గోల్డ్ బిస్కెట్లకు నగలు - కిలో బంగారు ఆభరణాలతో ఉడాయించిన 'ప్రముఖ వ్యక్తి పీఏ'
గోల్డ్ షాప్ యజమానిని బురిడీ కొట్టించిన మోసగాడు - నకిలీ గోల్డ్ బిస్కెట్లు ఇచ్చి కిలో బంగారు నగలతో పరారీ - హైదరాబాద్‌లోని హెటెక్సిటీలో ఘటన - బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు

Published : February 28, 2026 at 11:00 AM IST
Fake Gold Scam In Hyderabad : పెరుగుతున్న ధరలతో బంగారం సామాన్య ప్రజలకు అందని ద్రాక్షలా మారుతోంది. రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలతో తులం బంగారం కొనుగోలు చేయాలన్నా కష్టసాధ్యంగా మారింది. అయితే పెరుగుతున్న ఈ పసిడి ధరలు మోసగాళ్లకు వరంలా మారుతున్నాయి. ఒకవైపు గోల్డ్ ధరలు సామాన్య మానవుడిని బెంబేలెత్తిస్తుంటే, అవే ధరలు నేరగాళ్లలో మాత్రం ఆశలు రేపుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని హైటెక్‌సిటీ పరిధిలో ఓ బంగారు ఆభరణాల షాపు యజమానికి నకిలీ గోల్డ్ బిస్కెట్లు అంటగట్టి ఘరానా మోసానికి పాల్పడ్డాడో వ్యక్తి. అసలు ఏం జరిగిందంటే?
నకిలీ గోల్డ్ బిస్కెట్లను అంటగట్టి : ప్రస్తుతం మార్కెట్‌లో పసిడికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. రోజురోజుకూ పైపైకి పోతున్న బంగారం ధరలతో మోసగాళ్లు, దొంగల్లో అత్యాశ పెరుగుతోంది. బంగారం కాజేసి సొమ్ము చేసుకోవాలని మోసాలు, చోరీలకు తెగబడుతున్నారు. నకిలీ గోల్డ్ బిస్కెట్లతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పలుచోట్ల చోటు చేసుకుంటున్నాయి. ఓ ప్రముఖ వ్యక్తికి పీఏనని చెప్పి గోల్డ్ వ్యాపారికి నకిలీ బంగారు బిస్కెట్లను అంటగట్టి రూ.1.60 కోట్ల విలువైన అసలు నగలను కొట్టేశాడో ప్రబుద్ధుడు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది : హైటెక్ సిటీ మైహోంభుజా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న పాలకుర్తి లక్ష్మీ కావ్య బంజారాహిల్స్ రోడ్ నెం.2లో బంగారు ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నారు. కొంతకాలం క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కాచిగూడకు చెందిన శ్రీనాథ్ రాఠీ అలియాస్ అంకిత్ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. తాను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యక్తికి వ్యక్తిగత సహాయకుడిని (పీఏ) అని చెప్పి నమ్మించాడు. తమ వద్ద భారీగా బంగారు బిస్కెట్లు ఉన్నాయని, వాటికి సమానంగా బంగారు నగలు ఇవ్వాలని కోరాడు.
మొదట లక్ష్మీ కావ్య అతని మాటలను పట్టించుకోకపోయినా, పదే పదే సంప్రదించడంతో బంగారు బిస్కెట్లకు నగలను ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ నెల 16వ తేదీన 160 గ్రాముల బంగారు నగలను ఇవ్వగా, మరుసటి రోజు అతడు సమాన బరువులో బంగారు బిస్కెట్లను అందజేశాడు. అనంతరం 19న మరో 350 గ్రాముల నగలను ఇవ్వగా, శ్రీనాథ్ తన తండ్రి పురుషోత్తం ద్వారా బిస్కెట్లను పంపించాడు. అవి అసలేనని భావించిన బాధితురాలికి నమ్మకం పెరిగింది.
నకిలీ బంగారు బిస్కెట్లతో మోసగించి : ఈ నెల 25న కిలో బంగారు నగలను తీసుకున్న శ్రీనాథ్, తాను బయటకు వెళ్తున్నానని చెప్పి తన సహాయకుడు కృష్ణ ద్వారా బంగారు బిస్కెట్లు పంపిస్తున్నానని తెలిపాడు. అదే రోజు బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్ వద్ద కృష్ణ బంగారు బిస్కెట్లు అందజేశాడు. వాటి సంఖ్య ఎక్కువగా ఉండటంతో అనుమానం వచ్చిన లక్ష్మీకావ్య, వాటిని పరీక్షించగా నకిలీవని తేలింది. శ్రీనాథ్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని రావడంతో మోసపోయినట్లు గ్రహించింది. దీంతో కృష్ణను ప్రశ్నించగా, నాలుగు రోజుల క్రితమే తనను పనిలో పెట్టుకున్నాడని, సోమాజిగూడలోని ఓ హోటల్‌లో వసతి కల్పించాడని తెలిపాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీనాథ్ రాఠీ, అతని తండ్రి పురుషోత్తం, సహాయకుడు కృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గతంలోనూ మోసాలే : శ్రీనాథ్ రాఠీ గతంలో కామర్స్ లెక్చరర్‌గా పనిచేస్తూ యూట్యూబ్ ఛానల్ నిర్వహించేవాడని పోలీసులు తెలిపారు. అతని క్లాసులకు పలువురు చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా హాజరవుతుండేవారని చెప్పారు. వ్యాపార పెట్టుబడుల పేరుతో పలువురు సీఏల నుంచి సుమారు రూ.3.48 కోట్లు వసూలు చేసి పరారయ్యాడని పోలీసులు వివరించారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదైంది. అలాగే రూ.10 కోట్ల రుణం ఇప్పిస్తానని చెప్పి మరో వ్యక్తి నుంచి రూ.1 కోటి తీసుకుని మోసం చేసిన కేసు కూడా అతనిపై నమోదైందని పోలీసులు తెలిపారు.
తక్కువ ధరకే బంగారం - నమ్మారో నట్టేట మునగడం ఖాయం - బీ కేర్ ఫుల్! - FAKE GOLD SCAM in hyderabad
'నా వద్ద 8 కిలోల బంగారం ఉంది - కేవలం రూ.2 కోట్లకే ఇచ్చేస్తా'

