ETV Bharat / state

కోపం వచ్చినా, ఇగో దెబ్బతిన్నా హత్యే! - భాగ్యనగరంలో 5 నెలల్లోనే 60కు పైగా కేసులు

హైదరాబాద్​లో ఏటా 250-300 మంది హతం - కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన సమయంలో ఠాణా, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్న యువత - 2024 నివేదిక ప్రకారం హైదరాబాద్​ 358 హత్య కేసులు నమోదు

Murder Cases are Increasingly in Hyderabad
Murder Cases are Increasingly in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 4, 2026 at 2:57 PM IST

3 Min Read
Choose ETV Bharat

Murder Cases are Increasingly in Hyderabad : హైదరాబాద్​ నగరంలో ఏడాదికి 250-300 వరకు హత్య కేసులు నమోదవుతుంటాయి. వీటిలో ఎక్కువశాతం వ్యక్తిగత కక్షలు, భూ వివాదాలే కారణాలుగా పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. ఆస్తుల కోసం 1-2 శాతం హత్యలు జరుగుతున్నాయి. నిందితుల్లో ఎక్కువ శాతం 18-45 ఏళ్ల వయసులోపు వారే ఉంటున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన సమయంలో పోలీస్​ స్టేషన్​, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఏడాది 5 నెలల వ్యవధిలో నాలుగు పోలీసు కమిషనరేట్ల పరిధిలో 60కు పైగా హత్యలు, 150 హత్నాయత్నం కేసులు నమోదవటం పరిస్థితికి అద్దంపడుతోంది.

హత్య చేసి తప్పించుకోగలమనే ధీమా : రూ. కోట్లు విలువైన ఆస్తులు, సినీ, రాజకీయ ప్రముఖులతో సంబంధాలు అలాగే ఏది కోరుకున్నా క్షణాల్లో సమకూర్చిపెట్టడానికి సిద్ధంగా ఉండే అనుచరుల సైన్యం ఉన్నప్పటికీ నవాబ్​ సాబ్​ అనే మారుపేరుతో ఉన్న ముజాహిద్​ ఆలంఖాన్​ దశాబ్దాలుగా న్యాయవాది మొయిజుద్దీన్​తో పగను తట్టుకోలేకపోయారు. హత్య చేసి తప్పించుకోగలననే ధీమాతో ఉన్నారు. ఈ కేసులో సాక్ష్యం దొరికితే అరెస్ట్​ చేయమంటూ సవాల్​ విసిరినంత పనిచేశారు. తీరా పక్కా ఆధారాలతో అరెస్ట్​ చేయగానే వణకిపోయారు. దీంతో బలవంతులైన తమపై ఒక న్యాయవాది చేస్తున్న పోరాటాన్ని జీర్ణించుకోలేక అహం దెబ్బతినటమే హత్యకు కేసులో 10 మంది నిందితుల్లో 8 మందిని అరెస్ట్​ చేశారు. పరారీలోని ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

క్షణికావేశంలో హత్య : ఇటీవల జరిగిన ఘటనలో రూ.500ల కోసం మిత్రుడి హతం. మరో ఘటనలో నచ్చిన కూర వండలేదని భార్యపై దాడి చివరికి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ తరహా ఘటనల్లో అధికశాతం మద్యం మత్తు, కోపానికి గురైనవారే ఉంటున్నారు. క్షణికావేశంలో తప్పుచేశామంటూ పోలీసులు ఎదుట కన్నీరు పెట్టుకుంటున్నారని ఇన్​స్పెక్టర్​ పేర్కొన్నారు. జాతీయ నేరగణాంక సంస్థ ఎన్​సీఆర్​బీ 2024 నివేదిక ప్రకారం హైదరాబాద్​ 358 హత్య కేసులు నమోదయ్యాయి.

కారణాలు అవేనా : ఈ హత్యల్లో 16 శాతం వ్యక్తిగత కక్షలు, 33 శాతం ఆర్థిక, భూ వివాదాలున్నాయి. అక్రమ సంబంధాలు, ప్రేమ, వరకట్న హత్యలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. తమ ఇష్టానికి అడ్డుగా వచ్చినా భరించలేకపోవటం, అహం దెబ్బతినటం తట్టుకోలేకపోతున్నారు. ఇలా చేస్తే కేసుల్లో ఇరుక్కుంటామని తెలిసినా శిక్షపడేందుకు చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతో ఇలాంటి దారుణాలకు తెగిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారి విశ్లేషించారు.

తప్పించుకోవడం అసాధ్యం : నేరం చేసినవారు ఏ విధంగా తప్పించుకోవాలనే ఆలోచనతో ఉంటారు. కానీ హత్య వంటి తీవ్రమైన నేరం చేసి తప్పించుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యమనే చెప్పాలి. ఎక్కడా ఆనవాళ్లు లేవని భ్రమించి తన భార్యను హత్య చేసి ముక్కలు చేసి కాల్చి, నీళ్లల్లో కలిపిన గురుమూర్తి కూడా రెండు రోజుల్లోనే దొరికేశాడు. కరడుగట్టిన నేరగాళ్లను కూడా గంటల వ్యవధిలోనే పట్టేసుకుంటున్నారు. నేరం అనేది తెలిసి చేసినా, తెలియక చేసినా ఆ తర్వాత మిగతా జీవితం అంతా బాధ అనుభవించాల్సిందే. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ నేరం చేయాలనే ఆలోచన మనసులోకి రానివ్వకూడదు. వచ్చిందంటే మాత్రం జీవితం గాలిలో దీపమే.

సోషల్​ మీడియాతో సమస్యలు : పెద్దల సమక్షంలో, వేద మంత్రాల సాక్షిగా పెళ్లిళ్లు చేసుకున్న కొందరు వివాహం బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు. వివాహేతర సంబంధాల కోసం హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. దాని ద్వారా కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నారు. ఇలాంటి ఘటనల్లో తల్లి లేదా తండ్రి మృతి చెందడం, జైలు పాలవడంతో పిల్లలు అనాథలవుతున్నారు. వివాహేతర సంబంధాలు చాలా సోషల్​ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తులు లేదా కుటుంబానికి బాగా తెలిసిన వారితోనే ఉంటున్నాయి. ఇవి భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో భార్య లేదా భర్తను హతమార్చేందుకు సైతం వెనకాడటం లేదు.

పంతం ముందు నిలబడలేకపోతున్న ప్రాణాలు - చిన్నపాటి వివాదాలకు హత్యలు, ఆత్మహత్యలు

హత్యలకు కేరాఫ్​గా నల్లమల అడవులు - పర్యాటకం పేరుతో ప్రవేశించి అరాచకాలు