తుపాను తీరం తాకి మళ్లీ సముద్రంలోకి వెళ్తుందా? - అక్కడ గాలి-వాన ఎందుకు ఉండవు!
తుపాను కేంద్రంలో ప్రశాంతంగా వాతావరణం - చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు, భీకరగాలులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 28, 2025 at 4:48 PM IST
Different Types of Storms And Details: సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన నాటి నుంచి అది తుపాను, తీవ్ర తుపానుగా మారి తీరం దాటే వరకు ఎన్నో దశలు ఉంటాయి. ఇందులో కొన్ని అల్పపీడనం దశలో, మరికొన్ని వాయుగుండాలకే పరిమితమవుతాయి. మరికొన్ని బలపడి తుపాను, తీవ్ర తుపాన్లుగా తీరం దాటి నేలపైకి వస్తాయి. అయితే తుపాను గమనంలో మాత్రం కేంద్ర స్థానమే కీలకమైనది. తుపాను తీవ్రతకు అనుగుణంగా దీని విస్తృతి పెరుగుతుంది.
కన్ను దాటితే తీవ్ర ప్రభావం: శక్తిమంతమైన తుపాను కేంద్రంలో ఉండే ప్రాంతాన్ని కన్ను (ఐ) అంటారు. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గాలి కూడా నెమ్మదిగా వీస్తుంది. అసలు ఉండకపోవచ్చు. వర్షం సైతం ఉండదు. కన్ను చుట్టూ ఉండే వలయం వంటి కంటి గోడలు (ఐ వాల్స్)గా పిలుస్తారు. ఈ ప్రాంతంలో అధిక వేగంతో గాలులు వీస్తాయి. భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, మేఘాలు అన్నీ కన్ను చుట్టూ ప్రభావం చూపిస్తాయి.
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా సుడిగుండాలతో అల్పపీడనం ఏర్పడుతుంది. తర్వాత వాయుగుండం, తీవ్ర వాయుగుండంగా మారుతుంది. తుపానుగా బలపడిన అనంతరం కేంద్రస్థానం (కన్ను) స్పష్టంగా కనిపిస్తుంది. తీవ్ర తుపాను అయితే మరింత పెద్దగా కనిపిస్తుంది. కేంద్ర స్థానం విస్తృతి దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్ల మధ్య వరకూ ఉండవచ్చు. ఆ తర్వాత కంటి గోడల విస్తృతి అంటే తుపాను కేంద్ర స్థానం నుంచి దాదాపు 225 కిలోమీటరు వరకు ఉండే అవకాశం ఉంది.
తుపాను తీరం తాకి మళ్లీ సముద్రంలోకి వెళ్లడం అరుదైన విషయమే. సాధారణంగా తుపాన్లు తీరాన్ని తాకితే బలహీనపడతాయి. కానీ 2022 మే నెలలో ఏర్పడిన అసని తుపాను కృష్ణా జిల్లా కృత్తివెన్ను వద్ద తీరాన్ని దాటి, వాయుగుండంగా బలహీనపడి తీరం వెంట ప్రయాణిస్తూ మళ్లీ కాకినాడ వద్ద సముద్రంలోకి వెళ్లడం గమనార్హం. ప్రధానంగా తుపాను ఫలానా చోట తీరం దాటిందని వాతావరణశాఖ ప్రకటిస్తుంది. కానీ అక్కడ ఎలాంటి గాలి, వాన ఉండదు. సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. తీరం దాటిందా? లేదా? అని అక్కడున్నవారే ఆశ్చర్యపోతారు.
అలసత్వం వహిస్తే భారీ నష్టమే: ఎందుకంటే అది తుపాను కేంద్ర స్థానం (కన్ను). అక్కడ ఎలాంటి అలజడి ఉండదు. కేంద్ర స్థానం తర్వాత నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో అలజడి అధికంగా ఉంటుంది. అందుకే తుపాను తీరానికి చేరువయ్యే కొద్దీ భారీ వర్షాలు, గాలులు అధికంగా వీస్తాయి. తీరం తాకినప్పుడు ప్రభావం ఉండదు. తర్వాత కొద్దిసేపటికి మళ్లీ విలయం మొదలవుతుంది.
కానీ తీరం దాటినప్పుడు ఏ ప్రభావం లేదని అలసత్వం వహిస్తే మాత్రం ఆ తర్వాత భారీ నష్టాన్ని చూడాల్సి వస్తుందని వాతావరణశాఖ హెచ్చరిస్తుంది. 1979 మే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో తీరం తాకిన తుపాను కంటి విస్తృతి 425 కిలోమీటర్లు, అంటే కేంద్ర స్థానం నుంచి 425 కిలోమీటర్ల విస్తృతిలో ప్రభావం చూపింది. భారత తీరంలో ఇదో రికార్డుగా అభివర్ణించవచ్చు. 2014 లో వచ్చిన హుద్‌హుద్ విస్తృతి 44-66 కిలోమీటర్లుగా ఉంది.
ఉప్పాడ తీరంపై 'మొంథా' పంజా - ఎగిరిపడుతున్న భారీ రాళ్లు
ఒడిశాలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం - ఆ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

