పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత - ప్రతి ఒక్కరూ కనీసం 100 మొక్కలు నాటాలి : మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్
సమాజంలో అనేక రుగ్మతల పరిష్కారానికి విద్య దోహదం చేస్తుందన్న శైలజాకిరణ్ - కాకినాడ జిల్లాలోని శ్రీ ప్రకాష్ పాఠశాల 18వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శైలజాకిరణ్ - విద్యార్థులకు దిశానిర్దేశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 11, 2026 at 10:21 AM IST
MD Sailaja Kiron Participated in Sri Prakash School 18th anniversary celebrations : చదువు అంటే కేవలం పుస్తకాలు, పరీక్షలే కాదని మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి, నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే శక్తి అని మార్గదర్శి చిట్ ఫండ్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు. సమాజంలో అనేక రుగ్మతల పరిష్కారానికి పునాది వేసి సంపూర్ణంగా జీవించేందుకు విద్య దోహదం చేస్తుందని తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ ప్రకాష్ పాఠశాల 18వ వార్షికోత్సవ వేడుకల్లో శైలజా కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ అంశాలపై విద్యార్ధులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా శైలజా కిరణ్ మాట్లాడుతూ "చదువు మనం ఎలా జీవించాలో నేర్పుతుంది. ఎలా సంపాదించాలో కాదు. పర్యావరణ పరిరక్షణ అనేది మనందరి బాధ్యత. 'సేవ్ వాటర్-సేవ్ లైఫ్' అనే మనందరం నినాదాలిస్తుంటాం. అది మాటలకే పరిమితం కాకూడదు. నీళ్లు లేకుండా ఒక్కరోజుని ఊహించుకోండి. ఆహారం లేకుంటే జీవితమే ఉండదు. అందుకే ప్రతి చుక్క నీరూ చాలా ముఖ్యం. మీరు(విద్యార్థులు) వచ్చేటప్పుడు ఇల్లు, వీధుల్లో నీళ్ల లీకేజీని చూస్తూనే ఉంటారు. ఎంతమంది దాని గురించి బాధపడ్డారు. ఇదీ రోజూ జరిగేదే అని మనం భావిస్తాం. కానీ మీలో ప్రతి ఒక్కరూ కుళాయిలు ఆపేస్తే ఏటా వేల లీటర్ల నీళ్లు ఆదా చేయవచ్చు. ఇలాంటి చిన్న చిన్న చర్యలు ఎక్కువ మంది చేస్తే అవే పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత." అని తెలిపారు.
ప్రతి ఒక్కరూ కనీసం 100 మొక్కలు నాటాలి: ప్లాస్టిక్ ప్రమాదకర శత్రువు. భూమిలో, సముద్రంలో వందల ఏళ్లు ఉంటూ పర్యావరణాన్ని నాశనం చేస్తుందని శైలజా కిరణ్ అన్నారు. చెట్లు, ప్రకృతి సహజ సిద్ధమైన బహుమతులు వాటిని కాపాడుకునే బాధ్యత మనదే అని వెల్లడించారు. ఇవాళ ఒక మొక్క నాటితే అది దశాబ్దాల పాటు ప్రయోజనాలు అందిస్తుందన్నారు. విద్యార్థులు ఒక్కొక్కరూ జీవితకాలంలో కనీసం వంద చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం 100 మొక్కలు నాటాలిని సూచించారు. ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ వంటి సాంకేతికతను విజ్ఞాన అంశాల అధ్యయనానికి ఉపయోగిస్తే మేలన్నారు.
"బడి అంటే తరగతి గదులతో కూడిన భవనం మాత్రం కాదు, విద్యార్థులు కలలు కనే ప్రాంగణం. చదువు అంటే ఎలా సంపాదించాలో కాదు, ఎలా జీవించాలో నేర్పించేది. నిత్య జీవనంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే శక్తి చదువు ఇస్తుంది. ‘సేవ్ వాటర్ సేవ్ లైవ్స్' అనేది నినాదం కాదు. మన సామాజిక బాధ్యత. నీళ్లు లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించాలి. మీ చుట్టుపక్కల కుళాయిలు, ఇళ్ల వద్ద నీటి వృథా జరుగుతుంటే నివారించండి. ఇలాంటి చిన్నచిన్న చర్యల వల్ల పెద్ద ప్రభావం ఉంటుంది." - శైలజా కిరణ్, మార్గదర్శి చిట్ ఫండ్ ఎండీ
విలువలకు కట్టుబడిన వ్యక్తి రామోజీరావు: రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపక ఛైర్మన్ రామోజీరావు విలువలు, సంస్కృతి, అనుబంధానికి ప్రాధాన్యం ఇచ్చేవారని శైలజాకిరణ్ చెప్పారు. విలువల గురించి పుస్తకాలు చెప్పవని, పెద్దలను గౌరవించి, వారి అనుభవ పాఠాల సారం గ్రహించి నేర్చుకోవచ్చన్నారు. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు, సైనికులు, రైతులు, పారిశుద్ధ్య కార్మికులను గౌరవించాలని శైలజా కిరణ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీప్రకాష్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ కె.కేశవరావు, శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ డైరెక్టర్ సీహెచ్ విజయప్రకాశ్, సీహెచ్ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.
చిట్‌ఫండ్స్ చట్టాలు సవరించాలి - అఖిల భారత సమ్మేళనంలో మార్గదర్శి ఎండీ ప్రతిపాదన
మహిళలు ఏ మాత్రం తక్కువ కాదు - ఎంతో గొప్పగా ఆలోచిస్తున్నారు: మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్

