ETV Bharat / state

రామోజీరావు కష్టపడి పని చేయడం నేర్పించారు - గ్రూప్‌ సంస్థల విజయానికి కారణాలివే: ఎండీ శైలజా కిరణ్‌

సమర్థులే నాయకత్వ పగ్గాలు చేపట్టాలి - అప్పుడే కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం నిలుస్తాయ్‌ - రామోజీ గ్రూప్‌ సంస్థల విజయానికి కారణాలివే - హార్వర్డ్​ బిజినెస్​ స్కూల్ సదస్సులో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్​

Margadarsi MD Sailaja Kiron Discussion at HBS in America
Margadarsi MD Sailaja Kiron Discussion at HBS in America (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 18, 2026 at 1:12 PM IST

|

Updated : February 18, 2026 at 5:27 PM IST

4 Min Read
Choose ETV Bharat

Margadarsi MD Sailaja Kiron Discussion at HBS in America : వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు. రామోజీ గ్రూపు సంస్థల విజయానికి అదే ప్రధాన కారణమని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యూహంతో నిర్మాణం, వారసత్వం, దృఢత్వం, భారతీయ కుటుంబ వ్యాపారాలు అనే అంశంపై అమెరికాలోని హార్వర్డ్​ బిజినెస్​ స్కూల్​లో ఫిబ్రవరి 15న నిర్వహించిన చర్చా కార్యక్రమంలో శైలజా కిరణ్​ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. తాను సారథ్య పగ్గాలు చేపట్టేనాటికి మార్గదర్శి చిట్​ఫండ్స్​కు కేవలం 12 శాఖలు ఉండేవని గుర్తు చేశారు. కంపెనీపై ప్రజలకు అపార విశ్వాసం ఉండటంతో తాను దాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించగలిగానని తెలిపారు. ఇప్పుడు మార్గదర్శి చిట్​ఫండ్స్​ శాఖోపశాఖలుగా విస్తరించి రూ. 12 వేల కోట్లకు పైగా వార్షిక టర్నోవరుతో దూసుకెళ్తోందని తెలిపారు.

రామోజీరావు కష్టపడి పని చేయడం నేర్పించారు - గ్రూప్‌ సంస్థల విజయానికి కారణాలివే: ఎండీ శైలజా కిరణ్‌ (ETV)

ఉత్తమ వ్యక్తులకే పగ్గాలు దక్కాలి : ప్రతి కుటుంబ వ్యాపారాల నాయకత్వ పగ్గాలు వారసత్వంగా కుటుంబంలోని పెద్దవారి చేతికే వచ్చే రోజులు పోతున్నాయని శైలజా కిరణ్​ చెప్పారు. చదువు, సరైన ఆలోచన దృక్పథం, మెరుగైన ప్రవర్తన ఇలా అన్ని సామర్థ్యాలు ఉన్న ఉత్తమ వ్యక్తులకు పగ్గాలు దక్కితేనే కంపెనీలు వృద్ధీ బాటలో పయనిస్తాయని పేర్కొన్నారు. నాయకత్వ హోదాల్లో ఉన్నవారు మేధో సామర్థ్యాలతోపాటు మానసిక పరిపక్వత కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు. చిత్తశుద్ధీతో పని చేసేలా ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపుతూ వారు ముందుకు సాగాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. నేటి యువత ఈ విషయాల్ని గుర్తించి వ్యాపార బాధ్యతలను చేపట్టేందుకు అవసరమైన అర్హతలను సాధించేందుకు శ్రమించాలని సూచించారు.

కలిసి ఉంటేనే బలమని విశ్వసించాం : రామోజీ గ్రూప్‌ సంస్థలు విజయవంతంగా నడుస్తుండటానికి తమ కుటుంబం విడిపోకుండా, కలిసి ఉండటం మరో కారణమని శైలజా కిరణ్‌ పేర్కొన్నారు. ‘‘కలిసి కొనసాగుతారా లేక విడిపోయి ఎవరి వ్యాపారాలు వారు చూసుకుంటారా అని రామోజీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు, మా మామగారు రామోజీరావు సుమారు 12-13 ఏళ్ల కిందట మమ్మల్ని అడిగారు. ఆ సమయంలో దాదాపు 14-15 ఏళ్ల వయసున్న మా అమ్మాయి (ముగ్గురు కుమార్తెల్లో ఒకరు) చెప్పిన మాట ఇప్పటికీ బాగా గుర్తుంది. చేతికి ఉన్న ఐదు వేళ్లు విడివిడిగా ఉంటే, వాటితో పెద్దగా ఏమీ చేయలేమని ఐదు వేళ్లను కలిపి ఉంచితే మాత్రం చాలా బలం వస్తుందని నాడు తను చెప్పింది. కలిసి ఉండటం ఎంత బలమో మా కుటుంబ సభ్యులందరికీ తెలుసు’’ అని ఆమె వివరించారు.

బయటి వ్యక్తులనూ తీసుకోవాలి! : కుటుంబ వ్యాపారాల్లో బయటి నిపుణులు, అనుభవజ్ఞులను ఉన్నత స్థానాల్లో నియమించుకోవడం మంచిదేనని శైలజా కిరణ్‌ అభిప్రాయపడ్డారు. "పని గంటల విషయంలో మనందరికీ పరిమితులు ఉంటాయి. రోజుకు 12-14 గంటలకు మించి పనిచేయలేం. ఆ సత్యాన్ని గుర్తించాలి. 'నువ్వు లేకపోతే కంపెనీ పరిస్థితి ఏంటి? అందుకోసం ఏమైనా ప్రణాళికలు రూపొందించావా?' అని ఒకరోజు మా మామగారు (రామోజీరావు) నన్ను అడిగారు. వ్యవస్థలు నిరంతరం సజావుగా నడవాలన్నది ఆయన ఆకాంక్ష. కొన్ని బాహ్యశక్తుల వల్ల కొంతకాలం మేం సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం.

