నమ్మకానికి మారుపేరుగా మార్గదర్శి చిట్‌ఫండ్ - ఖమ్మంలో నూతన శాఖ ప్రారంభోత్సవంలో ఎండీ శైలజాకిరణ్
ఖమ్మం రోటరీనగర్‌లో మార్గదర్శి 133వ శాఖను ప్రారంభించిన సంస్థ ఎండీ శైలజాకిరణ్ - కార్యక్రమంలో పాల్గొన్న మార్గదర్శి ఉద్యోగులు, సిబ్బంది - మార్గదర్శితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఖాతాదారులు

Published : August 31, 2026 at 6:26 PM IST
|Updated : August 31, 2026 at 7:20 PM IST
Margadarsi 133rd Branch Inaugurated in khammam : లక్షలాది ఖాతాదారుల నమ్మకానికి మారుపేరుగా మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ నిలుస్తోందని సంస్ధ ఎండీ శైలజా కిరణ్ అన్నారు. ఎన్నో కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా నిలుస్తూ వారి అవసరాలను ఈ సంస్థ తీరుస్తోందని తెలిపారు. ఖమ్మంలోని రోటరీనగర్‌లో 133వ శాఖను శైలజా కిరణ్ లాంఛనంగా ప్రారంభించారు. మంగళ వాయిద్యాలు, పండితుల మంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన పూజలో ఉద్యోగులు, సిబ్బందితో కలసి పాల్గొన్నారు. అనంతరం ఉద్యోగులతో సమావేశమై బ్రాంచ్ నిర్వహణపై మార్గనిర్దేశనం చేశారు. మార్గదర్శి నూతన బ్రాంచ్‌ను ఖమ్మంలో ప్రారంభించడంతో పలువురు వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు.
చిట్‌ఫండ్స్‌తో ఆర్థిక క్రమశిక్షణ : ప్రతి ఒక్కరికీ జీవిత అవసరాలు ఉంటాయని, వాటిని తీర్చుకోవడానికి ఆర్థిక క్రమశిక్షణ అవసరమని శైలజాకిరణ్ అన్నారు. చిట్‌ఫండ్ మూలంగా ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుందన్నారు. చందాదారులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో మార్గదర్శి చిట్‌ఫండ్ పనిచేస్తోందని శైలజాకిరణ్ తెలిపారు.
"ప్రతి కుటుంబంలోనూ ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి. చిట్స్ మూలాన ఈ ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. చిన్నవయసు నుంచే ప్రతి ఒక్కరు కొంత డబ్బును పొదుపు చేయడం అలవర్చుకోవాలి. జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు, అవసరాలొస్తాయో తెలియదు. చిట్‌ఫండ్స్‌లో పొదుపు చేసిన నగదు స్థిరంగా ఉంటుంది. అందువల్ల ఇది చాలా సురక్షితమైన పెట్టుబడి. మార్గదర్శి లాంటి సంస్థలో మూడు, నాలుగు నెలల ముందస్తుగా ప్లాన్ చేసుకుంటే డబ్బులు అందుతాయి. చందాదారులకు వేగంగా డబ్బులు అందించాలనే లక్ష్యంతో సంస్థను నడిపిస్తున్నాం. కస్టమర్లు ఈ వెసులుబాటును వినియోగించుకోవాలని కోరుతున్నాం" - శైలజా కిరణ్, మార్గదర్శి చిట్‌ఫండ్ ఎండీ
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ ఎస్. వెంకటస్వామి, సీఈవో సత్యనారాయణ, సీవోవో మధుసూధన రావు, వైస్ ప్రెసిడెంట్లు రాజాజీ, బలరామకృష్ణ, రామకృష్ణ సహా ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఖమ్మంలో నూతన బ్రాంచ్ ఏర్పాటు చేయడంపై పలువురు చందాదారులు హర్షం వ్యక్తం చేశారు. తమకు అందుబాటులో ఉండే విధంగా శాఖను ఏర్పాటు చేయడం పట్ల మార్గదర్శికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
"133వ బ్రాంచ్ ఖమ్మంలో ప్రారంభించినందుకు ధన్యవాదాలు. నియమ నిబద్ధత, వ్యవస్థ, నిర్వహణ, చెక్ పేమెంట్ ఇవ్వడంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. నేను మొన్న ఆదివారం చిట్టిపాడితే మంగళవారం ష్యూరిటీ ఇచ్చాను. ఈరోజు చెక్ వచ్చేసింది. మార్గదర్శి నిబద్ధత, నియమానికి పెట్టింది పేరు" - విష్ణువర్థన రావు, మార్గదర్శి ఖాతాదారుడు
"నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మార్గదర్శి చిట్‌ఫండ్‌లో చేరాను. చక్కగా పేమెంట్ చేశారు. రాష్ట్రంలో ఈ కంపెనీకి మించింది లేదు. ఈ సంస్థను శైలజాకిరణ్ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. మార్గదర్శిపై గతంలో కొంతమంది చేసిన ఆరోపణలు అవాస్తవమని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో స్పష్టమైంది. చిట్స్‌లో చేరిన వారికి ఎవరికీ నష్టం జరగలేదు. అందరూ హ్యాపీగా ఉన్నారు" - నాగేశ్వరరావు, మార్గదర్శి ఖాతాదారుడు
"నేను ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ పొందాను. 1993 నుంచే మార్గదర్శిలో చిట్టీ కడుతున్నాను. నా ఇద్దరు పిల్లలను ఎంబీఏ చదివించాను. వారిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇటీవలే ఖమ్మంలో ఇళ్లు కొనుగోలు చేశాను. మార్గదర్శి బ్రాంచ్‌ను మా ఖమ్మంలోనే ఏర్పాటు చేయడం మాకెంతో ఆనందంగా ఉంది" - చందర్ రావు, మార్గదర్శి ఖాతాదారుడు
"1994 నుంచి మేము మార్గదర్శిలో చిట్టీ కట్టుకుంటూ వస్తున్నాం. మా పిల్లల చదువులకు, ఇళ్లు నిర్మించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడింది. మేము మాత్రమే కాకుండా మా పిల్లలు కూడా చందాదారులుగా చేరారు. మార్గదర్శిలో డబ్బులు దాచుకుంటే బ్యాంకులో దాచుకున్నట్లే" - అన్నపూర్ణ, మార్గదర్శి ఖాతాదారురాలు
కామారెడ్డిలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ 131వ బ్రాంచ్ - వినియోగదారుల హర్షం
మార్గదర్శి చిట్‌ఫండ్ 130వ శాఖ ప్రారంభం- వర్చువల్‌గా ప్రారంభించిన ఎండీ శైలజా కిరణ్

