సెల్‌ఫోన్ తెచ్చిన తంటా - ఆంధ్రా, మణిపుర్ విద్యార్థినుల మధ్య ఘర్షణ
నర్సింగ్ కళాశాలలో ఆంధ్రా, మణిపుర్ విద్యార్థినుల మధ్య వివాదం - సెల్‌ఫోన్ మిస్సింగ్ అంశంలో విద్యార్థినుల మధ్య మొదలైన ఘర్షణ - మణిపుర్ విద్యార్థినులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 23, 2026 at 8:24 AM IST
Nursing Girls Clash over Mobile Phone : కాకినాడ S.K కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో సెల్‌ఫోన్ అంశంలో విద్యార్థినుల మధ్య తలెత్తిన వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. ఏపీ, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థినుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ మొదలైంది. ఇది ఏకంగా మణిపుర్ సీఎంవో వరకు వెళ్లడం చర్చనీయాంశమైంది. అక్కడ్నుంచి వచ్చిన సమాచారంతో అధికారులు కళాశాలకు చేరుకుని ఇరువర్గాల విద్యార్థినులకు సర్ది చెప్పారు. మణిపుర్ విద్యార్థినులను మరో సురక్షిత హాస్టల్‌కు తరలించారు.
సెల్‌ఫోన్ మిస్సింగ్ - విద్యార్థినుల మధ్య ఘర్షణ: కాకినాడ నగర పరిధిలోని S.K. కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో విద్యార్థినుల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఓ మొబైల్ ఫోన్ మిస్సింగ్ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచింది. మణిపుర్‌కు చెందిన విద్యార్థిని తన ఫోన్ పోయిందంటూ ఇటీవల సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత అది దొరికినా ఆ వివాదం ముదిరింది.
దీంతో ఆంధ్రా, మణిపుర్ విద్యార్థినులు తొలుత కళాశాలలో తర్వాత రోడ్డుపైకి వచ్చి గొడవపడి తోపులాటకు దిగారు. ఆంధ్ర విద్యార్థిని తలకు గాయమవడంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు రెండు కుట్లు వేశారు. అనంతరం ఎలాంటి కేసూ వద్దంటూ ఆమె డిశ్చార్జయి వెళ్లిపోయింది. ఘటనపై మణిపుర్ విద్యార్థులు మెయిల్ ద్వారా ఆ రాష్ట్ర సీఎంవోకు ఫిర్యాదు చేశారు. అక్కడ్నుంచి వచ్చిన సమాచారంతో అధికారులు కళాశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మణిపుర్ విద్యార్థులను సమీపంలోని సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేసిన మరో హాస్టల్‌కు తరలించారు. అక్కడ వారికి వసతి, ఆహారం తదితర సౌకర్యాలను కల్పించారు.
"మేము పూర్తిగా సురక్షితంగా ఉన్నాం. క్లిష్ట సమయంలో అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. ఈశాన్య ప్రాంత విద్యార్థినులకు ప్రత్యేక వసతి కల్పించారు. రేపటికల్లా సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నాం" - నర్సింగ్ విద్యార్థినులు
భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు: మొబైల్ ఫోన్‌కు సంబంధించి చిన్నపాటి అపార్థం వల్లే వివాదం తలెత్తిందని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎస్పీ బిందుమాధవ్ స్పష్టం చేశారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల విద్యార్థినులతో మాట్లాడి సమస్యను శాంతియుతంగా పరిష్కరించారని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఎస్పీ చెప్పారు. నార్త్‌ఈస్ట్ విద్యార్థులతో పాటు స్థానిక విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. విద్యార్థినులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దీర్ఘకాలిక పరిష్కారం కోసం చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
Hon’ble Chief Minister Shri N. Chandrababu Naidu reviewed the incident involving students at SK College of Nursing, Kakinada, and immediately directed senior officials to resolve the issue.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 22, 2026
Acting on his instructions, the District Collector and SP ensured the safety and security…
"విద్యార్థుల మధ్య ఘర్షణ పూర్తిగా పరిష్కారమైంది. పరిస్థితి అదుపులో ఉంది. ఫోన్ చోరీ విషయంలో మణిపూర్, నాగాలాండ్ విద్యార్థులు-స్థానిక విద్యార్థుల మధ్య వివాదం జరిగింది. ఇప్పటికే ఫోన్ రికవరీ చేసి బాధిత విద్యార్థికి అందజేశారు. సమాచారం అందగానే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యార్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.ఇతర రాష్ట్రాల విద్యార్థుల రక్షణకు పూర్తి బాధ్యత ఉంటుంది. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు." - హరేంధిర ప్రసాద్, కాకినాడ జిల్లా కలెక్టర్
నర్సింగ్ విద్యార్థుల ఘటనపై సీఎం ఆరా: కాకినాడ S.K. కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో విద్యార్థులకు సంబంధించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్, ఎస్పీ రంగంలోకి దిగి విద్యార్థుల భద్రతకు చర్యలు చేపట్టారు. అవసరమైన వసతి కల్పించడంతో పాటు పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకుండా చర్యలు తీసుకున్నారు.
మరోవైపు విద్యార్థినుల వసతి గృహాన్ని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారుల చొరవతో సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారమైంది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అధికారులు స్పందించిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటనపై మహిళా కమిషన్ ఆరా తీసింది. పరిస్థితిపై మణిపుర్ మహిళా కమిషన్‌కు ఏపీ మహిళా కమిషన్ భరోసా ఇచ్చింది. మణిపుర్ విద్యార్థినుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
భార్య కనిపించడం లేదని పోలీస్‌స్టేషన్‌కు భర్త - విచారణలో బయటపడ్డ భయంకరమైన నిజం
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు అప్డేట్స్ - పోలీసుల అదుపులో నిందితుడు సాధిక్‌ఖాన్