అలాంటి సమయంలోనూ మేం చాలా దృఢంగా ఉన్నాం. మనం మాత్రమే పనిచేస్తే ఒక స్థాయిదాకా మాత్రమే వెళ్లగలం. అంతకుమించి ఎదగాలంటే బయటి నిపుణులూ అవసరం. 2-3 ఏళ్లుగా మా కంపెనీల్లో కీలక స్థానాల్లోకి మరింత మెరుగైన వ్యక్తులను తీసుకుంటున్నాం. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చేపట్టిన కొత్త నియామకాలతో ఇంకా స్థిరత్వం సాధించాం. ఇప్పుడు నేను లేకున్నా కంపెనీ కార్యకలాపాలు సజావుగా నడుస్తాయన్న విశ్వాసం నాకుంది" అని వివరించారు.

బయటి వ్యక్తులను కుటుంబ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లోకి తీసుకున్నప్పుడు వారిని కుటుంబ సభ్యుల్లానే చూసుకోవాలని శైలజా కిరణ్‌ సూచించారు. కంపెనీ విషయంలో కుటుంబం ఏం స్వప్నిస్తోందో, ఎలాంటి విలువలు పాటించాలో వారికి స్పష్టంగా తెలియజేయాలని పేర్కొన్నారు. కొత్తగా వచ్చినవారు, కంపెనీల్లో అప్పటికే ఉన్న అనుభవజ్ఞులు కలిసికట్టుగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత నాయకత్వ హోదాల్లోని వారిదేనని అన్నారు.

రామోజీరావు కష్టపడి పనిచేయడం నేర్పించారు : రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు తమ కుటుంబ సభ్యులందరికీ కష్టపడి పని చేయడం నేర్పించారని శైలజా కిరణ్‌ తెలిపారు. సవాళ్లను స్వీకరిస్తూ కొత్త వ్యాపారాలను నిర్మిస్తూ ముందుకు సాగేలా ఆయన ప్రోత్సహించారని చెప్పారు. ''మేం కుటుంబపరంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. పాటించాల్సిన విలువలు, సూత్రాలను రాతపూర్వకంగా సిద్ధం చేసుకున్నాం. వివాదాలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించుకునే మార్గాలనూ ఏర్పాటు చేసుకున్నాం.

మా కుటుంబంలో ఎవరూ డబ్బును ఇష్టారీతిన ఖర్చుపెట్టరు. ఎలాంటి వ్యాపారాలు చేయాలి. ఎలా చేయాలి, ఏం చేయకూడదు ఇవన్నీ మేం చర్చించుకుంటాం. నైతికంగా, చట్టబద్ధంగా సరైనవి మాత్రమే చేస్తాం. వ్యాపార సంస్థల నిర్మాణంలో వ్యవహరించే తీరుపై మా కుటుంబ సభ్యుల మధ్య స్పష్టమైన అవగాహన ఉంది'' అని వివరించారు. రామోజీ గ్రూప్‌లోని అన్ని వ్యాపారాలకూ తాము సమ ప్రాధాన్యమిస్తుంటామని వాటి వృద్ధికి నిరంతరం కృషి చేస్తుంటామని ఆమె చెప్పారు.

  • చర్చలో పాల్గొన్న పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ అపూర్వ పారేఖ్‌ మాట్లాడుతూ, భారత్‌లో కుటుంబ వ్యాపారాలు క్రమంగా పరివర్తనం చెందుతున్నాయని అన్నారు. ఒకప్పుడు సంస్థల వ్యవస్థాపకులు అన్నీ తామై వ్యవహరించేవారని, ప్రస్తుతం ఇతరులకూ బాధ్యతలు అప్పగించే ధోరణి పెరుగుతోందని పేర్కొన్నారు. వ్యాపార యజమానులైన కుటుంబ సభ్యులు, వారు నియమించుకునే నిపుణులు కలిసికట్టుగా పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించడం తేలికవుతుందని అభిప్రాయపడ్డారు.
  • సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ కంపెనీ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ రిషబ్‌ ష్రాఫ్‌ మాట్లాడుతూ, భారత్‌కు చెందిన కుటుంబ వ్యాపారాలు విదేశాల్లో విస్తరించడంపైనా ఇటీవలి కాలంలో బాగా దృష్టి పెడుతున్నాయని తెలిపారు. అవి తమ పెట్టుబడులను ఒకే రంగానికి పరిమితం చేయకుండా వివిధ రంగాలకు మళ్లిస్తున్నాయని పేర్కొన్నారు. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌కు చెందిన జోష్‌ బారన్‌ (ప్రొఫెసర్‌ ఆఫ్‌ స్ట్రాటజీ ఇన్‌ ఫ్యామిలీ బిజినెస్‌) సైతం ఈ చర్చలో పాల్గొన్నారు.

చదువు అంటే ఎలా సంపాదించాలో కాదు, ఎలా జీవించాలో నేర్పించేది : మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్

నేటి సమాజంలో మహిళలను చూసే దృక్కోణం మారాలి : మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్

Last Updated : February 18, 2026 at 5:27 PM IST