ETV Bharat / state

దిల్‌సుఖ్‌నగర్‌లో సీపీ అర్ధరాత్రి ఆపరేషన్‌ - పోలీసుల అదుపులో 40 మంది ఆకతాయిలు

సగటు మహిళగా మెట్రో వద్ద నిల్చున్న మల్కాజ్​గిరి సీపీ సుమతి - సాధారణ మహిళకు ఎదురయ్యే వేధింపులు ఎదుర్కొన్న సీపీ - బస్టాండ్‌లో నిల్చొన్నది సీపీ అని తెలియక వేధింపులు

CP Sumathi Undercover Operation
CP Sumathi Undercover Operation (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : May 6, 2026 at 10:12 PM IST

2 Min Read
Choose ETV Bharat

Malkajgiri CP Sumathi Undercover Operation in Dilsukhnagar : సినిమాల్లో పోలీసులు సామాన్యులలాగా మారి నేరగాళ్ల ఆట కట్టించడం చూస్తుంటాం. అదే తరహాలో హైదరాబాద్‌లోనూ ఓ మహిళా పోలీసు ఉన్నతాధికారి సగటు మహిళగా అవతారమెత్తి ఆపరేషన్ నిర్వహించారు. రాత్రివేళ ఆకతాయిల అడ్డాగా మారిన ప్రాంతానికి వెళ్లి అర్ధరాత్రి ఒక్కరే నడిరోడ్డుపై నిల్చొని కొంతమంది పోకిరీల పనిపట్టారు.

అసభ్యకరమైన ప్రశ్నలతో వేధింపులు : దిల్​సుఖ్​నగర్​ బస్టాండ్‌ పరిసరాల్లో ఓ మహిళ నిల్చుంది. ఆమెను చూసిన పోకిరీలు ఒక్కసారిగా చుట్టు ముట్టారు. రకరకాల అసభ్యకరమైన ప్రశ్నలతో మాట్లాడటం మొదలుపెట్టారు. బైక్‌లపై వెళ్తున్న కొందరైతే బండి ఆపి మరీ నోటికి పని చెప్పారు. అసభ్య పదజాలంతో సూటిపోటి మాటలతో ప్రవర్తించారు.

సగటు మహిళలా సీపీ : అయితే అక్కడ ఉన్నది సామాన్యురాలు కాదు. స్వయనా మల్కాజ్‌గిరి పోలీసు కమిషనర్‌ సుమతి. ఇటీవలే పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమె మహిళలపై వేధింపులను తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఇందుకు దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్‌, మెట్రో ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ఓ సగటు మహిళలా బస్టాండ్‌లో నిల్చున్నారు. ఆమె సీపీ అని తెలియక పోకిరీలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. దాదాపుగా మూడు గంటలు అంటే రాత్రి 3 గంటల వరకు వేధింపులను ఇలాగే ఎదుర్కొంటూ సీపీ సుమతి అండర్​కవర్ ఆపరేషన్ చేపట్టారు.

రాత్రి వేళల్లో మహిళల భద్రత కోసం : ఆ తర్వాత సీన్‌ కట్‌ చేస్తే స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. వేధింపులకు పాల్పడిన 40 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో దాదాపు పూర్తిగా విద్యార్థులే ఉన్నట్లు తెలుస్తోంది. వేధింపులకు పాల్పడిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. దిల్‌సుఖ్‌నగర్‌ సమీప ప్రాంతాల్లోని హాస్టళ్లలో పలు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్​ అయ్యే విద్యార్థులతో పాటు ఉద్యోగాలు చేసే మహిళలు ఎక్కువగా ఉంటారు. వీరిని లక్ష్యంగా చేసుకుని ఆకతాయిలు, పోకిరీలు రెచ్చిపోతున్నారనే సమాచారంతో ఈ ఆపరేషన్‌ చేపట్టారు. రాత్రి వేళ్లలో మహిళా భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను అంచనా వేసేందుకు సీపీ ఇలా రంగంలోకి దిగి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు.

దిల్​సుఖ్​నగర్​ ప్రాంతంలో ప్రతి రోజు అర్థరాత్రి సమయాల్లో యువకులు విచ్చలవిడిగా తిరుగుతూ అల్లరి చేస్తుంటారు. ఈ క్రమంలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుని సీపీ ఈ ప్రయత్నం చేశారు.

సీపీ అలా చేయడానికి ప్రధాన ఉద్దేశం

పోలీసుల పనితీరు అంచనా : పోలీసులు రాత్రి పూట సరిగ్గా గస్తీ నిర్వహిస్తున్నారా లేదా అని తెలుసుకోవచ్చు. డయల్ 100కి కాల్ చేస్తే ఎంత త్వరగా స్పందిస్తున్నారు అనే అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.

నేరస్థులలో భయం కలిగించడం : పోలీసు అధికారులు ఎప్పుడైనా, ఏ రూపంలోనైనా నిఘా ఉంచుతారనే హెచ్చరికను పోకిరీలకు చేరవేయడం ద్వారా మహిళలపై జరిగే వేధింపులను అరికట్టేందుకు అవకాశం ఉంది.

అర్థరాత్రి మహిళా సీపీ సుమతిని వేధించిన పోకిరీలు

రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తాం : నూతన డీజీపీ సీవీ ఆనంద్‌