ETV Bharat / state

మడ అడవులతో తీరానికి రక్షణ - 250 హెక్టార్లలో విస్తరణకు ప్రణాళికలు

తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచంగా నిలిచే మడ అడవుల విస్తీర్ణం పెంచేందుకు అటవీశాఖ చర్యలు - కేంద్ర, రాష్ట్ర నిధులతో ప్రత్యేక కార్యాచరణ

Mangrove Plantation Near Suryalanka Poguru
Mangrove Plantation Near Suryalanka Poguru (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 6, 2026 at 7:32 PM IST

2 Min Read
Choose ETV Bharat

Mangrove Plantation Near Suryalanka Poguru: తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచంగా నిలిచే మడ అడవుల విస్తీర్ణం పెంచేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. జీవవైవిధ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషించే ఈ అడవులను పెంచి పోషించేందుకు కేంద్ర, రాష్ట్ర నిధులతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. బాపట్ల జిల్లా సూర్యలంక పొగురు సమీపంలోని 100 హెక్టార్లలో మడ మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. సూర్యలంకతో పాటు పెదగంజాం తీరంలోనూ మొక్కల పెంపకం కొనసాగుతోంది. మడ అడవుల విస్తీర్ణం పెరిగే కొద్దీ తీర ప్రాంత పర్యావరణ సమతుల్యత మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు.

ఆరు వేల ఎకరాలకే పరిమితం: రేపల్లె, నిజాంపట్నం, కర్లపాలెం, బాపట్ల, చినగంజాం మండలాల్లో సముద్ర తీరం వెంబడి మడ అడవులు విస్తరించి ఉన్నాయి. గతంలో జిల్లాలో 8 వేల ఎకరాలకు పైగా ఉండేవి. అక్రమ నరికివేత, రొయ్యల చెరువుల విస్తరణతో ఆ విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. 1977 దివిసీమ ఉప్పెన, 1990, 1996, 2008, 2010 తుపానులు, 2004 సునామీ వంటి ప్రకృతి విపత్తుల సమయంలో మడ అడవులు తీర ప్రజలకు పెను నష్టం జరగకుండా అడ్డుకట్ట వేశాయి. ఈ నేపథ్యంలో వాటి విస్తరణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

150 హెక్టార్లలో కొత్తగా మొక్కలు: కేంద్ర నిధుల సహాయంతో నిజాంపట్నం పరిధిలో 75 హెక్టార్లలో మడ అడవుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తాజాగా సూర్యలంక వద్ద నల్లమడ వాగు సముద్రంలో కలిసే ప్రాంతంలో 150 హెక్టార్లలో మొక్కల పెంపకం ప్రారంభించారు. నర్సరీల్లో పెంచిన మొక్కలను నాటారు.

ప్రపంచ మడ అడవుల దినోత్సవం సందర్భంగా అదనంగా మరో 100 హెక్టార్లలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. వీటితో పాటు ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ’ పథకం కింద సూర్యలంక, పేరలి, నిజాంపట్నం తీర ప్రాంతాల్లో తాటి, ఈత చెట్లను పెంచుతున్నారు. ఈ ప్రాంతాలను మడ అడవుల కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

విదేశీ పక్షుల విడిది: సూర్యలంక నుంచి నిజాంపట్నం, దిండి, లంకెవానిదిబ్బ వరకు ఉన్న మడ అడవులు పర్యావరణ సున్నిత ప్రాంతంగా ఉన్నాయి. ఇవి విదేశీ పక్షులతో పాటు అరుదైన జీవరాశులకు నిలయాలుగా మారాయి. కుందేళ్లు, అడవి పిల్లులు, స్వదేశీ, విదేశీ పక్షులు ఇక్కడ కనిపిస్తున్నాయి. తీర పర్యాటక అభివృద్ధికి ఇవి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిజాంపట్నం, కర్లపాలెం, చినగంజాం మండలాల్లోని ఆక్రమణలను తొలగించి, ఆ ప్రాంతాల్లో మొక్కలు నాటి తీరాన్ని పచ్చదనంతో నింపాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.

వివరాలు: