ఫైన్ పడుతుందని తెలుసు - ప్రాణం పోతుందనీ తెలుసు - అయినా 'తలకెక్కించు'కోరు!
హెల్మెట్ లేకుండానే రోడ్డెక్కుతున్న ద్విచక్ర వాహనదారులు - పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు - గతేడాది 80 లక్షల మందికి ట్రాఫిక్ చలానాల విధింపు

Published : January 6, 2026 at 12:23 PM IST
Two-Wheeler Road Accidents Reasons : రోడ్డు ప్రమాదాల్లో చిన్న చిన్న తప్పిదాలే ప్రాణ నష్టాలకు కారణమవుతున్నాయి. ప్రతి పనికి బైక్ బయటికి తీస్తారు కానీ, హెల్మెట్ మాత్రం ధరించరు. ప్రయాణ సమయాల్లో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఓ నిండు ప్రాణం బలైపోతుంది. హెల్మెట్ ధరించకుండానే రోడ్లపైకి వచ్చేస్తున్నారు. రోడ్డు ఖాళీగా ఉంటే చాలు రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తుంటారు. ఇటీవల హైదరాబాద్ మూసారాంబాగ్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల్ని పోలీసులు ఆపి జరిమానా విధిస్తున్నారు.
అన్నీ తెలుసు అయినా పెట్టుకోరు! : ఈ క్రమంలో హెల్మెట్ ధరించని వాహనదారున్ని ఆపి ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదని ప్రశ్నిస్తే మా ఇళ్లు పక్కనే ఉందని ఒకరు సమాధానం ఇచ్చారు. ఇలానే మరో వాహనదారుడిని ప్రశ్నించగా, మర్చిపోయి వచ్చానంటూ బదులిచ్చాడు. ఇలా శిరస్త్రాణం పెట్టుకోకుండా వాహనంతో రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారని తెలుసు. అది ధరించకపోతే పొరపాటున ప్రమాదం జరిగితే తలకు గాయమై ప్రాణాలు పోతాయనీ తెలుసు. అన్నీ తెలిసినా అదే నిర్లక్ష్యం, అదే తప్పులు. దాని ఫలితమే పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.
హెల్మెట్ ధరించకపోవడం వల్లే : నగరంలో ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంలో అత్యధికం హెల్మెట్ ధరించకపోవడం వల్లే నమోదవుతున్నాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 2025లో ఏకంగా 80 లక్షల మంది వాహనదారులకు హెల్మెట్ ధరించకపోవడంతో ఫైన్స్ విధించారు. శిరస్త్రాణం ధరించకపోవడం వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అవగాహన కల్పిస్తున్నా, చాలా మంది వినిపించుకోవడం లేదు. ఏడాది కిందట 3 కమిషనరేట్ల పరిధిలో ప్రమాదాలు 9601 జరగ్గా, అందులో 2275 మంది మృతి చెందారు.
తూతూమంత్రంగా తనిఖీలు :
- హెల్మెట్ ధరించనందుకు 2024లో 3 కమిషనరేట్ల పరిధిలో 60.38 లక్షల మంది వాహనదారులకు ఫైన్స్ వేశారు. 2025 నాటికి ఈ సంఖ్య దాదాపు 80 లక్షలకు పెరిగింది. ఇలా ఈ స్థాయిలో పెరగడానికి అనేక కారణాలున్నాయి.
- వాహనదారులు హెల్మెట్ లేకుండా ఇతర నిబంధనలు ఉల్లంఘిస్తే పదే పదే పట్టబడినప్పుడు లైసెన్సు పాయింట్లలో కోత విధించేందుకు చట్టంలో అవకాశముంది. సరిగా రెండేళ్లలో 12 పాయింట్లు కోతపడితే వారి లైసెన్సు రద్దు చేయవచ్చు.
- ట్రాఫిక్ సిబ్బంది దాని జోలికిపోకుండా, చలానా విధించి వదిలేస్తున్నారు. ట్రాఫిక్ కెమెరాల ద్వారా చలానా విధిస్తున్నా, ఎక్కువ మంది చెల్లించడం లేదు.
ద్విచక్ర వాహనదారులే అధికం : గతేడాది సైబరాబాద్‌లో 4,608 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 803 తీవ్రమైనవి. ఇందులో 53 శాతం ద్విచక్రవాహన ప్రమాదాలే ఎక్కువ. వీటిలో ఏకంగా 449 మంది మరణించారు. అధిక శాతం మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే మృత్యువాత పడుతున్నారు. మరి కొందరు కేవలం ట్రాఫిక్ జరిమానాలకు భయపడి నాణ్యత లేని, కాలం చెల్లిన హెల్మెట్లు ధరిస్తున్నారు. దీంతో ప్రమాదం జరిగినప్పుడు అవి కనీస రక్షణ సైతం కల్పించలేకపోతున్నాయి.
హెల్మెట్‌ను కొనేటప్పుడు ఇవి తప్పక పరీక్షించండి :
- నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకూడదు. ప్రభుత్వ ప్రమాణాలకు తగినవి మాత్రమే ఎంచుకోవాలి.
- కూల్ ఫైబర్ ఉన్న హెల్మెట్లు, గాలి లోపలకు వెళ్లే వాటిని మాత్రమే తీసుకుంటే ఎలాంటి చెమట పట్టదు. ఉక్కపోతగా అనిపించదు.
- తలకు సరిపోయే సైజ్ హెల్మెట్‌ను ఎంపిక చేసుకోవాలి.
- చుండ్రు, చర్మ వ్యాధులు ఏవైనా ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
వాహనదారులూ ఇది గమనించండి :
- హెల్మెట్ ధర ఎక్కువ ఉందని అసలు ఆలోచించొద్దు. ఐఎస్ఐ గుర్తుతో మరింత రక్షణ కల్పిస్తుందా? అనేది పరిశీలించాలి.
- నాసిరకం, ధర తక్కువ వాటితో ప్రమాదం నుంచి రక్షణ ఉండదు. మామూలు దానికి, నాణ్యమైన వాటికి తేడా రూ.500లోపే ఉంటుంది.
- హెల్మెట్‌ను పోలీసుల కోసం కాకుండా మీ కోసం ధరించండి.
- సాధారణంగా కొంతమంది హెల్మెట్‌ను బైక్ అద్దానికో, వెనుక కొక్కేనికో తగిలిస్తుంటారు. అయితే ఇది సరికాదు. హెల్మెట్‌ని కేవలం తలకు మాత్రమే ధరించండి.
- హెల్మెట్‌ను కేవలం తలకు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. క్లిప్ పెట్టుకుంటేనే ప్రమాద సమయాల్లో గాయాలు కాకుండా ఉంటాయి.
- తనిఖీల నుంచి తప్పించుకోవడానికో, గాలి వీస్తుందనో టోపీ తరహా తేలిక వాటిని వినియోగిస్తే ఎలాంటి ఉపయోగం లేదు.
'నాకే చాలా బాధగా ఉంది - నన్ను ధరించండి - మీ ప్రాణాన్ని కాపాడుకోండి'
బైకుల వల్లే 60 శాతం ప్రమాదాలు - హెల్మెట్ లేకపోతే ప్రాణాలకు నో గ్యారంటీ!

