ప్రియుడిని చంపేస్తే యువతి తననే పెళ్లి చేసుకుంటుందని ఆశ - కానీ బెడిసికొట్టిన మాస్టర్‌ప్లాన్
యువతితో సహజీవనం చేస్తున్న యువకుడిని హత్య చేసిన మరో యువకుడు - నిందితుడి చేతిలో దారుణ హత్యకు గురైన మహేశ్ - నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

Published : January 5, 2026 at 4:39 PM IST
Kaveliguda Murder Case : భర్తకు విడాకులిచ్చిన వివాహిత వేరొక వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఆమెపై మనసు పడ్డ మరో వ్యక్తి తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. తన మాట వినకపోతే సదరు మహిళ సన్నిహితంగా ఉండే వ్యక్తిని చంపేస్తానని బెదిరించాడు. అయినా ఆమె ఒప్పుకోకపోవడంతో అన్నంత పని చేశాడు. ఆమె సహజీవనం చేస్తున్న వ్యక్తిని దారుణంగా చంపేసి చివరకు జైలుపాలయ్యాడు. ఒక్క విహహేతర సంబంధం మూడు జీవితాల్లో ఎలా చీకట్లు నింపిందో తెలిపేందుకు ఈ ఘటనే ఉదహరణ.
పక్కా పథకం ప్రకారం జరిగిన హత్య : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని కవెలిగూడ గ్రామం విన్‌సిటీ వెంచర్‌లో గత నెల 24న ఓ హత్య జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో విచారణ సాగించారు. చనిపోయిన వ్యక్తి జంపుల మహేశ్‌గా గుర్తించారు. మహేశ్ గొంతు, తలపై తీవ్రమైన గాయాలు ఉండటంతో ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఘటనాస్థలంలో ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు మహేశ్‌కు పరిచయమున్న వారిని ముందుగా విచారించారు. ఈ క్రమంలోనే ఓ యువతి ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడు ఎవరు అనే విషయాన్ని పోలీసులు గుర్తించారు.
అడ్డు తొలగించుకోవాలని : ఆమె తెలిపిన వివరాల ప్రకారం, మహేశ్ ఓ యువతికి సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసింది. అయితే ఆమెకు రత్నం అనే మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కాగా అతడు ఆ యువతిని వివాహం చేసుకోవాలని బలవంతం చేశాడని విచారణలో తెలిసింది. కాగా అమె అందుకు నిరాకరించింది. అయితే యువతికి సన్నిహితంగా ఉంటున్న మహేశ్ అడ్డు తొలగించుకోవాలని భావించిన రత్నం అదును కోసం ఎదురు చూశాడు. ఓరోజు ఒంటరిగా వెళ్తున్న మహేశ్‌పై పథకం ప్రకారం దాడి చేశాడు.
హత్య చేసే సమయంలో గుర్తుపట్టకుండా ఉండేందుకు మారువేషంలో రత్నం వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. మహేశ్ కళ్లలో కారం పొడి చల్లి, ఆపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాలను తారుమారు చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
పరిచయం లేకున్నా : ఘటనా స్థలంలో సీన్ రీ-కన్స్ట్రక్షన్ నిర్వహించిన పోలీసులు, ఫోరెన్సిక్ టీంతో ఆధారాలను సేకరించారు. ఓ యువతిపై ఉన్న మోజు నిండు ప్రాణాన్ని బలిగొంది. అంతకుముందు ఎలాంటి పరిచయం లేకున్నా రత్నం చేతిలో అమాయక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
"ఘటనా స్థలంలో గాయాలతో ఓ వ్యక్తి పడిపోయి ఉన్నారు. ఆ మృతుడు జంపుల మహేశ్ అని గుర్తించాం. ఆపై అతడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చర్యలు చేపట్టాం. సేకరించిన వివరాల ఆధారంగా మహేశ్ ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఆ అమ్మాయికి బాపురం రత్నం అనే ఇంకో అబ్బాయితో స్నేహ సంబంధం ఏర్పడింది. అతడు ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలని బలవంతం చేయడంతో ఆమె దీనికి అంగీకరించలేదు. దీనికి కారణం మహేశ్ అని గ్రహించిన రత్నం అతడిని అడ్డుతొలగించుకోవాలని పథకం వేశాడు. దీనిలో భాగంగా ఓ గొడ్డలి కొనుగోలు చేశాడు. కారం పొడిని సిద్ధం చేశాడు. అతడు నిర్మానుష్య ప్రదేశానికి చేరుకోగానే అతడిపై దాడి చేసి ఎటువంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడ్డాడు." - శ్రీకాంత్ గౌడ్, శంషాబాద్ ఏసీపీ
మహిళతో మూడేళ్లుగా సహజీవనం - తల్లీకుమారుడిని చంపిన క్యాబ్ డ్రైవర్
పెళ్లైన వ్యక్తిని ప్రేమించిన బాలిక - అవమానంగా భావించి చంపేసిన తల్లిదండ్రులు

