుచేసుకుంది. ఆ శబ్దానికి సమీప గ్రామాల్లో ఇళ్లు కంపించాయి. పైకప్పు పెంకులు ఎగిరిపడ్డాయి. ఇళ్లలో సీలింగ్‌లు ఊడిపడ్డాయి. ఐదు కిలోమీటర్ల దూరంలోని సామర్లకోట, పెద్దాపురం ప్రజలకూ శబ్దాలు వినిపించాయంటే పేలుళ్ల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

మృతులు: గండి మంగ (36), వల్లూరి రవి (35), కడింపల్లి కృపామణి (50), బిక్కిన కరుణ సుబ్బారావు (45), సాధనాల సత్యవేణి (44), గొడత నాని (26), తుంపాల లోవ (38), చింతల రమణమ్మ (60), మందపల్లి చిన్ని (44), గొడత మహేష్‌ (41), నూకళ్ల దేవి (45), గొడత వీరవెంకటరమణ (48), కడింపల్లి ధనరాజు (55), సాకుమళ్ల రాఘవ (50), అడబాల శ్రీనివాసరావు (55)(వేట్లపాలెం).. దర్శిపాటి నాని (38), ఏడిద సంపత్‌ కుమార్‌ (25) (సామర్లకోట), మకర రాఘవమ్మ (55) (పెదబ్రహ్మదేవం), గంపల మంగమ్మ(45), గంపల నాగరాజు(57)

క్షతగాత్రులకు చికిత్స: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన 9 మంది క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఇక్కడ ట్రామాకేర్, అత్యవసర విభాగాల్లో వారికి వైద్యసేవలు అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో 8 మందికి 90 శాతానికి పైగా, ఒకరికి 70 శాతానికి పైగా కాలిన గాయాలైనట్లు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.లావణ్యకుమారి తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. అన్ని విభాగాల వైద్యులు, సిబ్బందితో పాటు ఔషధాలను, అవసరమైతే ప్రైవేట్‌ ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్సులు అందుబాటులో ఉంచామన్నారు. బాధితుల సమాచారం తెలియజేసేందుకు ఆసుపత్రిలో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మంత్రి కందుల దుర్గేష్‌ ఆసుపత్రికి వచ్చి బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్, డీసీసీబీ ఛైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, కాకినాడ గ్రామీణం ఎమ్మెల్యే పంతం నానాజీ, జేసీ అపూర్వభరత్‌ తదితరులు ఆసుపత్రిలో వైద్యసేవలను పర్యవేక్షించి బాధితులను పరామర్శించారు.

చికిత్స పొందుతున్నవారు: సప్పా సత్యవేణి (34), చిటికెల లక్ష్మి (45) (వేట్లపాలెం), మోర్త శ్రీను (30) (పెద్దాపురం), కాతేటి శ్రీను (33), దర్శిపాటి రాజు (రాజేష్‌) (30), వేమగిరి లోవరాజు (35), వేమగిరి దావీదు (38), పల్లపాటి వీరశ్రీను (40), దర్శిపాటి లోవరాజు (40) (సామర్లకోటలోని కుమ్మరవీధి).

మా అమ్మ ఎక్కడ?: వేట్లపాలెంలోని దుర్గానగర్‌కు చెందిన కార్మికురాలు నూకళ్ల దేవికి ఇద్దరు కుమార్తెలు. దేవి బాణసంచా దుకాణంలో పనికి వెళ్లారు. ప్రమాదం తర్వాత ఆమె ఆచూకీ లేదు. చాలా సేపటి వరకూ ఆమె చనిపోయినట్లు సమాచారమూ లేదు. దీంతో అక్కడికి చేరుకున్న దేవి ఇద్దరు కుమార్తెలు 'మా అమ్మెక్కడ' అంటూ వెక్కివెక్కి ఏడుస్తూ కన్పించారు. అక్కడికి వచ్చిన వారంతా అదే ఆవేదనలో ఉండటంతో ఈ ఆడపిల్లలను ఓదార్చేవారూ లేకుండాపోయారు. వారిద్దరే ఒకరినొకరు పట్టుకొని విలపించారు.

రాష్ట్రపతి, ప్రధాని సంతాపం: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా కర్మాగారంలో జరిగిన దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు చనిపోయారన్న విషయం అత్యంత దుఃఖాన్ని కల్గించిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ‘ఎక్స్‌’లో వేర్వేరుగా పేర్కొన్నారు.

  • పేలుడు ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌ కాకినాడ జిల్లాలోని కర్మాగారంలో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ప్రాణనష్టం సంభవించడం బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ఎక్స్‌గ్రేషియాను పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి ప్రకటిస్తున్నా’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
  • ఏపీలో జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు.

గవర్నర్‌ దిగ్భ్రాంతి: వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనపై గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో పలువురు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి : కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నానని బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని సామాజిక మాధ్యమం ఎక్స్​లో చంద్రబాబు ట్వీట్ చేశారు. సాయంత్రం చంద్రబాబు ఘటనాస్థలిని పరిశీలించారు.

ప్రభుత్వం అండగా ఉంటుంది: ‘వేట్లపాలెంలో బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ విస్ఫోటనంలో అనేక మంది మరణించారని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం. ఈ దుర్ఘటన గురించి కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నా. మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌లను ఘటనా స్థలానికి వెళ్లాలని సూచించాను’. -పవన్​ కల్యాణ్​, ఉప ముఖ్యమంత్రి

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం: ‘బాణసంచా కేంద్రంలో పేలుడు ఘటనలో పలువురు మృత్యువాతపడటం మాటలకందని విషాదం. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం’. -లోకేశ్​, మంత్రి

తగిన పరిహారం ప్రకటించాలి: ‘పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టాలి. ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలి. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించాలి. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలి’. - వైఎస్​ జగన్​

రూ.50 లక్షలివ్వాలి: ’బాణసంచా పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం అందించాలి’. -షర్మిల, ఏపీసీసీ అధ్యక్షురాలు

తెలంగాణ సీఎం విచారం: వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కర్మాగారంలో జరిగిన పేలుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆర్టీసీ బస్సులో నాటుబాంబులు - కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న భద్రతా లోపం

బాణసంచా పార్సిల్​ను కిందకు విసిరిన కూలీలు - ఆర్టీసీ కాంప్లెక్స్​లో భారీ పేలుడు

Last Updated : February 28, 2026 at 7:51 PM IST