ETV Bharat / state

అజ్ఞాతంలో ఉంటూ ఆచూకే లేకుండా పోయారు - ఆ 35 మంది ఏమైనట్లు?

52 మంది ఉన్న కేడర్​లో 35 ఆచూకీ ఎక్కడ? - అజ్ఞాతంలోనికి వెళ్లి కనిపించకుండా పోయిన మావోయిస్టు​లు - కేవలం 17 మంది మాత్రమే ఇప్పటికీ మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా

Maoists Form Secrete Exile Gone Missing
Maoists Form Secrete Exile Gone Missing (EENADU)
author img

By ETV Bharat Telangana Team

Published : January 6, 2026 at 8:40 AM IST

5 Min Read
Choose ETV Bharat

Maoists Form Secrete Exile Gone Missing : ఉద్యమంలో చేరి వివిధ కారణాలతో అజ్ఞాతంలోకి వెళ్లిన మావోయిస్టు కేడర్‌ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ఒక్క తెలంగాణ నుంచే 35 మంది జాడ తెలియకుండా పోయింది. పక్కా సమాచారంతో నిఘా వర్గాలు ఈ లెక్కను తేల్చాయి. ఉద్యమంలో వివిధ హోదాల్లో పని చేసిన వీరంతా ఇప్పటికీ ఎక్కడున్నారనే దానిపై స్పష్టత లేకుండాపోయింది.

ప్రస్తుతం 52 మంది మాత్రమే అజ్ఞాతంలో : ఏదైనా బలమైన కారణంతో అజ్ఞాతంలోకి వెళ్లడం వేరు. కానీ అజ్ఞాతంలో ఉంటూ ఆచూకే లేకుండా పోవడం మాత్రం అరుదైన అంశమే. మావోయిస్టుల లొంగుబాట్ల నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ నుంచి 52 మంది మాత్రమే ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు తెలంగాణ నిఘావర్గాలు తేల్చాయి. వీరిలో 17 మంది మాత్రం ఇప్పటికీ మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నట్లు గుర్తించినా, మిగిలిన 35 మంది ఆచూకీపై స్పష్టత లేనట్లు వెల్లడైంది. తాజాగా లొంగిపోయిన మావోయిస్టులను ప్రశ్నించిన అనంతరం నిఘావర్గాలు ఈ నిర్ధారణకు వచ్చాయి. ఆపరేషన్ కగార్ అంతిమ దశకు చేరుకుంటున్న నేపథ్యంలో అలాంటి వారి వివరాలతో కూడిన నివేదికను తాజాగా నిఘావర్గాలు రూపొందించాయి.

అజ్ఞాతంలోకి వెళ్లి కనిపించకుండాపోయిన మావోయిస్టులు (ETV)

కేడర్‌కు సంబంధించి 35 మంది ఆచూకీ ఏది? : అజ్ఞాతంలో ఉంటూ ఏదైనా ఎదురుకాల్పుల ఘటనలో చనిపోయినా, అనారోగ్యం పాలై మరణించినా, కుటుంబ సభ్యులకు మావోయిస్టు పార్టీ సమాచారం చేరవేస్తుంది. అడవుల్లోనే అంత్యక్రియలు నిర్వహించి, వీడియోలు తీసి పంపిస్తుంది. కానీ పార్టీలో చేరి ప్రస్తుతం ఆచూకీ లేకుండా పోయిన ఈ 35 మంది కేడర్‌కు సంబంధించి అలాంటి సమాచారమేదీ ఇప్పటికీ కుటుంబసభ్యులకు చేరలేదు. అంటే పార్టీలో ఉండగా మరణించిన దాఖలాలు లేవనే చెబుతున్నారు. అజ్ఞాతంలో ఉంటూనే వారంతా ఉద్యమానికి దూరమైపోయినట్లుగానే, కుటుంబసభ్యులతోనూ సంప్రదింపులు లేకుండా ఉన్నట్లు భావిస్తున్నారు. నిఘా తీవ్రంగా లేని సమయంలో విదేశాలకు వెళ్లిపోయే అవకాశాలు లేకపోలేదనే అంచనాతో ఉన్నారు. మరోవైపు గుర్తింపు మార్చుకొని ఎక్కడో జీవనం వెళ్లదీస్తూ ఉంటారని అనుమానిస్తున్నారు.

