ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం మహోత్సవం - మరో 2 రోజుల్లోనే ప్రారంభం
ఆలయ తేజస్సు పెంచే కుంభాభిషేకం - 12 ఏళ్లకోకసారి ఘనంగా నిర్వహణ - ఆగమ శాస్త్రం ప్రకారం మార్చి 6,7,8 తేదీల్లో జరిగే పవిత్రమైన ప్రక్రియ- ఆలయంలోని యాగశాలలో 3 రోజులు ప్రత్యేక పూజలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 4, 2026 at 9:33 AM IST
Maha Kumbhabhishekam Mahotsavam 2026 from March 6th to 8th at Indrakeeladri : దుర్గగుడిలో 12 ఏళ్లకోకసారి ఘనంగా కుంభాభిషేకం నిర్వహిస్తుంటారు. మరో 2 రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఆగమ శాస్త్రం ప్రకారం మార్చి 6,7,8 తేదీల్లో జరిగే పవిత్రమైన ప్రక్రియగా చెబుతుంటారు.
వేడుకల్లో భాగంగా ఆలయ విమాన గోపురాలకు సంప్రోక్షణలు నిర్వహిస్తారు. ఆలయ తేజస్సు మరింత పెంపొందించడాకి పండితులు వేద మంత్ర సహిత ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తారు. కంచికామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి 3 రోజులు ఇక్కడే ఉండి క్రతువును జరిపిస్తారు.
2012 తర్వాత 2 ఏళ్లలోనే : దుర్గగుడిలో 2012లో కుంభాభిషేకం జరిగింది. 2014లో ప్రధాన రాజగోపురం ప్రతిష్ఠ సందర్భంగా 2 ఏళ్ల వ్యవధిలోనే మళ్లీ కుంభాభిషేకం నిర్వహించారు. అక్కడి నుంచి 12 ఏళ్ల తర్వాత అనగా ప్రస్తుతం 2026లో కుంభాభిషేకం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
యాగశాలలో 3 రోజులు ప్రత్యేక పూజలు : ఆలయంలోని విగ్రహాలు, గోపురాలకు పునరుజ్జీవనం కల్పించడమే కుంభాభిషేకం ప్రధాన ఉద్దేశం. సకల నదులు, సముద్రాలు, తీర్థాల జలాలను సేకరిస్తారు. వాటిని తీసుకు వచ్చి ఆలయంలోని యాగశాలలో 3 రోజులు ప్రత్యేక పూజలు జరుపుతారు. ఆ తర్వాత వాటిని గోపురాలు, కలశాలకు అభిషేకం చేస్తారు.
భక్తులకు ప్రవేశం ఉండదు : లక్షలాదిమంది తరలి వస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో చెబుతుండడంతో నిత్యం వందల మంది దేవస్థానం టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు అడుగుతున్నారని అధికారులు చెబుతున్నారు. యాగశాల ప్రాంతంలోకి భక్తులు ఎవరినీ అనుమతించారని వెల్లడించారు. ఇది అంతర్గత కార్యక్రమం. అయితే అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అని అధికారులు వివరించారు.
ఏ రోజు ఏం చేస్తారంటే?
- ఈనెల 6వ తేదీన యాగశాలలో ఉదయం 8 నుంచి గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, పంచగవ్వ ప్రాశనం, అఖండ దీపారాధన
- అదే రోజు సాయంత్రం 4 నుంచి అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపన, మూలమంత్ర నామములు, హారతి, రాత్రి 7 మంత్ర పుష్పం
- ఈనెల 7వ తేదీన ఉదయం 8 గంటల నుంచి పవిత్ర నదీ, సముద్ర జలాలతో అష్టోత్తర కలశస్థాపన, పూజ, పీఠ పూజలు, మధ్యాహ్నం 12 గంటలకు మూలమంత్ర హవనములు
- సాయంత్రం 4 గంటల నుంచి మూలమంత్ర హవనములు, ప్రదోషకాల పీఠ పూజలు, హారతి, రాత్రి 7 గంటలకు మంత్ర పుష్పం
- ఈనెల 8వ తేదీన ఉదయం 7 నుంచి మంటప పూజలు, మూలమంత్ర హవనములు, ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి.
- ఉదయం 9.34 నిమిషాలకు మేష లగ్నంలో అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో కుంభాభిషేక క్రతువు జరిపిస్తారు.
భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం: కుంభాభిషేకానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఎంత భక్తి భావంతో వస్తారో, అంతే పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. పిల్లలు, వృద్ధులకు కావల్సిన సదుపాయాలను కల్పిస్తామన్నారు. దసరా పండుగ సమయంలో రోజుకు లక్ష మంది వచ్చినప్పుడు ఎలాగైతే అన్ని సదుపాయాలు కల్పించామో, ఆ విధంగానే ఇప్పడు కూడా రోజుకు 3 లక్షల మంది వచ్చినా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా యంత్రాంగం చూసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఈ సారి కూడా కుంభాభిషేకాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.
ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవం - మార్చి 6 నుంచి మూడు రోజులపాటు వేడుకలు
'దుర్గమ్మ చెంత - పార్కింగ్ చింత' - సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భక్తుల వినతులు

