అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు - శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
శివ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు- పరమశివుడికి పూజలు, అభిషేకాలు చేసిన భక్తులు, కోటప్పకొండకు భారీగా తరలివచ్చిన భక్తులు - ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 16, 2026 at 10:00 AM IST
Mahashivaratri celebrations in AP: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రభలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు ప్రభలను తీసుకొని భారీగా కోటప్పకొండకు తరలివచ్చారు. మునుపెన్నడూ లేనిరీతిలో రాత్రి 1గంట నుంచే దర్శనాలు కల్పించడంతో భక్తులు ఇబ్బందులు పడకుండా ముందుకుసాగారు. మెట్ల మార్గం భక్తులతో కిటకిటలాడింది. శ్రీత్రికోటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.
పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రులు: ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్, హోంమంత్రి అనిత, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుతోపాటు కలెక్టర్ కలిసి స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. జాతర సందర్భంగా ప్రోక్లెయినర్ విన్యాసాలు భక్తులను అలరించాయి.రాత్రివేళ ప్రభల వెలుగులతో ఆ ప్రాంతమంతా వెలిగిపోయింది. భారీగా భక్తుల రాకతో కోటప్పకొండ జనసంద్రంగా మారింది. ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు సాంకేతిక కారణంగా ఆగిపోవడంతో బస్సుల రాకపోకలు చాలాసేపు నిలిచిపోయాయి. దీంతో కొండమీద, కొండ కింద వేలాది మంది భక్తులు ఆగిపోయారు.
కొండపై నుంచి కిందకుకెళ్లే మార్గం లేక భక్తులందరూ ఘాట్ రోడ్డులో నడిచివెళ్లేందుకు ప్రయత్నం చేయగా మరింత ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కోటప్పకొండ మెట్ల మార్గంలో భక్తుల రద్దీ పెరగడంతో ఊపిరి ఆడక 10 ఏళ్ల పాప అపస్మారక స్థితిలోకి వెళ్లింది.108 వాహనంలో పాపను పోలీసులు వైద్యశాలకు తరలించారు. గుడ్లవల్లికి చెందిన బాలిక నందిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పోటెత్తిన భక్తులు: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గ్రామాలపాడులో ఇటీవల పునర్నిర్మాణం గావించిన శ్రీ చెన్నుమల్లికార్జున స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా ట్రూత్ వివేకామృతం స్పిరిట్యువల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎస్ఎల్‌వీ అమరావతి కమ్యూనిటీ హాల్‌లో శివచైతన్య సుజ్ఞాన సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఆధ్యాత్మిక గురువు శ్రీ వివేకానంద సనాతన సంప్రదాయ మూల గ్రంథాలలోని అత్యంత నిగూఢమైన శివ చైతన్యం గురించి అనుగ్రహభాషణం చేశారు. యనమలకుదురు రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. రంగురంగుల విద్యుత్ కాంతులతో ప్రభలు ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తపాలెంలోని బాలకోటేశ్వరస్వామి, సోపిరాలలో కోటేశ్వరస్వామి దేవాలయాల్లో తిరునాళ్ల మహోత్సవం కనులపండువగా సాగింది.
కిటకిటలాడిన శైవాలయాలు: మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయం ప్రాంగణంలో కల్యాణోత్సవం కనులపండువగా సాగింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పార్వతీపురంలో ఉమా రామలింగేశ్వర ఆలయం, పశుపతి నాద ఆలయం వద్ద లింగోద్భవ పూజలు జరిగాయి. కోనసీమ జిల్లా అమలాపురంలోని బ్రహ్మకుమారి హార్మోని హౌస్ వద్ద ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాలను భక్తులు దర్శించుకున్నారు. ఇమ్మిడివరప్పాడులో పరమశివుని ఆరాధిస్తూ శూలాల ధారణ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
అనంతపురంలోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, శివకోటి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కన్యతీర్థం, ఆగస్తేస్వర స్వామి కోన, సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెండ్లిమర్రి మండలం పొలతల మల్లేశ్వర స్వామి క్షేత్రంలో స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.
101 శివలింగాల ఆవిష్కరణ: ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. శివరాత్రిని పురస్కరించుకుని కర్నూలు జిల్లాకు చెందిన చిత్రకారుడు మల్లికార్జున అద్భుతమైన సూక్ష్మ చిత్రాన్ని ఆవిష్కరించారు. చిన్న శంఖంపై నంది, పరమ శివున్ని చిత్రంతోపాటు 101 శివలింగాలను ఆవిష్కరించి భక్తితత్వాన్ని చాటుకున్నారు.
కోటప్పకొండలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు - అశేష భక్తజనంతో కిటకిటలాడుతున్న ఆలయం
మహాశివరాత్రి రోజు ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా?