ఎక్కడో సాధారణ జీవితం : ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని మావోయిస్టు సుప్రీం గణపతి స్వగ్రామం బీర్పూర్‌కు చెందిన బల్మూరి నారాయణరావు ఇలాగే చిక్కారు. 1980లో పీపుల్స్ వార్‌లో చేరిన ఆయన, 2024 డిసెంబర్‌లో ఛత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లా అంతఘర్ ప్రాంతంలో అరెస్టయ్యారు. ఆయనకు మావోయిస్టు అగ్రనేతలతో సంబంధాలున్నాయని అక్కడి పోలీసులు ప్రకటించినా, సుదీర్ఘకాలంగా ఉద్యమానికి దూరమై సాధారణ జీవనం గడుపుతున్నట్లు తెలంగాణ నిఘావర్గాల విచారణలో తేలింది. ఇలా 35 మంది కేడర్ ఎక్కడో జీవనం గడుపుతూ ఉంటారని పలు అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆ కేడర్​ ఉన్నది వీరే : జిల్లాల వారీగా ఆచూకీ లేని కేడర్ వివరాలకు వస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చిట్యాల నుంచి డీసీ మెంబర్‌ కొల్లు శ్రీనివాస రెడ్డి, ఏడూళ్ల బయ్యారం మండలం జానంపేట్ నుంచి పార్టీ సభ్యుడు రాయల రాము, రంగారెడ్డి జిల్లా అమనగల్లు మండలం కోనాపూర్‌కు చెందిన డీసీ మెంబర్‌ చాకలి నిరంజన్ అలియాస్ వినయ్ ఉన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన డీసీ మెంబర్ చింతకింది అంజమ్మ అలియాస్ అరుణ ఉన్నారు. అలాగే జగిత్యాల మోరేపల్లి నుంచి డీసీ మెంబర్ గుండారపు ఆనందం, కోరుట్ల ఇంద్రారోడ్‌ నుంచి డీసీ మెంబర్ బెజ్జారపు కిషన్ అలియాస్ ప్రతాప్, రాయికల్ మండలం కట్కాపూర్‌కు చెందిన ఏసీ మెంబర్ ముదాం లక్ష్మణ్ ఉన్నారు.

ఇక జనగామ జిల్లాలోని పల్లగుట్టకు చెందిన డీసీ మెంబర్ కన్నెబోయిన మల్లయ్య అలియాస్ గంగన్న, రఘునాథపల్లి మండలం బాంజీపేట్ నుంచి ఏసీ మెంబర్ కందగడ్డ రాజేశ్వర్ అలియాస్ భాస్కర్, లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల నుంచి ఏసీ మెంబర్ పొనుంగటి శారద ఉన్నారు. భూపాలపల్లి జిల్లా నుంచి చిట్యాల మండలం రామచంద్రాపూర్ ఏసీ మెంబర్ గాజె రాజు అలియాస్ రవి, కామారెడ్డి జిల్లా నుంచి అడ్లూర్‌కు చెందిన పీఎం లింబయ్యగారి వెంకట్ రెడ్డి, కరీంనగర్ జిల్లా చెల్పూర్‌కు చెందిన పీఎం దేవరకొండ సత్యనారాయణరెడ్డి అలియాస్ సత్తన్న ఉన్నారు.

మహబూబాబాద్ జిల్లా నుంచి కోరుకొండపల్లికి చెందిన ఎస్సీఎం వెంకట్ రెడ్డి, కురవి మండలం తట్టుపల్లికి చెందిన డీసీఎస్ షేక్ అమీనుద్దీన్ అలియాస్ ఉదయ్ కిరణ్ ఉన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని న్యూప్రేమ్‌నగర్‌కు చెందిన ఏసీఎస్ నిర్మల అలియాస్ లలిత, మంచిర్యాల జిల్లా నుంచి బెల్లంపల్లి శాంతినికేతన్ బస్తీకి చెందిన ఏసీఎస్ ఆరెపల్లి కృష్ణ అలియాస్ కిష్టు, మందమర్రికి చెందిన పీఎం బబ్బెర రవిబాబు అలియాస్ రవి ఉన్నారు. అలాగే ములుగు జిల్లా నుంచి రామచంద్రాపూర్‌కు చెందిన ఏసీఎస్ కనుకుంట్ల రాజు, ఏటూరు నాగారం మండలం గోగుపల్లికి చెందిన పీఎం ఈసం అర్జున్ అలియాస్ రఘుపతి ఉన్నారు.

