ఎవరి అవసరం లేకుండానే ఉపయోగించేలా 'స్మార్ట్ మల్టిపర్ఫస్ ఛైర్'
సోలార్‌తో పని చేయనున్న ఛైర్ - అవసరమైనపుడు స్ట్రెచర్‌లా మార్పు - ఆక్సిజన్ అందించడానికి సిలిండర్ సదుపాయం - మలమూత్ర విసర్జన ఏర్పాట్లు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 27, 2026 at 4:49 PM IST
Students Innovated Smart Multipurpose Chair For Disabled : దివ్యాంగులు, వృద్ధులు వీల్‌ఛైర్‌ను వాడుతుండడం తెలిసిన విషయమే. సాధారణంగా వీల్‌చైర్ ఉపయోగించేందుకు మరొకరి సహాయం తీసుకోవాల్సి వస్తుంది. కానీ అది అన్నిసార్లు కుదరదు కదా! దీంతో వారు ఎప్పుడు ఎవరో ఒకరి తోడు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. కొన్నిసార్లు తీవ్రమైన ఇబ్బందిగా కూడా ఉంటుంది. మరో వ్యక్తి సాయం లేకుండా దివ్యాంగులు ఇక నుంచి వారి జీవితాన్ని సులభంగా జీవించేయవచ్చు. ఎలాగో అనుకుంటున్నారా? ఆ ప్రశ్నకు చెక్ పెట్టేలా ఓ స్కూల్ విద్యార్థులు 'స్మార్ట్ మల్టీపర్పస్ ఛైర్'ను రూపొందించారు. ఆ ఛైర్ విశేషాలేంటో తెలుసుకుందాం.
మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని చింతక్రింది కనకయ్య ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఈ ఛైర్‌ను తయారు చేశారు. ఈ విద్యార్థులు తొమ్మిదో తరగతి చదువుతున్న ఎం. మాన్యశ్రీ, ఎ. కౌశిక్, ఉపాధ్యాయుడు బి.టైటస్ పర్యవేక్షణలో స్మార్ట్ మల్టీపర్పస్ ఛైర్‌ను తయారుచేశారు.
ఎలా పని చేస్తుందంటే : ఈ ఛైర్ సోలార్‌తో నడుస్తుంది. అవసరమైనపుడు స్ట్రెచర్‌లా మారిపోతుంది. ఇందులో కూర్చున్న వ్యక్తిలో చలనం లేకున్నట్లయితే, వెనుక దిండులో ఉండే బజర్ మోగుతుంది. అనారోగ్య సమస్యలున్నప్పుడు ఆక్సిజన్ అందించడానికి సిలిండర్ సదుపాయం కూడా ఉంటుంది. మలమూత్ర విసర్జనకు కూడా సీటు కిందే తయారు చేశారు. తినడానికి ఒక చిన్నబల్ల, దాని పక్కనే గ్లాస్ పెట్టగానే ఆటోమేటిక్‌గా తాగునీరు నింపే సదుపాయం ఉంది. చేతులు కడుక్కోవడానికి చిన్న ట్రే, ఫ్యాన్, సెల్‌ఫోన్ ఛార్జింగ్, లైట్ వంటి పలు రకాల సదుపాయాలను ఇందులో అమర్చారు.
దాడికి రక్షణ కూడా : దివ్యాంగుల నిస్సహాయతను అదునుగా చేసుకొని ఎవరైనా దాడి చేయడానికి వస్తే ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేలా చేతికర్ర కూడా రూపొందించారు. విద్యార్థుల ఈ ఆవిష్కరణ దివ్యాంగులకు ఉపయోగకరంగానే కాకుండా, వారి సృజనాత్మకతకు నిదర్శనంగా నిలుస్తోంది.
స్మార్ట్ మల్టీపర్పస్ ఛైర్లో ఉన్న సదుపాయాలు :
- సోలార్ ప్యానెల్
- అవసరమైనపుడు రక్షించుకోవడానికి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే చేతికర్ర
- ఫ్యాన్
- లైట్
- అనారోగ్య సమయంలో అవసరమయ్యే ఆక్సిజన్ మాస్క్
- అత్యవసర సమయంలో నొక్కడానికి దిండులో బజర్
- స్ట్రెచర్‌లా మారే ఏర్పాటు
- సెల్‌ఫోన్ ఛార్జింగ్ పాయింట్
- అత్యవసర సైరన్ స్విచ్
- గ్లాస్ పెట్టగానే ఆటోమేటిక్‌గా తాగునీరు నింపే సౌకర్యం
- తినడానికి ఉపయోగపడే ఒక చిన్న బల్ల
- మలమూత్ర విసర్జనకు అనుకూలమైన సీటు
- చేతులు కడుక్కోడానికి ట్రే
- స్ట్రెచర్‌లా మారేటప్పుడు కాళ్లకు అనువుగా ఉండేలా అదనపు సౌకర్యాలు
- స్మార్ట్ ఛైర్‌ను ముందుకు, వెనక్కు కదిలించడానికి స్విచ్ కంట్రోల్
ఉమెన్ ప్రొటెక్షన్ డివైస్‌ను రూపొందించిన విద్యార్థులు : విశాఖ జిల్లా కొమ్మాదిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలోని విద్యార్థినులు చదువుల్లో చురుకుగా ఉండటమే కాకుండా పలు నూతన అవిష్కరణలతో అదరగొడుతున్నారు. వసతి గృహల్లోని మహిళల రక్షణ కోసం వారు ఓ పరికరాన్ని రూపొందించారు. ఆ పరికరం అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, ఎమర్జెన్సీ సమయాల్లో, అపరిచిత వ్యక్తులు వసతి గృహంలోకి చొరబడినప్పుడు అలర్ట్ మెసేజ్‌లు పంపించేలా పరికరాన్ని రూపొందించారు. దానికి మహిళా భద్రత పరికరం (ఉమెన్ ప్రోటెక్షన్ డివైస్) అని పేరు పెట్టారు. సమస్యను బట్టి కావాల్సిన వారిని అలర్ట్ చేసేందుకు ఆ పరికరానికి గ్రీన్, బ్లూ, రెడ్ పానిక్ రంగుల్లో బటన్లను అమర్చారు.
సైన్స్ బోధిస్తున్న ఉపాధ్యాయుడు టి. రాంబాబు అధ్వర్యంలో పదో తరగతి చదువుతున్న వై. జెస్సిక, కె. ప్రవల్లికలు ఉమెన్ ప్రొటెక్షన్ డివైజ్‌ను రూపొందించారు. దీనిని పీసీబీ బోర్డు, మోడ్ ఎంసీయూ, మెక్రో ట్రాన్స్ఫార్మర్, పానిక్ సెన్సార్లతో, బటన్లతో టచ్ ఏర్పాటు చేశారు. దీన్ని బ్లింక్ యాప్ ద్వారా సెల్ఫోన్లకు అనుసంధానం చేశారు. ఇంటర్నెట్ అవసరం లేకుండా కేవలం జీఎస్ఎం ద్వారా సిమ్ టు సిమ్ సమాచారం అందేలా మహిళ భద్రత పరికరాన్ని తయారు చేశారు.
12 రాష్ట్రాల నుంచి 1900 మంది - ఆవిష్కరణలతో ఔరా అనిపిస్తున్న విద్యార్థులు
సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థుల ఆవిష్కరణలు - 'న్యూరల్ టోర్నడో' పేరుతో ప్రదర్శన

