ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై ముగిసిన కళ్యాణోత్సవాలు - మేళతాళాల మధ్య ఊరేగింపు

ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి కళ్యాణోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా పండితుల విశేషపూజలు - సాయంత్రం మండపారాధన, కలశారాధన, బలిహరణ

Maha Shivaratri Kalyanotsavam Celebrations at Indrakeeladri
Maha Shivaratri Kalyanotsavam Celebrations at Indrakeeladri (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 16, 2026 at 8:35 PM IST

2 Min Read
Choose ETV Bharat

Maha Shivaratri Kalyanotsavam Celebrations at Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి కళ్యాణోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల సందర్భంగా శాస్త్రోక్తంగా విశేషపూజలు నిర్వహించారు. మండప పూజ, మూలమంత్ర హవనం తర్వాత హారతి, మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం వేద పండితుల పర్యవేక్షణలో సదస్యం కార్యక్రమం నిర్వహించారు. పూజల్లో దేవస్థాన చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్‌ సతీసమేతంగా పాల్గొన్నారు.

ఉత్సవాల ముగింపు సందర్భంగా సాయంత్రం 4 గంటల నుంచి మంటపారాధన, కలశారాధన, బలిహరణ కార్యక్రమాలు జరిగాయి. మేళతాళాల మధ్య శివాలయం నుంచి ఊరేగింపు నిర్వహించారు. కనకదుర్గ నగర్, బ్రాహ్మణ వీధి, పాత శివాలయం, మెయిన్ బజార్. కెనాల్ రోడ్డు మీదుగా రథం సెంటర్ వరకు శోభాయాత్ర సాగింది. రథోత్సవం అనంతరం ఉత్సవ మూర్తులు తిరిగి కనకదుర్గ నగర్ మీదుగా శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకోవడంతో ఈ ఏడాది కళ్యాణోత్సవాలు ఘనంగా ముగుస్తాయని ఆలయ అధికారులు తెలిపారు.

లేపాక్షిలో మహాశివరాత్రి: శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామి బ్రహ్మరథోత్సవం కన్నుల పండువగా సాగింది. హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో భక్తులు రథాన్ని లాగారు. ఆలయ కమిటీ చైర్మన్ రమానందన్ ఆధ్వర్యంలో అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరా ద్వారా నిఘా ఉంచారు. ఈ రథోత్సవానికి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. భక్తులకు అన్నప్రసాదాలు, పానీయాలు ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు, కోలాటాలతో బ్రహ్మరథోత్సవం వైభవంగా సాగింది.

అమ్మవార్ల రథోత్సవం: దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా జాగరణ చేసిన భక్తులు భారీగా తరలివచ్చి లింగోద్భవ దర్శనం చేసుకున్నారు. మహాశివరాత్రిని పురష్కరించుకుని ఆదివారం లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా టికెట్ల రూపంలో రూ.55 లక్షల ఆదాయం ఆలయానికి సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీజ్ఞాన ప్రసూనాంబికాదేవి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చి ఆలయానికి చేరుకున్నారు. నేడు స్వామి, అమ్మవార్ల రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు - శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

రాష్ట్రవ్యాప్తంగా మహా శివరాత్రి ఉత్సవాలు - ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు