ETV Bharat / state

అమ్మభాషకు అక్షరసేద్యం - రిటైర్డ్​ ఇంగ్లిష్​ టీచర్​ 'తెలుగు లిపి కాపాడుదాం'

మాతృభాష కోసం సూర్యకుమారి కృషి - ఏడాదిపాటు పరిశోధన - 'తెలుగు లిపి కాపాడుకుందాం' పేరుతో కార్యక్రమం

Marepalli Suryakumari To Telugu Language Development
Marepalli Suryakumari To Telugu Language Development (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 3, 2025 at 2:40 PM IST

2 Min Read
Choose ETV Bharat

Marepalli Suryakumari To Telugu Language Development : ఈతరం పిల్లలకు తెలుగు కొంత వింతగానే ఉంటుంది అనడంలో సందేహం లేదు. మరికొందరు పిల్లలు ఇంట్లో కూడా ఇంగ్లిష్​లోనే సంభాషిస్తున్నారంటే తెలుగు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు భాషకు పూర్వ వైభవం దక్కాలంటే చాలా కృషి అవసరం. ఇప్పటికే పలువురు భాషావేత్తలు తెలుగు వెలుగు కోసం తమ వంతుగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు.

ఈ కోవలోకి చెందిన వారే ఏడు పదుల వయసు దాటిన సూర్యకుమారి. ఒంగోలుకు చెందిన సూర్యకుమారి వృత్తి రిత్యా ఇంగ్లిష్ ఉపాద్యాయురాలిగా, ప్రధానోపాధ్యాయురాలిగా సేవలు అందించారు. కానీ ఇప్పుడు తెలుగు భాష కోసం కృషి చేస్తున్నారు. సూర్యకుమారి మాతృభాష ఉనికిని కాపాడటం కోసం ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

‘చతికిలబడ్డ తెలుగు’: ఆమె పదవీ విరమణ చేశానని విశ్రాంతికే పరిమితం కాలేదు. అమ్మ భాషకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించి ఆవేదన చెందారు. దానికి అడ్డుకట్ట వేయాలని తెలుగు లిపి కాపాడుకుందాం (తె.లి.కా) పేరుతో అక్షరసేద్యం చేస్తున్నారు. ఆవిడే మారేపల్లి సూర్యకుమారి. నేటి తరం పిల్లలు ఒక్క వాక్యం మాట్లాడితే దానిలో సగానికి పైగా ఆంగ్ల పదాలే ఉంటాయి. టీవీ కార్యక్రమాలు, స్కూళ్లలోనూ ఆంగ్ల జపమే చేస్తున్నారు.

ఇలాగైతే తెలుగు బతికేదెలా? అన్న ఆలోచన వచ్చింది సూర్యకుమారికి. దీనికితోడు చెన్నపురి తెలుగు ట్రస్టు వ్యవస్థాపకులు తూమాటి సంజీవరావు రాసిన ‘చతికిలబడ్డ తెలుగు’ పుస్తకం చదివాక ఆమె మరింత ఆవేదన చెందారు. అందుకే తెలుగును కాపాడటానికి తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నారు. ఏడాదిపాటు పరిశోధన చేసి 'తెలుగు లిపి కాపాడుకుందాం' అనే పేరుతో కార్యక్రమం ప్రారంభించారు. ఒంగోలుకు చెందిన సూర్యకుమారి ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా చేసి 2005లో ప్రధానోపాధ్యాయురాలిగా పదవీ విరమణ చేశారు.

సూర్యకుమారి కొన్ని స్కూళ్లను ఎంపిక చేసుకుని వారానికి మూడు రోజులు చొప్పున తెలుగు బోధన చేస్తున్నారు. ఇందుకోసం కొందరు వలంటీర్లను ఎంచుకున్నారు. వారికి సొంతంగా గౌరవ వేతనాన్నీ అందిస్తున్నారు. నాగులుప్పలపాడు, కొత్తపట్నం, ఒంగోలు, సంతనూతలపాడు తదితర మండలాలకు తన సేవలను విస్తరించారు. వారానికో పాఠశాలను ఎంచుకుని అక్షరమాల దగ్గర్నుంచి శతక పద్యాల వరకు అన్నీ నేర్పిస్తారు. చిన్నవాక్యాలు, సామెతలు, వాటి అర్థాలు తెలుసుకోవడం వంటివాటిపై అభ్యాసాలు ఇస్తారు. పోటీలను పెట్టి, గెలిచినవారికి బహుమతులూ ఇస్తున్నారు.

తన తోటి సహాధ్యాయులు, స్నేహితులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సహకారంతో ‘తె.లి.కా.’ని ముందుకు తీసుకెళుతున్నానంటున్నారు సూర్యకుమారి. దీనికయ్యే ఖర్చుకి తన పింఛన్‌ డబ్బునే ఉపయోగిస్తున్నట్లు ఆమె తెలుపుతున్నారు. తాజాగా కొందరు సాయానికి ముందుకొచ్చారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశ్రాంత ఉపాధ్యాయులనీ కొంత సమయం కేటాయించమని కోరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. భాషను బతికించుకోవడానికి తన వంతు ప్రయత్నమిదని చెబుతున్నారు తెలుగు భాషాభిమాని సూర్యకుమారి. ప్రభుత్వం కూడా తెలుగును తప్పనిసరి చేయాలని ఆవిడ కోరుతున్నారు. అప్పుడే తెలుగు భాష ఉజ్వలంగా వెలుగుతుందని అంటున్నారు సూర్యకుమారి.

భాషపై లేనిపోని రాజకీయాలు చేయడం సరికాదు : సీఎం చంద్రబాబు

ఎక్కడున్నా తెలుగులో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి: వెంకయ్య నాయుడు