ETV Bharat / state

పోలీస్‌ అకాడమీలో గాడితప్పిన శిక్షణ! - ఏకంగా 35 శాతం ట్రైనీ డీఎస్పీలు ఫెయిల్​

Many Trainee DSPs failed in Telangana : డీఎస్పీలుగా ఎంపికై శిక్షణలో ఉన్న 112 మందిలో 35 శాతం వరకు అకాడమీ పరీక్షల్లో ఫెయిల్​ అయినట్లు తెలుస్తోంది.

Telangana state Police Academy
తెలంగాణ పోలీస్‌ అకాడమీ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 12, 2026 at 10:20 AM IST

2 Min Read
Choose ETV Bharat

Many Trainee DSPs failed in Telangana : తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో శిక్షణ గాడి తప్పుతోందా? శిక్షణార్థులను రాటుదేల్చడంలో అకాడమీ విఫలమవుతోందా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. పోలీస్​ అకాడమీలో ప్రస్తుతం డీఎస్పీలకు ట్రైనింగ్ జరుగుతోంది. అయితే శిక్షణ పొందే వారిలో 35 శాతం మంది వరకు అకాడమీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదని విశ్వసనీయంగా తెలిసింది. ట్రైనింగ్ సరిగా లేదనే విమర్శలకు ఇది మరింత బలం చేకూర్చినట్లయింది.

గత పది నెలల నుంచి ట్రైనింగ్​ తీసుకుంటున్న 112 మంది డీఎస్పీల్లో ఏకంగా 40 మందికి పైగా పరీక్షలు తప్పినట్లు సమాచారం. ఇలా కొందరు అనుత్తీర్ణులవడం సాధారణమే అయినా, ఈ సంఖ్య ఈసారి ఇంత భారీగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ట్రైనింగ్ సమయంలో అకాడమీలో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు కీలకంగా మారాయి.

సరైన ప్రణాళికలు లేకుండా

గ్రూప్‌-1 నియామకాల ద్వారా ఎంపికైన 112 మంది డీఎస్పీలకు, పోలీస్‌ అకాడమీలో గతేడాది నవంబరు 6న ట్రైనింగ్​ను ప్రారంభించారు. 2009, 2012 బ్యాచ్‌ల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రం నుంచి ఒక్కో విడతలో 65 మందిలోపే డీఎస్పీలు ట్రైనింగ్ తీసుకున్నారు. ఈలెక్కన చూస్తే ప్రత్యేక తెలంగాణలో మొట్టమొదటిదే కాకుండా ఇది అతిపెద్ద బ్యాచ్‌. ట్రైనింగ్​ను ప్రతిష్ఠాత్మకంగా పరిగణించాల్సిన పోలీస్​ అకాడమీ ఉన్నతాధికారులు సరైన ప్రణాళికతో వ్యవహరించలేదని ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్‌శాఖలో రకరకాల ఆరోపణలు ఎదుర్కొన్న వారిని అకాడమీలో కీలక బాధ్యతల్లో నియమించడం సరిగా శిక్షణ ఇవ్వకపోవడం, అనుభవజ్ఞులైన గెస్ట్‌ ఫ్యాకల్టీని రప్పించి క్లాసులు చెప్పించడంలో విఫలం కావడం లాంటి కారణాలన్నీ కలిపి పోలీస్ అకాడమీ ప్రతిష్ఠ దెబ్బతిందనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

1,600 మార్కులతో పది సబ్జెక్టుల్లో కనీసం సగం మార్కులతో పాస్​ కావాల్సి ఉండగా ఏకంగా 35 శాతం మంది ఉత్తీర్ణత సాధించలేకపోయినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇలా పాస్ కాకపోవడం తిరిగి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం వంటి సందర్భాలున్నా ఈసారి శిక్షణలో లోపాల్ని సీనియర్‌ ఐపీఎస్‌లు ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. తాజా వ్యవహారం సీఎంవో దృష్టికి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం.

కీలక సమయంలో జాయింట్‌ డైరెక్టర్‌ పోస్టు ఖాళీ

అతిపెద్ద బ్యాచ్‌కు ట్రైనింగ్ ఇవ్వాల్సిన సమయంలో కీలకమైన అకాడమీ జాయింట్‌ డైరెక్టర్‌ పోస్టు ఖాళీగా ఉంది. అకాడమీలో కీలక స్థానాల్లో ఉన్న అధికారుల్లో ఒక ఐపీఎస్‌ను నామమాత్రపు పాత్రకే పరిమితం చేసినట్లు చర్చించుకుంటున్నారు. నేడు డీఎస్పీల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ జరగనుంది. ఈ పరీక్షల్లో కొందరు ఫెయిల్‌ అయిన మాట వాస్తవమేనని వారికి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర పోలీస్​ అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్త్‌ స్పష్టం చేశారు.

సస్పెండైన​ డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ మనీలాండరింగ్ కేసు - ఆస్తుల కొనుగోలు, నిధుల మూలాలపై ఆరా

ఈ నవమి నాటికి నా విషయం ఎటూ తేలకపోతే సజీవ సమాధి అవుతా : మాజీ డీఎస్పీ నళిని