నా కుమారుడు గోపీనాథ్ మరణం మిస్టరీగా అనిపిస్తోంది - తల్లి సంచలన వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కీలక పరిణామం - తన కుమారుడి మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన గోపీనాథ్ తల్లి - కుమారుడు ఎప్పుడు చనిపోయాడో తల్లిగా తనకే తెలియదని వ్యాఖ్య

Published : November 9, 2025 at 5:38 PM IST
Maganti Gopinath Mother Press Meet Over Her son Death : జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తన కుమారుడైన మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీగా అనిపిస్తోందని ఆయన తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎప్పుడు మృతిచెందారన్నది తల్లిగా తనకే తెలీదన్నారు. ‘జూన్ 6వ తేదీన చనిపోయారా 8న చనిపోయారా?’ అన్నదీ సందేహంగానే ఉందని వివరించారు. కేటీఆర్ అమెరికా నుంచి వచ్చిన తర్వాతే గోపీనాథ్ మరణ వార్తను బయటకు చెప్పటం వెనక పరమార్థం ఏంటో ఇప్పటికీ తెలియటం లేదన్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో గోపీనాథ్ మొదటి భార్య మాలిని, ఆమె కుమారుడు తారక్‌తో కలిసి మహానంద కుమారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మృతిపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు.
తల్లిగా ఎంతో బాధ పడుతున్నా : గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై గొప్ప పేరు తెచ్చుకున్నారని, అలాంటి వ్యక్తి హాస్పిటల్లో ఉంటే ఒక్క రోజు కూడా తనను చూడటానికి టైమ్ ఇవ్వలేదని ఆయన తల్లి మహానంద కుమారి వాపోయారు. ఒక్క అటెండర్‌ను కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గోపీనాథ్ జూన్ 8న చనిపోయారని చెప్పారని వివరించారు. కేటీఆర్ వచ్చిన అనంతరం గోపీనాథ్ మరణవార్తను బయటకు చెప్పారని ఆయన తల్లి ఆరోపించారు. లీగల్ హెయిర్ సర్టిఫికెట్‌లో మొదటి భార్య, బిడ్డలు, తన పేరు కూడా లేదన్నారు. మొదటి భార్యతో విడాకులు కూడా కాలేదని చెప్పారు. తాను గోపీనాథ్‌తో సునీత పెళ్లి చేయలేదన్నారు. ఫ్యామిలీ సర్టిఫికెట్‌లో తమ పేరు లేదని వివరించారు. కేటీఆర్‌తో తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలి అనుకుంటే ఆయన కూడా వినలేదన్నారు. ఇది డబ్బు సమస్య కాదని మాకు గుర్తింపు లేకనే ఇలా మీడియా ముందుకొచ్చామన్నారు. తల్లిగా ఎంతో బాధపడుతున్నానని అన్నారు. సునీతకు టికెట్ ఇచ్చేటప్పుడు కేటీఆర్ తనకు కనీసం సమాచారం ఇవ్వలేదన్నారు.
" నాకుమారుడు గోపీనాథ్ ఎప్పుడు చనిపోయారనేది తల్లిగా నాకే తెలియదు. ఐదో తేదీన చనిపోయారని కొంతమంది, ఎనిమిదో తేదీన మృతిచెందారని మరొకరు అంటున్నారు. అమెరికా నుంచి కేటీఆర్ వచ్చిన తర్వాత గోపీనాథ్ మృతి చెందారని ప్రకటించారు. తల్లిగా నాకు చెప్పకుండా చేశారు. నేను చూసేందుకు కూడా అవకాశం కల్పించలేదు. పొద్దున్నే అంత అర్జెంటుగా దహనం చేయాల్సిన అవసరం ఏంటో అర్థం కావడం లేదు"- మహానంద కుమారి, గోపీనాథ్ తల్లి
మాకు గుర్తింపు లేదు : తమకు లీగల్‌గా ఎలాంటి గుర్తింపు లేదని గోపీనాథ్ మొదటి భార్యకుమారుడైన తారక్ ఆవేదన వ్యక్తం చేశారు. 'అమ్మతో చట్టపరంగా విడాకులు కాలేదు. తారక్ అంటే ఎవరో తెలియదన్న మాగంటి సునీత జూన్ 6వ తేదీన నాకు మొదటి సారి కాల్ చేశారు. ఎవరో తెలియకపోతే ఎందుకు ఫోన్ చేసినట్లు? గ్రాడ్యుయేషన్ డేకి రావాలని మా నాన్న అనుకున్నారు. కానీ, ఇంతలోనే హఠాత్తుగా మృతిచెందారు. సునీత నాకు ఫోన్ చేసి నువ్వు ఇండియా రావాల్సిన అవసరం లేదు. రెజ్యూమ్ పంపితే కేటీఆర్ అంకుల్ కంపెనీస్‌లో జాబ్ ఇప్పిస్తామని చెప్పారని తెలిపారు. జూన్ 25వ తేదీన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అప్లై చేశారు. అప్పుడు అఫిడవిట్‌లో ఎవరి పేర్లు పెట్టారనేది నాకు తెలియదు. మా అమ్మ, నాన్నమ్మ, నా పేర్లను లీగల్ హెయిర్ సర్టిఫికెట్‌లో పెట్టాలి' అని కోరారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం
ముగిసిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అంత్యక్రియలు - కన్నీటిపర్యంతమైన కేసీఆర్