నల్గొండ జిల్లా నుంచి చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన డీసీఎస్ మందుగుల భాస్కర్‌రావు, గుర్రంపోడ్ మండలం ఊట్లపల్లికి చెందిన పీఎం పన్నాల యాదయ్య అలియాస్ గన్ మన్ ఉన్నారు. నిర్మల్ జిల్లా నుంచి ఖానాపూర్ మండలం బావాపూర్-కె కు చెందిన పీఎం తూము శ్రీనివాస్ అలియాస్ శ్రీను, నిజామాబాద్ జిల్లా నుంచి డిచ్‌పల్లి మండలం ఇందల్​వాయికి చెందిన పీఎం నాగపూరి లక్ష్మాగౌడ్ అలియాస్ లచ్చాపూర్ ఉన్నారు. పెద్దపల్లి నుంచి సబితం గ్రామానికి చెందిన ఏసీసీఎం గంకిడి సత్యనారాయణరెడ్డి అలియాస్ విజయ్‌, పాలితం గ్రామానికి చెందిన డీసీఎస్ ఆలేటి రామలచ్చులు అలియాస్ రాయలచ్చులు పాలితం గోపయ్యపల్లికి చెందిన ఏసీఎస్ దత్తు అయిలయ్య, జూలపల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన ఏసీఎస్ దీకొండ శంకరయ్య ఆలియాస్ శేషన్న, సుల్తానాబాద్ మండలం కొదురుపాకకు చెందిన ఏసీఎం జువ్వాడి వెంకటేశ్వరరావు అలియాస్ ధర్మన్న ఉన్నారు.

సిద్దిపేట జిల్లా నుంచి మిరుదొడ్డి మండలం ధర్మారానికి చెందిన ఏసీఎం రంగబోయిన భాగ్య అలియాస్ రూపి, నంగనూర్‌కు చెందిన ఏసీఎం రంగు అరుణ అలియాస్ పద్మ, అక్కన్నపేటకు చెందిన ఏసీఎం కాశబోయిన స్వరూప ఉన్నారు. వరంగల్ జిల్లా నుంచి రాయపర్తి మండలం మైలారానికి చెందిన డీసీఎస్ ఉలైంగుల యాకయ్య అలియాస్ అంజన్న, మిల్స్ కాలనీకి చెందిన డీసీఎం పోలెపాక సునీల్, హనుమకొండ నుంచి కమలాపూర్ మండలం శంభునిపల్లికి చెందిన పీఎం కనగర్తి రజనీకర్ రెడ్డి ఇప్పటికీ ఆచూకీ లేకుండా పోయారు.

ఇక ఉన్నది ఈ 17 మందే : గణపతి, దేవ్ జీ, సంగ్రాం, పసునూరి నరహరి, బడే చొక్కారావు, ముప్పిడి సాంబయ్య, వార్తా శేఖర్, జోడె రత్నాబాయి, నక్క సుశీల, లోకేటి చందర్రావు, జాడి పుష్ప, రంగబోయిన భాగ్య, బడిశ ఉంగా, మాడ్వి అడుమే కాశపోగు భవాని, కుంజం ఇడ్మల్, ఉతిమి అనిల్ కుమార్ ఈ 17 మంది మాత్రమే క్రియాశీలంగా ఉన్నారు.

ఇంకా వందరోజులూ కూడా లేదు - టార్గెట్ పూర్తి చేసేందుకు భద్రతా బలగాల స్కెచ్

ఎన్​కౌంటర్​లో ఆరుగురు మావోయిస్టులు మృతి- రూ.కోటి రివార్డు ఉన్న టాప్ లీడర్ గణేశ్ హతం